దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్ నుంచే అమలు...
ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు
గురువారం నుంచి మరో 10 జిల్లాలకు విస్తరణ
సాక్షి, హైదరాబాద్: ఎరువుల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) విధానా న్ని తెలంగాణలో మరో 10 జిల్లాలకు విస్తరించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం రూపొందించిన ఈ ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను పైలెట్ ప్రాజెక్టుగా మొదటి దశలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రారంభించారు.
దీనికి కొనసాగింపుగా రెండో దశలో గురువారం నుంచి నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం–ఆసిఫాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో రైతులు ఎరువుల కోసం ముందుగా ఈ యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, రైతు వివరాలు పొందుపరచాలి. అనంతరం ఆయా జిల్లాల్లోని దుకాణాలు, పీఏసీఎస్‌లలో లభ్యతను బట్టి ఎరువులు రైతులకు పంపిణీ అవుతాయి.
‘ఫెర్టిలైజర్ యాప్’ఆదర్శంగా...
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ గత సంవత్సరం ఖరీఫ్‌లో ‘ఫెర్టిలైజర్ యాప్’ను రూపొందించింది. ఖరీఫ్ సీజన్ మధ్యలో ప్రారంభించిన ఈ యాప్ కొన్ని జిల్లాలకే పరిమితమైంది. అయితే గత రబీ (యాసంగి) సీజన్ నాటికి ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఈ యాప్ పనితీరును పరిశీలించిన కేంద్ర వ్యవసాయశాఖ ఈ ఖరీఫ్ నుంచి దేశమంతా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ‘ఫెర్టిలైజర్ యాప్’నమూనాతో ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్’యాప్‌ను రూపొందించింది.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ ఎలా పనిచేస్తుందంటే...
రైతు మొబైల్‌లో ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆధార్/రైతు ఐడీ, మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకుంటాడు. రైతు అవసరమైన ఎరువు (యూరి యా, డీఏపీ, ఎన్‌పీకే మొదలైనవి), కావాల్సిన పరిమాణం, ఏ డీలర్ లేదా పీఏసీఎస్ వద్ద తీసుకోవాలనుకుంటున్నాడో యాప్‌లో ఎంపిక చేసుకుంటాడు. దీంతో ఆ డీలర్ వద్ద స్టాక్ ముందుగానే రిజర్వ్ అవుతుంది. బుకింగ్ పూర్తయ్యాక రైతు మొబైల్‌కు ప్రత్యేక క్యూఆర్ కోడ్ వస్తుంది.
అదే కొనుగోలు టోకెన్‌గా పనిచేస్తుంది. రైతు ఎంపిక చేసిన దుకాణానికి వెళ్లి క్యూఆర్ కోడ్ చూపిస్తాడు. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ అనంతరం ఎరువులు అందజేస్తారు. ఈ యాప్ ద్వారా తమ సమీపంలోని ఏ దుకాణంలో, ఎంత స్టాక్ ఉందో రైతు యాప్‌లోనే చూడొచ్చు. ‘ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు గత సంవత్సరం రాష్ట్రంలో అమలు చేసిన ‘ఫెర్టిలైజర్ యాప్’ను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తుండడం శుభపరిమాణం’అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.


