గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిర్ణయం
ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడమే కారణం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన ‘హైదరాబాద్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’(హిల్ట్ పి) గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఓఆర్‌ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలిస్తే.. ప్రస్తుతమున్న పారిశ్రామికవాడలను బహుళ వినియోగ ప్రాంతంగా (మిక్స్‌డ్/మల్టీ యూజ్ జోన్లు) మార్చుకోవడానికి అవకాశం కల్పించింది.
ఆ పారిశ్రామిక వాడల్లోని రహదారుల విస్తీర్ణం, రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా 30 నుంచి 50 శాతం మేరకు అభివృద్ధి ప్రభావిత రుసుము (డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు) చెల్లించి భూ వినియోగ మార్పిడికి ప్రభుత్వం అనుమతినిస్తోంది. ఈ అభివృద్ధి ప్రభావిత రుసుము అధికంగా ఉన్నందునే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. భూముల విలువలను జూన్ 5వ తేదీన ప్రభుత్వం పెంచినప్పటికీ.. అంతకు ముందున్న భూముల రిజిస్ట్రేషన్ ధర ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారికి పాత భూముల విలువలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
దరఖాస్తు చేసుకునే సమయంలో పదిశాతం డబ్బు చెల్లించి.. ఆ తరువాత మిగిలిన మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించేలా వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించిన సంగతి విదితమే. ప్రభుత్వం గుర్తించిన పారిశ్రామిక ప్రాంతాల్లోని భూముల వినియోగమార్పిడి ద్వారా దాదాపు రూ. 2,500 కోట్ల మేరకు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఆశించిన స్థాయిలో ఆదాయం మాత్రం రాకపోవడంతో అనివార్యంగా గడువును పొడిగించినట్టు సమాచారం.


