అందుబాటులో ఉంచాలన్న ఐసీఎమ్‌ఆర్–యూనిసెఫ్
1 నుంచి 12వ తరగతి వరకు పోషకాహార విద్య
పిల్లలకు ఆరోగ్య, పోషకాహార రిపోర్ట్ కార్డులు
రోజూ 60 నిమిషాలు శారీరక శ్రమ, వ్యాయామం
బాల్యంలో ఊబకాయానికి చెక్ పెట్టే మార్గమిదే
సాక్షి, హైదరాబాద్: బాలబాలికల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఊబకాయాన్ని, అధిక బరువు సమస్యను అరికట్టడానికి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్), యూనిసెఫ్ సంయుక్త నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని పాఠశాలల్లో 1 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల దినచర్యలో నైపుణ్యాధారిత పోషకాహార విద్యను ఒక భాగం చేయాలని సిఫార్సు చేసింది. పిల్లల ఆహారపు అలవాట్లు, శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఏటా వారికి ప్రామాణిక ఆరోగ్య, పోషకాహార ప్రగతి పత్రాలను (రిపోర్ట్ కార్డులను) అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.ఈ సమగ్ర
నివేదికను ఐసీఎమ్‌ఆర్–జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్), యూనిసెఫ్ ఇండియా, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రూపొందించాయి. ’లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్’ కూటమి నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ’న్యూట్రిషన్ ఎన్విరాన్‌మెంట్ అసెస్‌మెంట్ టూల్‌కిట్ ఫర్ స్కూల్స్’ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 24.60 కోట్ల మంది పిల్లలు 14.70 లక్షల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరు తమ 10–12 సంవత్సరాల పాఠశాల జీవితంలో దాదాపు 12,000 గంటలకు పైగా సమయాన్ని పాఠశాల వాతావరణంలోనే గడుపుతారు. అందువల్ల పిల్లల ఆహారపు అలవాట్లను సరైన మార్గంలో పెట్టడానికి, వారి దీర్ఘకాలిక ఆరోగ్య పునాదులను బలోపేతం చేయడానికి ఇదే అత్యంత కీలక సమయమని నివేదిక పేర్కొంది.
రోజూ కనీసం 60 నిమిషాలు..
పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ, ముఖ్యంగా 11, 12వ తరగతి విద్యార్థులతో సహా రోజూ కనీసం 60 నిమిషాల పాటు నిర్దేశిత శారీరక శ్రమ లేదా వ్యాయామం ఉండేలా పాఠశాల సమయ పట్టికను రూపొందించాలని నివేదిక సూచించింది. వ్యాయామంలో బాలికల భాగస్వామ్యాన్ని సమానంగా పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఎందుకంటే, 10–14 ఏళ్ల వయసున్న బాలికలు రోజుకు 25 నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం చేస్తుండగా, అది 15–19 ఏళ్ల వయసుకు వచ్చేసరికి కేవలం 10 నిమిషాలకు పడిపోతోంది. అదే సమయంలో బాలురు ఈ వయసులలో వరుసగా 40, 50 నిమిషాల పాటు శారీరక శ్రమలో పాల్గొంటున్నారు.
తాజా పండ్లు, సంప్రదాయక ఉపహారాలు..
పాఠశాలల్లోని క్యాంటీన్ల వాతావరణాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నివేదిక పిలుపునిచ్చింది. నూనెలో వేయించిన, ప్యాకెట్లలో లభించే అనారోగ్యకర ఆహార పదార్థాల స్థానంలో తాజా పండ్లు, సంప్రదాయక ఉపహారాలు, మొలకెత్తిన గింజలు, పిక్కలు, మజ్జిగ, చిరుధాన్యాలు (మిల్లెట్స్), తృణధాన్యాలను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పోషక విలువలున్న ఆహార పదార్థాలు పిల్లలకు తక్కువ ధరకే లభించేలా ధరల నియంత్రణ విధానాన్ని తీసుకురావాలని, అప్పుడే విద్యార్థులు ఆరోగ్యకర ఆహారాన్ని ఎంచుకుంటారని పేర్కొంది. పాఠశాలల్లో ’ఆరోగ్యకరమైన భోజన దినాలు’ లేదా ప్రత్యేక ’ఆరోగ్యకరమైన స్నాక్స్ కార్నర్’ ఏర్పాటు చేయాలని సూచించింది. క్యాంటీన్ నిర్వహించే వారందరికీ భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, వారికి ఏటా ఆహార భద్రత, పరిశుభ్రతపై శిక్షణ ఇవ్వాలని తేల్చిచెప్పింది.
తక్షణమే అమలులోకి తేవాలి..
18 సంవత్సరాల లోపు పిల్లలను లక్ష్యంగా చేసుకుని అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాల ప్రత్యక్ష, పరోక్ష మార్కెటింగ్ లేదా ప్రకటనలను పూర్తిగా నిషేధించాలని నివేదిక కోరింది. ఇందుకోసం ఈ ఆహారాలకు సంబంధించి స్పష్టమైన, ఏకరూప నియంత్రణ నిర్వచనాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారికంగా రూపొందించాలని తెలిపింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2020 నాటి పాఠశాల పిల్లల సురక్షిత, సమతుల్య ఆహార నిబంధనలలో పెండింగ్‌లో ఉన్న నిబంధనలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా పాఠశాల ప్రాంగణంలో అధిక కొవ్వు, ట్రాన్స్–ఫ్యాట్, అదనపు చక్కెర, సోడియం ఉన్న ఆహారాలను విక్రయించడాన్ని నిషేధించే నిబంధన 3(5)ను, పాఠశాల గేట్ల నుండి 50 మీటర్ల పరిధిలో ఇటువంటి ఆహార పదార్థాల ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలను నిషేధించే నిబంధన 5(1)ను కఠినంగా అమలు చేయాలని సిఫార్సు చేసింది.
పొంచి ఉన్న ముప్పు..
దేశంలో 5–19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువత దాదాపు 56.10 కోట్ల మంది ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో 28.5 శాతం. అయితే 2025 నాటికి ఈ వయసు పిల్లల్లో దాదాపు 4.10 కోట్ల మంది అధిక బరువు, ఊబకాయంతో జీవిస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాలబాలికల్లో ఊబకాయుల్లో భారత్ వాటా 11 శాతానికి పైగా ఉంటుందని నివేదిక హెచ్చరించింది.
దేశంలో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల వంటి ఆహార సంబంధిత అంటువ్యాధులు కాని దీర్ఘకాలిక రోగాలు (ఎన్‌సీడీలు) వేగంగా పెరుగుతున్నాయి. ఐసీఎమ్‌ఆర్–ఇండియా డయాబెట్స్ అధ్యయనం ప్రకారం దేశంలో ప్రస్తుతం 10.10 కోట్ల మందికి పైగా పెద్దలు మధుమేహంతో, దాదాపు 31.50 కోట్ల మంది రక్తపోటుతో, 25.40 కోట్ల మంది సాధారణ ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లల్లో చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకర ప్రవర్తనను అలవర్చడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఇటువంటి ముప్పులను నివారించవచ్చని నివేదిక స్పష్టం చేసింది.


