చెన్నై: తమిళనాడుకు చెందిన నలుగురు తోబుట్టువులు అనుకోని విషాదాల కారణంగా చిన్నతనంలోనే విడిపోయారు. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక పెళ్లి ఫొటో సాయంతో మళ్లీ ఒక్కటయ్యారు. కేరళలోని ఆశ్రయ్ చిల్డ్రన్స్ హోమ్‌లో కనిపించిన ఈ భావోద్వేగ ఉదంతం అందరినీ కంటతడి పెట్టించింది. తమిళనాడులోని కళ్లకురిచ్చికి చెందిన ఈ కుటుంబంలో తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు అనాథలయ్యారు. తండ్రి మద్యానికి బానిస కావడంతో పెద్ద కుమార్తె సరస్వతి (5), శరణ్య (4), కుమారులు సురేష్, ఉమేష్ రోడ్డుపాలయ్యారు.
తండ్రి తన కుమార్తె శరణ్యను వేరే కుటుంబానికి విక్రయించి, మిగతా ముగ్గురు పిల్లలతో కేరళకు వలస వెళ్లాడు. 2002లో కన్నూరులో చిన్నారుల దుస్థితిని చూసిన కొల్లంనకు చెందిన అధికారి కలయపురమ్ జోస్, ఆయన భార్య మినీ వారిని చేరదీసి 'ఆశ్రయ్ చిల్డ్రన్స్ హోమ్'ను ఏర్పాటు చేసి పెంచారు. సరస్వతి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, రెండేళ్ల క్రితం కన్నూరుకు చెందిన నితిన్‌ను వివాహం చేసుకుంది. తమ్ముళ్లు సురేష్, ఉమేష్ ఐటీఐ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.
మరోవైపు శరణ్య సేలంలో పెరిగి, ఎం.ఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా స్థిరపడి హైదరాబాద్‌కు చెందిన రఘురామ్‌ను వివాహం చేసుకుంది. తోబుట్టువుల కోసం వెదుకుతున్న తరుణంలో శరణ్యకు రెండేళ్ల క్రితం జరిగిన సరస్వతి వివాహ వార్త, ఫొటోలు దొరికాయి. ఆ ఫొటోలోని మహిళతో తనకు ఉన్న పోలికల ఆధారంగా ఆమె కేరళలోని ఆశ్రయ్‌ను సంప్రదించింది. చివరకు శరణ్య తన భర్త, పిల్లలతో హైదరాబాద్ నుంచి రాగా, సరస్వతి తన భర్తతో కన్నూరు నుంచి వచ్చి ఆశ్రయ్‌లో కలుసుకున్నారు. 26 ఏళ్ల తర్వాత నలుగురు తోబుట్టువులు ఒకరినొకరు హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసిన నిర్వాహకులు, స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: ‘బిగ్ బీ’ రికార్డు: 83 ఏళ్ల వయసులో 24 గంటల షిఫ్ట్!


