సాక్షి, తూర్పు గోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం పర్యటన సాగిన మార్గమంతా అభిమానులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది.

వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు, ప్లకార్డులతో తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్ వాహనం కనిపించగానే నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

జగన్ పర్యటనకు గ్రామాలు, పట్టణాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో దేవరపల్లిలో భారీ జనసందోహం కనిపించింది. యువత ఉత్సాహం, కార్యకర్తల నినాదాలతో పర్యటనకు ప్రత్యేక వాతావరణం ఏర్పడింది. సాధారణంగా.. జగన్ పర్యటనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత మద్దతు కీలకంగా మారుతున్న నేపథ్యంలో జెన్‌జీ యువత భారీగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

కొత్త తరం ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న వేళ.. జగన్ పర్యటనలో యువత భాగస్వామ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తన పర్యటనకు వచ్చిన ప్రజలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. దేవరపల్లి పర్యటన వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


