యూపీఐ ద్వారా చేసే పేమెంట్లపై బాదుడుకు కేంద్రం రెడీ
ఇప్పటిదాకా యూపీఐతో పాటు రూపే చెల్లింపులపై జీరో చార్జీలు
ఇకపై ఎప్పటికప్పుడు చార్జీలు విధించే అధికారం ప్రభుత్వానికి..
ఈ మేరకు చట్టం సవరణ..లోక్‌సభ ఆమోదం
ఒక్కో లావాదేవీకి ఎంత చార్జీ పడొచ్చనేది ప్రస్తుతానికి సస్పెన్స్
భవిష్యత్తులో కేంద్రం విడుదల చేసే నోటిఫికేషన్లతో స్పష్టత
ఎవరిపై చార్జీ విధించినా, ఎంత విధించినా ప్రజల జేబుకే చిల్లు
డిజిటల్ నుంచి మళ్లీ క్యాష్ వైపు మళ్లించే చర్యలంటూ విమర్శలు
సాక్షి బిజినెస్ డెస్క్: పల్లె నుంచి పట్నం వరకు దాదాపు అన్ని నగదు లావాదేవీలు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. అది రూపాయి అయినా వేల రూపాయలైనా సరే..స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. చిటికెలో చెల్లింపు జరిగిపోతోంది. అదీ ఎలాంటి చార్జీ లేకుండా..పూర్తి ఉచితంగా. కానీ ఇప్పుడా పరిస్థితి మారనుంది. డిజిటల్ పద్ధతిలో సులువుగా చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విధానం ఇకపై ఆర్థికంగా భారం కానుంది. ఇప్పటివరకు ఉచితంగా కొనసాగుతున్న ఈ సర్వీసు మీద భవిష్యత్తులో చార్జీలు విధించబోయే పరిస్థితి రానుంది. యూపీఐ చెల్లింపులపై ఫీజులు విధించడానికి బ్యాంకులు, పేమెంట్ సిస్టం ప్రొవైడర్స్‌ని అనుమతించేలా ప్రభుత్వానికి అధికారమిచ్చే చట్ట సవరణను లోక్‌సభ ఆమోదించింది.
రూపే డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులపైనా చార్జీలు విధించడానికి ఇది మార్గం సుగమం చేయనుంది. యూపీఐ వ్యవస్థ నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని, చార్జీలు వసూలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కేంద్రం ఆ మేరకు చర్యలు చేపట్టింది. అందరినీ డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించే లక్ష్యంతో ముందుగా యూపీఐ ఉచితమనే తాయిలం చూపించిన ప్రభుత్వం..దాదాపుగా దేశమంతా దానికి అలవాటు పడ్డాక ప్లేటు ఫిరాయించిందని, యూపీఐని కూడా ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యల వల్ల మళ్లీ ప్రజలు నగదు లావాదేవీల వైపు మళ్లే పరిస్థితి తలెత్తుతుందని.. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గతంలోలా క్యూ లైన్లు కనిపించినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.
వీటిపై ఎండీఆర్ ఇకపై జీరో కాదు..
ప్రస్తుతం చెల్లింపుల సంబంధ ఆర్థిక లావాదేవీల కోసం ప్రాథమికంగా బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్ల నెట్‌వర్క్‌లను ఉపయోగించుకున్నందుకు గాను వ్యాపార వర్గాలు ఆయా సంస్థలకు చెల్లించాల్సిన చార్జీలను మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)గా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇంటర్‌చేంజ్ ఫీజు, ప్రాసెసింగ్ చార్జీలు, నెట్‌వర్క్ ఫీజులు, పన్నుల్లాంటివి ఉంటాయి. క్రెడిట్, డెబిట్ కార్డులను జారీ చేసే బ్యాంకులకు చెల్లించేది ఇంటర్‌చేంజ్ ఫీజు, రేజర్‌పే, పేయూలాంటి పేమెంట్ ప్రాసెసర్ లేదా గేట్‌వేలకు కట్టేవి ప్రాసెసింగ్ చార్జీలు. వీసా, మాస్టర్‌కార్డ్ ఎన్‌పీసీఐలాంటి పేమెంట్ నెట్‌వర్క్‌లకు వెళ్లేది నెట్‌వర్క్ ఫీజు. అంతిమంగా ఈ సర్వీసులపై జీఎస్‌టీ కింద ప్రభుత్వానికి ట్యాక్సులు వెళ్తాయి.
అయితే దేశీయ పేమెంట్ గేట్‌వేని, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ అయినా జీరో చేస్తూ కేంద్రం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో రూపే, యూపీఐ మినహా ఇతర వ్యవస్థల్లో యధావిధిగా 0.4 శాతం నుంచి 4.5 శాతం వరకు (కార్డును బట్టి) ఎండీఆర్ చార్జీలు కొనసాగుతున్నాయి. కాగా తాజా చట్ట సవరణలో యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ‘ఎండీఆర్ జీరో’ను తొలగించి దీనిపై నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు. ప్రభుత్వం ఇకపై ఎప్పటికప్పుడు విడుదల చేసే నోటిఫికేషన్ల ద్వారా యూపీఐ, రూపే లావాదేవీలకు సంబంధించిన చార్జీలను నిర్ణయించనుంది.
ఇప్పుడు యూపీఐ భారాన్ని ఎవరు మోస్తున్నారంటే ..
యూపీఐ లావాదేవీల వ్యయాల భారంలో కొంత భాగాన్ని బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు భరిస్తుండగా, మిగతాదంతా ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోందని, ఇదంతా పన్ను చెల్లింపుదారుల సొమ్మేనని నిపుణులు చెబుతున్నారు. ఈ భారం ఏటా దాదాపు రూ. 20 వేల కోట్లు ఉంటుందని అంచనా. వాస్తవానికి తక్కువ విలువ చేసే లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రూ.2 వేల లోపు విలువ ఉండే లావాదేవీలపై బ్యాంకులకు సబ్సిడీ ఇచ్చేలా 2021 డిసెంబర్‌లో ప్రభుత్వం స్కీమును ప్రవేశపెట్టింది. 2021–22లో ఇలా రూ.1,389 కోట్ల సబ్సిడీ ఇవ్వగా, 2023–24 నాటికి ఇది ఏకంగా రూ.3,631 కోట్లకు పెరిగింది. దీంతో క్రమంగా ఈ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. 2026–27 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇతరత్రా ఎల్రక్టానిక్ పేమెంట్స్ విధానాల్లో ఎండీఆర్ చార్జీలను పరిస్థితులను బట్టి కొందరు వ్యాపారులు తామే చెల్లిస్తుండగా మరికొందరు ఆ భారాన్ని కస్టమర్లకే బదలాయిస్తున్నారు.
అమెరికాను సంతృప్తి పరిచేందుకేనా..?
ఇన్నాళ్లూ ఉచితంగా ఇస్తూ వచ్చిన సర్వీసులపై చార్జీల భారాన్ని మోపాలనే ఆలోచన వెనుక ప్రత్యేక కారణాలున్నాయనే వాదనలు విని్పస్తున్నాయి. యూపీఐని ఆర్థికంగా నిలబెట్టాలంటే చార్జీలను విధించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. అసలు ప్రజలకు బదలాయించాల్సిన అవసరమే లేకుండా ఈ భారాన్ని భరించేందుకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆర్థిక సామర్థ్యాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 2025–26లో ఆర్‌బీఐ ఏకంగా రూ.2.86 లక్షల కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి బదలాయించింది. కీలకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిలబెట్టేందుకు ఇందులో చాలా తక్కువ మొత్తాన్ని వెచ్చించినా సరిపోతుంది అని వారంటున్నారు. మరోవైపు దీని వెనుక అమెరికా ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. యూపీఐ, రూపే వ్యవస్థలను ఉచితంగా అందించడం ద్వారా వీసా, మాస్టర్‌కార్డ్‌లాంటి తమ పేమెంట్ ప్లాట్‌ఫాంలకు భారత్ పొగ పెడుతోందంటూ 2026 యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ నివేదికలో అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో చట్ట సవరణ జరగడంతో..ఇది అమెరికాను సంతృప్తి పరిచేందుకేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్న మొత్తాలకు వర్తించకపోవచ్చు..!
యూపీఐ పేమెంట్లపై చార్జీల వడ్డనకు రంగం సిద్ధమవుతున్నప్పటికీ, అన్ని చెల్లింపులపైనా చార్జీల భారం పడకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రూ.2 వరకు చెల్లింపులపై మినహాయింపు ఉండొచ్చని చెబుతున్నాయి. రూ.50 కోట్ల పైబడి టర్నోవర్ ఉండే పెద్ద వ్యాపారులకు సంబంధించిన యూపీఐ లావాదేవీలపై 0.3–0.6 శాతం వరకు చార్జీలు విధించవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం చిన్న వ్యాపారులకు చేసే రూ.2 వేల వరకు మొత్తాలకు మాత్రమే ప్రభుత్వం ఇన్సెంటివ్ స్కీము కింద సబ్సిడీనిస్తోంది. ఆర్థిక శాఖ డేటా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారులకు కస్టమర్లు చెల్లించిన రూ.2 వేలకు పైబడిన లావాదేవీల పరిమాణం కేవలం 4 శాతంగానే ఉంది. లోకల్ సర్కిల్స్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం రూ.3 వేలకు పైబడే యూపీఐ పేమెంట్ల మీద చార్జీలను కస్టమర్ల నుంచే వ్యాపారులు వసూలు చేస్తే తాము యూపీఐని వాడటం మానేస్తామంటూ దాదాపు 98 శాతం మంది చెప్పారట. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహగానాలేనని, వాస్తవ చార్జీలు.. భవిష్యత్తులో చట్ట సవరణ పూర్తిస్థాయిలో ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే వెల్లడవుతాయని బ్యాంకర్లు చెబుతున్నారు.
యూపీఐ లావాదేవీలు, విలువ కథా కమామిషు
– 2016 ఏప్రిల్‌లో యూపీఐ ఆవిష్కరణ
– 2016–17లో 2 కోట్ల లావాదేవీలు, విలువ సుమారు రూ.7 వేల కోట్లకు పరిమితం
– పదేళ్లలో 12 వేల రెట్లు పెరిగిన లావాదేవీలు, 4 వేల రెట్లు పెరిగిన విలువ
– 2025–26లో 24 వేల కోట్ల యూపీఐ లావాదేవీలు, విలువ రూ.314 లక్షల కోట్లు
– యూపీఐ లావాదేవీల్లో రూ.2 వేలకు పైగా ఉండే చెల్లింపులు 4 శాతమే
– 2021–22 నుంచి 2024–25 వరకు ఇన్సెంటివ్ స్కీము కింద కేంద్రం ఇచ్చిన మొత్తం రూ. 8,730 కోట్లు


