కేశ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే రకరకాల షాంపూలను ఉపయోగిస్తుంటాం. అయితే వాటిలో పలు రసాయనాలు ఉంటాయి. కొన్ని మరింత గాఢగా ఉంటాయి. దాంతో అవి జుట్టుని తొందరగా నెరిసిపోయేలా చేయడం లేదా..చిట్లిపోయేలా చేస్తుంటాయి. అందువల్లే ఎలాంటి షాంపూని ఎంచుకుంటే మంచిది అనే విషయంలో చాలామందికి కన్‌ఫ్యూజనే.
అయితే అలాంటి సమస్యలకు చెక్‌పెట్టేలా ప్రకృతి సదా ప్రత్యామ్నాయాన్ని అందిస్తూనే ఉంటుంది. అదే వృక్షసంబంధమైన "షాంపూ అల్లం". ఇది ఉష్ణమండల మొక్క. దీని జెల్‌లాంటి రసాన్ని తరతరాలుగా సంప్రదాయ షాంపూ ఫార్ములేషన్ల అవసరం లేకుండా జుట్టును సున్నితంగా శుభ్రపరచడానికి, పోషించడానికి , తేమగా ఉంచడానికి ఉపయోగిస్తున్నారు.
నిజంగానే షాంపూకి ప్రత్యామ్నాయమా?
పైన్‌కోన్ అల్లం లేదా అవాపుహి అని పిలిచే షాంపూ అల్లం. రసాయన ఆధారిత షాంపూలకు ఒక సహజ ప్రత్యామ్నాయం. దీని ముదిరిన పువ్వుల శంకువులు జారే స్వభావం గల, సువాసనతో కూడిన జెల్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని సాంప్రదాయకంగా సహజ షాంపూ కండిషనర్‌గా ఉపయోగిస్తారు.
కలిగే లాభాలు..
ఇది సహజంగా జుట్టుని శుభ్రపరుస్తుంది,కండిషన్ చేస్తుంది, తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా, ఇందులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ గుణాలున్న మొక్కల సమ్మేళనాలు కూడా ఉంటాయి. సల్ఫేట్లు, పారాబెన్లు, కృత్రిమ సువాసనలు వంటి పదార్థాలతో తయారు చేయబడిన సంప్రదాయ షాంపూలకు బదులుగా ఈ సహజసిద్ధమైన షాంపుతో ఎన్నో లాభాలు పొందొచ్చని చెబుతున్నారు వైద్యులు. ఇది జుట్టుని మృదువుగా, నునుపుగా ఉంచుతుందని అంటున్నారు.
అంతేగాదు చర్మానికి సున్నితమైన క్లెన్సర్‌గా కూడా ఉపయోగిస్తారని అన్నారు. ఈషాంపూ అల్లంలో జెరుంబోన్ వంటి సహజ మొక్కల సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయని చెప్పారు. అందువల్ల ఇది జుట్టు సంరక్షణకు సురక్షితమైనదని అన్నారు. అయితే ఇది రోజువారీ వాడకానికి మంచిదేనా కాదా అన్నదానిపై మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు.
(చదవండి: సైన్యంలోకి అందాల యువరాణి..!రాచరిక చరిత్రలో అరుదైన ఘట్టం..)


