సత్వరమే ‘పారాక్వాట్‌’ నిషేధం! | Experts welcome proposed ban on deadly paraquat herbicide | Sakshi
Sakshi News home page

సత్వరమే ‘పారాక్వాట్‌’ నిషేధం!

Aug 7 2026 5:29 AM | Updated on Aug 7 2026 5:29 AM

Experts welcome proposed ban on deadly paraquat herbicide

ప్రతిపాదిత నిషేధంపై కేంద్రం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌.. ఈ నెల 13 వరకు ప్రజాభిప్రాయాలకు గడువు

సత్వర నిషేధానికి వైద్యులు,  వ్యవసాయ నిపుణులు, సామాజిక కార్యకర్తల సంపూర్ణ మద్దతు

దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు/గడ్డి మందు ‘పారాక్వాట్‌ డైక్లోరైడ్‌’ తయారీ, అమ్మకం, వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ‘క్రిమిసంహారక మందుల చట్టం–1968’లోని సెక్షన్‌ 27 కింద ఈ మేరకు గత నెల 13న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపే గడువు ఈ నెల 13తో ముగియనుంది. దీంతో, ఈ ప్రతిపాదిత నిషేధాజ్ఞలపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 

ఈ ప్రతిపాదిత నిషేధాన్ని ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలని ‘ఆశా–కిసాన్‌ స్వరాజ్‌’ జాతీయ సహ సమన్వయకర్త కవిత కురుగంటి నేతృత్వంలో 270 మందికి పైగా వైద్య నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి గురువారం సంయుక్త వినతిపత్రం సమర్పించారు. వీరిలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల వారున్నారు. 

పారాక్వాట్‌ అత్యంత తీవ్రమైన విషపూరిత గడ్డిమందు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్వల్ప పరిమాణంలో శరీరంలోకి వెళ్లినా ఇది ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఈ రసాయన విషప్రభావానికి గురైన వారిలో మరణాల రేటు ఏకంగా 70% వరకు ఉంటోంది. దీనికి ఇప్పటివరకు ఎటువంటి విరుగుడు అందుబాటులో లేదు. 

రసాయన పరిశ్రమల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం పారాక్వాట్‌పై నిషేధ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రిమిసంహారకాల నియంత్రణకు బలమైన ‘పెస్టిసైడ్స్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌’ తీసుకురావాలని కూడా నిపుణులు డిమాండ్‌ చేశారు. ఇతర దేశాల్లో నిషేధించిన ప్రమాదకర రసాయనాలను భారత్‌లోనూ స్వయంచాలకంగా నిషేధించాలన్నారు. 70కి పైగా దేశాలలో కొన్ని దేశాలు పారాక్వాట్‌ వినియోగాన్ని నిషేధించాయి, కొన్ని దేశాలు తీవ్రంగా నియంత్రించటం తెలిసిందే. 

అయితే, వ్యవసాయ విధాన విశ్లేషకులు డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి కేంద్రానికి విడిగా లేఖ రాశారు. పారాక్వాట్‌పై నిషేధాన్ని అమలు చేసే క్రమంలో ఇప్పటికే దిగుమతి చేసుకున్న నిల్వలను విక్రయించుకోవడానికి ఒక 6 నెలల గడువు మాత్రమే ఇవ్వాలని, ఎగుమతుల పేరుతో ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.      – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement