సాక్షి,న్యూఢిల్లీ: హోమ్‌లోన్ భారం లోక్‌సభ సచివాలయ డైరెక్టర్ ప్రాణాన్ని సైతం బలి తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ సచివాలయంలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గౌరవ్ గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు ముందు ఆయన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ లేఖలో సుమారు రూ. 70 లక్షల హోమ్‌లోన్ బాకీ ఉన్నట్లు, అదే తన మరణానికి ప్రధాన కారణమని పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. లోక్‌సభ సచివాలయంలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న గౌరవ్ గౌతమ్, సెక్టార్ 82లోని కేంద్రీయ విహార్-II సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆయన తన నివాసంలోనే అపస్మారక స్థితిలో కనిపించారు. ఆ సమయంలో గౌతమ్ భార్య పుట్టింటికి వెళ్లారు. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ గార్డు సహాయంతో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి చూడగా ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గౌతమ్ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హోమ్‌లోన్ భారం పెరిగిపోవడం, ఇంకా రూ. 70 లక్షల వరకు రుణం చెల్లించాల్సి ఉండటమే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం, స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. గౌతమ్ మరణానికి దారితీసిన పూర్తి పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


