ఊహాగానాలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెర దించింది. ఆ పార్టీ భవిష్యత్‌పై వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీగా మారే ఆలోచన తమకు లేదని.. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ‘ప్రెజర్ గ్రూప్’గానే పనిచేస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరుగుతున్న రెండు రోజుల వ్యూహ సమావేశాల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
30 ఏళ్ల అభిజిత్ దీప్కే కేవలం రెండు నెలల క్రితమే వ్యంగ్య రూపంలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. తొలుత సోషల్ మీడియా వేదికగా సరదా ఉద్యమంలా కనిపించిన ఈ సంస్థ.. ఆ తర్వాత పరీక్షల అక్రమాలు, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన విద్యార్థి ఆందోళనలకు దీప్కే నాయకత్వం వహించారు. ఆ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
‘పార్టీ పెట్టే ఆలోచన లేదు’
తమ భవిష్యత్ ప్రణాళికలపై దీప్కే మాట్లాడుతూ.. “రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం లేదు. మీడియాకే ఆ అంశంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. మేము ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తాం” అని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలు, పరీక్షల నిర్వహణలో అక్రమాల వంటి అంశాలపై పోరాడడమే తమ లక్ష్యమని చెప్పారు.
దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళిక
CJP ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు దీప్కే తెలిపారు. యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్ టూర్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. “దేశంలోని ఏ ప్రాంతంలో విద్యార్థులు సమస్యలపై పోరాడినా.. వారికి అండగా ఉంటాం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం జార్ఖండ్‌లో జేపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే అక్కడికి వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పారు. జంతర్ మంతర్ ఆందోళన సమయంలో 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తమ ఉద్యమానికి మార్గదర్శకుడిగా ఉన్నారని దీప్కే పేర్కొన్నారు. జార్ఖండ్ విద్యార్థి నేతలతో వాంగ్‌చుక్ ఇప్పటికే మాట్లాడి సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే.(అయితే ఈ మీటింగ్ జరుగుతున్న వేళ.. ఇవాళ అక్కడి ఆందోళలను విరమించడం గమనార్హం)
యువత ఉద్యమానికి కొత్త దిశ?
సీజేపీ వ్యూహ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, దాదాపు 50 మంది కీలక వాలంటీర్లు పాల్గొన్నారు. యువత సమస్యలను ఒక వేదికపైకి తీసుకురావడం, వాటిపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని వారు తెలిపారు. “యువత ఒక్కటైతే ఏదైనా సాధించగలరని ఈ ఉద్యమం నిరూపించింది” అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.
కేవలం వ్యంగ్య వేదికగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు యువత సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమ వేదికగా మారే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాల్లోకి కాకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే శక్తిగా కొనసాగాలని అభిజిత్ దీప్కే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.


