బాబుల్‌ గావ్‌ బాధలకు విముక్తి! | collector Ashish sangwan responds to sakshi story | Sakshi
Sakshi News home page

బాబుల్‌ గావ్‌ బాధలకు విముక్తి!

Aug 7 2026 1:29 AM | Updated on Aug 7 2026 1:29 AM

collector Ashish sangwan responds to sakshi story

బాబుల్‌గావ్‌ గ్రామం

‘సాక్షి’కథనంతో స్పందించిన కలెక్టర్‌ సంగ్వాన్‌ 

చేయూత పింఛన్ల లాగిన్‌ సమస్య పరిష్కారం 

ఈ నెల 10 నుంచి గ్రామానికి బస్సు సౌకర్యం  

మిషన్‌ భగీరథ పనులకు రూ.14 లక్షలు మంజూరు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆ ఊరి ప్రజల కష్టాలకు ‘సాక్షి’పరిష్కారం చూపింది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న బాధలు తీరాయి. బాబుల్‌గావ్‌ గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నుంచి కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండలానికి మారుస్తూ 2023 జూన్‌ 26న ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ఈ గ్రామం కామారెడ్డి జిల్లా కేంద్రానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామం జిల్లా మార్పు అధికారికంగా జరిగి రెండేళ్లు గడచినా పాలనా పరమైన మార్పులు జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులపాలయ్యారు.

అటు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో.. ఇటు కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండలంలో పనులు జరగక అవస్థలు పడ్డారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘బాధల్‌ గావ్‌’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌ ఎడిషన్‌లో జూన్‌ 29న కథనం ప్రచురితమైంది. దీనిపై కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ స్పందించారు. సమస్యను సీరియస్‌గా తీసుకొని బాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డితోపాటు వివిధ శాఖల అ«ధికారులను గ్రామానికి పంపించి నివేదిక తెప్పించుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

సమస్యలకు పరిష్కారాలు.. 
 చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్‌ సమస్య వేధించింది. ఇదే అంశాన్ని ‘సాక్షి’ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఉన్నతాధికారులతో మాట్లాడి లాగిన్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈనెల 11 నుంచి యాక్టివేట్‌ కానుంది.  
 గ్రామానికి ఇప్పటి వరకు మిషన్‌ భగీరథ నీళ్లు రాలేదు. గ్రిడ్‌కు సంబంధించి పనులకు రూ.7 లక్షలు, ఇంట్రా పనులకు రూ.7 లక్షలు మంజూరు చేసిన కలెక్టర్‌ సంగ్వాన్‌.. వెంటనే పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.  

 వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి జుక్కల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పోచారం సబ్‌సెంటర్‌ నుంచి అన్ని సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.  
ఇంతవరకూ బస్సు ఎరుగని బాబుల్‌గావ్‌ గ్రామానికి ఈనెల 10 నుంచి బస్సు సర్వీస్‌ రానుంది.  
అంగన్‌వాడీ కేంద్రాలను కామారెడ్డి జిల్లా మద్నూర్‌ ప్రాజెక్టు పరిధిలోకి మార్చారు. ఎన్‌హెచ్‌టీఎస్‌ అప్లికేషన్, పోషణ్‌ ట్రాకర్‌లు అందుబాటులోకి వచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement