సుల్తానియాను అరెస్టు చేయండి | High Court orders Hyderabad CP on Sandeep Kumar Sultania | Sakshi
Sakshi News home page

సుల్తానియాను అరెస్టు చేయండి

Aug 7 2026 5:51 AM | Updated on Aug 7 2026 5:51 AM

High Court orders Hyderabad CP on Sandeep Kumar Sultania

ఎక్కడ కన్పిస్తే అక్కడ అదుపులోకి తీసుకోండి 

సురక్షిత కస్టడీలో ఉంచి శుక్రవారం కోర్టులో హాజరుపరచండి.. రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పిస్తే విడుదల చేయండి

హైదరాబాద్‌ సీపీకి హైకోర్టు ఆదేశం 

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి బెయిలబుల్‌ వారెంట్‌ జారీ.. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘించడంపై సీరియస్‌

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని దాఖలైన ధిక్కరణ కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆయన ఎక్కడ కన్పించినా అరెస్టు చేసి సురక్షిత కస్టడీలో ఉంచాలని, ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుపరచాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. వారెంట్‌ను అమలు చేయాలంటూ గురువారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని వెంటనే సీపీకి తెలియజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే సుల్తానియా రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి, శుక్రవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తే బెయిల్‌పై విడుదల చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత కూడా న్యాయస్థానం తదుపరి ఆదేశాలిచ్చే వరకు అవసరమైనప్పుడు సుల్తానియా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందనే షరతు విధించింది. వారెంట్‌ను ఏ విధంగా అమలు చేశారన్న వివరాలతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా, సాధ్యమైనంత వరకు ఆగస్టు 7లోపే హైకోర్టుకు సమర్పించాలని పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. ఒకవేళ వారెంట్‌ను అమలు చేయలేకపోతే సరైన కారణాలను కూడా నివేదికలో స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.  

కంటోన్మెంట్‌ బోర్డుకు బకాయిల విడుదల కేసులో.. 
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు రావాల్సిన స్టాంప్‌ డ్యూటీ సర్‌చార్జి బకాయిల విడుదలకు సంబంధించి సమర్పించిన వినతిపత్రంపై నాలుగు వారాల్లో చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని 2024లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుమారు రూ.33.42 కోట్ల బకాయిలను 8 వారాల్లో విడుదల చేయాలని, ఆలస్యమైతే ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించడంతో పాటు ఆలస్యానికి గాను ప్రతి నెలా సైనిక సంక్షేమ నిధికి రూ.లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది.  

ఏడాదైనా అమలు కాలేదంటూ.. 
హైకోర్టు 2024లో ఇచ్చిన ఆదేశాలను సుల్తానియా ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ఆరోపిస్తూ పిటిషనర్‌ రామకృష్ణ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకుని శిక్షించాలని కోరారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి మొదట సుల్తానియాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని, అలా చేయడంలో విఫలమైతే కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే తదుపరి విచారణల సందర్భంగా..కౌంటర్‌ దాఖలు చేయలేదని, కనీసం ఆయన తరఫున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదని గమనించిన న్యాయమూర్తి.. సుల్తానియా హాజరుకు ఆదేశించారు. 

సమయం ఇవ్వాలన్న జీపీ విజ్ఞప్తి తిరస్కరణ 
ఇదే పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ ధిక్కరణ కేసులో దాఖలైన అఫిడవిట్‌తో పాటు ఏప్రిల్‌ 17, జూన్‌ 18 తేదీల్లో ఇచ్చిన గత ఆదేశాలను న్యాయమూర్తి పరిశీలించారు. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేయడానికి మరింత సమయం కోరిన విషయం గమనించారు. ఎటువంటి కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో పాటు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఎలాంటి దరఖాస్తు కూడా దాఖలు చేయలేదని గుర్తించారు. జీపీ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆయన్ను అరెస్టు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో..తదుపరి పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement