మాట్లాడుతున్న సీఎం రేవంత్. చిత్రంలో జయేశ్‌రంజన్, మాణిక్‌రాజ్, సర్ఫరాజ్, నారాయణరెడ్డి
భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. రోడ్ నెట్‌వర్క్‌ను ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని, భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణతోసహా అన్ని అంశాలు ఈ సిస్టంలో చేర్చాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్లు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, ఇతర రోడ్లు ఈ వ్యవస్థ పరిధిలోకి రావాలన్నారు. ఓఆర్‌ఆర్‌పైన ఎక్కడికక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఓఆర్‌ఆర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ రోడ్డు నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఆ భూములకే టీడీఆర్..
టీడీఆర్‌పైన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ చేయాలని స్పష్టం చేశారు. టీడీఆర్ ప్రక్రియను మొత్తం ఆన్‌లైన్ చేయాలన్నారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్–1ను డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వివరించారు. రోడ్ల నిర్మాణం నాణ్యతలో రాజీ లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బద్వేల్ ఇంటర్ చేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకమన్నారు.
భవిష్యత్ రోడ్ల అభివృద్ధిపైనే..
ఎలివేటెడ్ కారిడార్–1, కారిడార్–2 పనులను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎలివేటెడ్ కారిడార్–3 బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ పనులను త్వరగా మొదలుపెట్టాలన్నారు. హైదరాబాద్ నగర భవిష్యత్ రోడ్ల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని తెలిపారు. భూసేకరణ వేగవంతం చేయాలని, ఈ విషయంలో అలసత్వం చూపించొద్దని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి) జయేశ్‌రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.


