breaking news
generation z
-
జెన్‌జీ జేబులో మన్మోహన్.. ఆ అడుగులే ఇప్పుడు!
మన్మోహన్ సింగ్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది.. నిశ్శబ్దంగా మాట్లాడే మాజీ ప్రధాని. కానీ నేటి జెన్‌జీకి ఆయన అంతకంటే ఎక్కువ. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ నుంచి ఇంటర్నెట్ వరకు.. స్టార్టప్‌ల నుంచి విదేశీ కంపెనీల ఉద్యోగాల వరకు.. భారత ఆర్థిక వ్యవస్థలో మూడు దశాబ్దాలుగా కనిపిస్తున్న ఎన్నో మార్పుల వెనుక ఆయన ఆలోచనల ముద్ర కనిపిస్తుంది.ఒక్కసారి 1991కి వెళ్దాం. అప్పట్లో దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దేశం తన అవసరాలకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు. దిగుమతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రైవేట్ రంగంపై ఉన్న అనేక ఆంక్షలను క్రమంగా సడలించారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో మరింతగా అనుసంధానం చేసే దిశగా అడుగులు వేశారు.ఆ మార్పులు అంటే అప్పట్లో సామాన్యుడికి వెంటనే అర్థమయ్యే విషయం కాదు. కానీ వాటి ప్రభావం క్రమంగా కనిపించింది. విదేశీ కంపెనీలకు భారత మార్కెట్ తెరుచుకుంది. ప్రైవేట్ రంగానికి అవకాశాలు పెరిగాయి. పోటీ పెరిగింది. కొత్త పరిశ్రమలు, కొత్త సేవలు వచ్చాయి. తర్వాతి సంవత్సరాల్లో ఐటీ రంగం వేగంగా విస్తరించడానికి కూడా ఈ మారిన ఆర్థిక వాతావరణం ఒక నేపథ్యంగా నిలిచింది.ఇప్పుడు 2026. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే జీడీపీ వృద్ధి బలంగానే కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2025–26లో భారత ఆర్థిక వృద్ధి 7.6 శాతంగా నమోదైంది. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ పరిస్థితులు, ముఖ్యంగా ఇంధన ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో వృద్ధి 6.6 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. అయితే జెన్‌జీ ప్రశ్న మాత్రం జీడీపీ దగ్గర ఆగిపోదు.మరి నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు?ఇదే అసలు ప్రశ్న. ఇటీవలి ఆర్థిక విశ్లేషణల్లోనూ ఇదే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఐఎంఎఫ్ తాజా విశ్లేషణ ప్రకారం భారత వృద్ధికి ఉద్యోగాలు, ఉత్పాదకత, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరం పెద్ద సవాలుగా మారింది. కోట్లాది మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న సమయంలో.. జీడీపీ పెరగడం కంటే వారికి స్థిరమైన, మంచి ఆదాయం ఇచ్చే ఉద్యోగాలు ఎంత వస్తున్నాయన్నదే కీలకం.ఇక్కడే మన్మోహన్ మళ్లీ జెన్‌జీ జేబులోకిఎందుకంటే ఆయన కాలంలో మొదలైన ఆర్థిక మార్పులు “ప్రపంచంతో పోటీ పడే భారత్” అనే దిశను బలపరిచాయి. నేడు ఒక చిన్న పట్టణంలో ఉన్న యువకుడు విదేశీ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగలగడం, ఇంటి నుంచే ఆన్లైన్ సేవలు అందించడం, యాప్ ద్వారా వ్యాపారం మొదలుపెట్టడం, ప్రపంచ మార్కెట్ గురించి తెలుసుకోవడం.. ఇవన్నీ ఒక్కరోజులో వచ్చిన మార్పులు కావు. మూడు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పుల ఫలితంగా ఏర్పడిన అవకాశాల గొలుసులో ఇవి భాగం. అయితే కథ ఇక్కడితో పూర్తికాదు. అప్పట్లో భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలపడం పెద్ద సవాలు అయితే.. ఇప్పుడు ఆ వృద్ధి ఫలాలను ఎక్కువ మందికి చేరేలా చేయడం మరో పెద్ద సవాలు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు అవకాశాలు, మహిళలకు ఉపాధి, నైపుణ్యాలకు తగ్గ పనులు రావాల్సి ఉంది. ఉద్యోగ కల్పన కోసం ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచే సంస్కరణలపై ప్రపంచ బ్యాంకు కూడా దృష్టి పెట్టింది. అప్పట్లో మన్మోహన్ సింగ్ ముందున్న ప్రశ్న.. “భారత ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడాలి?”ఇప్పుడు జెన్‌జీ ముందున్న ప్రశ్న.. “ఈ ఆర్థిక వృద్ధిలో నా భవిష్యత్తు ఎక్కడ?”మన్మోహన్ సింగ్ జయంతి రోజున ఆయనను గుర్తు చేసుకోవడం అంటే కేవలం ఓ మాజీ ప్రధానికి, గొప్ప ఆర్థికవేత్తగా గుర్తుంచుకుని నివాళి ఇవ్వడం కాదు.. నేటి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఇక్కడికి వచ్చిందో గుర్తు చేసుకోవడం కూడా.:::వెబ్ డెస్క్ ప్రత్యేకం -
భజన క్లబ్బింగ్‌లో మోదీ.. యువతతో కలిసి జోష్
యువతను ఆకట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో కొత్త తరహా ప్రయత్నం చేశారు. సాధారణ రాజకీయ కార్యక్రమాలకు భిన్నంగా.. యువత ఎక్కువగా పాల్గొనే ఆధునిక భజన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని సందడి చేశారు. భజనలు వింటూ చప్పట్లు కొట్టడంతోపాటు.. చేతిలో వాయిద్యం పట్టుకుని తాళం వేస్తూ కనిపించారు.పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ పార్క్‌లో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందువరుసలో కూర్చున్న మోదీ.. భజనలను ఆస్వాదిస్తూ కళాకారులతో కలిసి చప్పట్లు కొట్టారు. శ్రీరాముడిపై ఆలపించిన భజనకు ఖంజరీ తరహా వాయిద్యాన్ని వాయిస్తూ తాళం వేశారు. అనంతరం అక్కడికి వచ్చిన వారివైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఢిల్లీలో భజన్ క్లబ్బింగ్.. అద్భుతం! అంటూ ఈ ఈవెంట్‌పై ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. Bhajan Clubbing in Delhi. Spectacular! pic.twitter.com/BujBa4lzk7— Narendra Modi (@narendramodi) September 25, 2026ఏంటీ భజన క్లబ్బింగ్..?సంప్రదాయ భజనలను ఆధునిక సంగీత కచేరీ తరహాలో నిర్వహించే విధానమే ‘భజన క్లబ్బింగ్’. ఇందులో పెద్ద సంఖ్యలో యువత ఒకచోట చేరి భజనలు, ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ.. చప్పట్లు కొడుతూ, సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ భక్తి గీతాలకు ఆధునిక సంగీతం, హై ఎనర్జీ ప్రదర్శన శైలిని జోడించడం ఈ కార్యక్రమాల ప్రత్యేకత.మద్యం, ఇతర క్లబ్ సంస్కృతికి భిన్నంగా.. భక్తి, ఆధ్యాత్మికత కేంద్రంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ‘భజన క్లబ్బింగ్’కు ఆదరణ పెరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా జెన్-జెడ్ యువతను సంప్రదాయ భజనలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు.‘మన్ కీ బాత్’లోనూ ప్రస్తావనఈ ఏడాది జనవరిలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ మోదీ ‘భజన క్లబ్బింగ్’ గురించి ప్రస్తావించారు. యువత భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ పెద్ద సంఖ్యలో ఒకచోట చేరడం తనను ఆకట్టుకుందని చెప్పారు. భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించే ప్రయత్నంగా దీనిని అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలు గ్లోబల్ కచేరీలకు ఏమాత్రం తీసిపోవని పేర్కొన్నారు.దీనదయాళ్ జయంతి సందర్భంగా..భారతీయ జనసంఘ్ కీలక నేతల్లో ఒకరైన దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ‘అంత్యోదయ’ సిద్ధాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సందర్భంగా మోదీ దీనదయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించారు. ఆయన ఆలోచనలు, ప్రజా సంక్షేమంపై ఆయన చూపిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిగ్గింగ్ జరిగితే పోటీ చేయడమెందుకు? -
జెన్‌జీలకు కొత్త గాలం! రాహుల్ గాంధీకు కౌంటర్‌గా..
దేశ రాజకీయాల్లో జెన్‌జీ చుట్టూ కొత్త ఫోకస్ కనిపిస్తోంది. విద్యార్థులు, యువత సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ‘చత్రోన్ కీ గూంజ్’ వేదికగా విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. దీంతో యువతను చేరుకోవడంపై అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోనూ కసరత్తు మొదలైంది.ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా యువతతో మరింతగా మమేకం కావాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కేబినెట్ భేటీలతో పాటు తరచూ జరుగుతున్న పార్టీ సమావేశాల్లోనూ ఎంపీలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవడంతో పాటు.. ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటి డిజిటల్ వేదికల ద్వారా జెన్‌జీకి దగ్గర కావాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. రాహుల్ గాంధీకి మోదీ ‘తురుపుముక్క’గా భావిస్తున్న చిరాగ్ పాస్వాన్ నుంచి కౌంటర్‌కు రంగం సిద్ధమైంది.ఎన్డీయే మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తాజా జెన్‌జీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్ యూత్ బోలె తో(Youth Bole To) పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు కౌంటర్ అనే చర్చ జోరందుకుంది.తొలి కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే..పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ‘Youth Bole To’ తొలి కార్యక్రమం జరగనుంది. ఇందులో చిరాగ్ పాస్వాన్ బిహార్ యువతతో, ముఖ్యంగా జెన్‌జీ ప్రతినిధులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్య, ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ, డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సవాళ్లపై యువతతో చర్చించనున్నారు.యువత తమ ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలను నేరుగా చిరాగ్ ముందుంచేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పార్టీ బిహార్ అధ్యక్షుడు సురేంద్ర వివేక్ మాట్లాడుతూ.. యువతను ఓటుబ్యాంకుగా చూడటం లేదని, వారి సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిపై చర్చించడమే తమ ఉద్దేశమని తెలిపారు.రాహుల్ ఫోకస్.. ఎన్డీయేలో కదలికఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ విద్యార్థులు, యువతతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘చత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాల్లో విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, యువత భవిష్యత్తు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ.. యువత సమస్యలను రాజకీయ చర్చలోకి తీసుకొస్తున్నారు. ఒకానొక దశలో ఇవి విమర్శలకు దారి తీస్తున్నప్పటికీ.. యువతను ఆకర్షిస్తున్నాయనే చర్చా నడుస్తోంది. దీంతో జెన్‌జీని ఎవరు ఎలా చేరుకుంటారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అటు రాహుల్ గాంధీ ప్రత్యక్ష కార్యక్రమాలతో యువతను కలుస్తుండగా.. ఇటు మోదీ ప్రభుత్వం డిజిటల్ వేదికలపై దృష్టి పెడుతోంది. ఇప్పుడు ఎన్డీయే తరఫున చిరాగ్ పాశ్వాన్ ప్రత్యక్షంగా జెన్‌జీతో సంభాషించేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు.బిహార్ నుంచి యూపీకి..చిరాగ్ వ్యూహం బిహార్‌తోనే ఆగడం లేదు. సెప్టెంబర్ 24న పాట్నా.. ఆ తర్వాత సెప్టెంబర్ 27న ప్రయాగ్‌రాజ్‌లో తదుపరి ‘Youth Bole To’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత యూపీలోని ఇతర నగరాల్లోనూ యువతను కలిసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక్కడే ఎన్నికల లెక్కలు కూడా తెరపైకి వస్తున్నాయి. బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో చిరాగ్ తన సొంత పార్టీకి యువతలో మరింత కనెక్ట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా యువతను చేరుకునే కార్యక్రమాలు పార్టీ విస్తరణకు ఉపయోగపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికలు జరగబోయే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కౌంటర్ కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ, మిత్రపక్షాలకు ఢిల్లీ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.యువతే టార్గెట్.. కొత్త వ్యూహంబిహార్లో మొదలై యూపీకి విస్తరించనున్న ఈ కార్యక్రమం ద్వారా చిరాగ్ లాంటి యువనేతతో.. యువతతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, టెక్నాలజీ వంటి అంశాలపై జెన్‌జీతో చర్చించనున్నారు. మరోవైపు ఎన్డీయే కూడా యువతను చేరుకునే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తోంది.రాహుల్ గాంధీ జెన్‌జీతో మమేకమవుతూ యువత సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలో.. అధికార పక్షం కూడా యువతను చేరుకునేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరాగ్ పాస్వాన్ ‘Youth Bole To’ కార్యక్రమంతో రంగంలోకి దిగుతున్నారు.మోదీ తురుపుముక్కగా చిరాగ్ పాస్వాన్‌ను రాజకీయ వర్గాల్లో కొందరు అభివర్ణిస్తున్న నేపథ్యంలో.. ఆయన చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బిహార్ నుంచి యూపీ వరకు జెన్‌జీని ఆకట్టుకునేలా ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించడం.. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే వ్యూహంలో భాగంగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. -
జెన్‌జీ ఆగ్రహం.. హీరో కాస్త విలన్‌గా!
నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన బాలేంద్ర ‘బాలెన్’ షా.. ప్రధాని పీఠం అధిరోహించిన కొద్ది నెలల్లోనే తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పాత రాజకీయ వ్యవస్థపై విసుగుచెందిన యువతకు ఆశాకిరణంగా కనిపించిన ఆయన.. ఇప్పుడు అదే యువత నుంచి అనూహ్య రీతిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. జెన్‌జీ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన బాలెన్ షా.. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తన రాజకీయ ఇమేజ్ను కాపాడుకోవాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.మాజీ అండర్‌గ్రౌండ్ ర్యాపర్, సివిల్ ఇంజినీర్, ఖాట్మండు మేయర్‌గా తనదైన ముద్ర వేసిన బాలెన్ షా.. సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగారు. మార్చి ఎన్నికల్లో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) భారీ మెజార్టీ సాధించడంతో.. నేపాల్‌లో కొత్త రాజకీయ శకానికి నాంది పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేతగా, వ్యవస్థలో మార్పు తీసుకురాగల నాయకుడిగా యువత బాలెన్‌ను ఆదరించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి.వరుస నిర్ణయాలతో పెరిగిన అసంతృప్తిప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలెన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. భారత్ నుంచి కొనుగోలు చేసే వస్తువులపై కస్టమ్స్ నిబంధనలను కఠినతరం చేయడం మొదటి వివాదంగా మారింది. సరిహద్దు ప్రాంతాల ప్రజలు రోజువారీ అవసరాల కోసం భారత్‌పై ఆధారపడుతుంటారు. మందులు, నిత్యావసర వస్తువులపై ప్రభావం పడటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. చివరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.ఆ తర్వాత భారత్‌తో సరిహద్దు అంశంపై బాలెన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాల వివాదంపై మూడో పక్షం సహాయంతో పరిష్కారం సాధించవచ్చనే సంకేతాలు ఇవ్వడం నేపాల్‌లో విమర్శలకు దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.భారత్ అంశంలో మారిన వైఖరివిదేశీ ప్రతినిధులతో భేటీల విషయంలో బాలెన్ మొదట కఠిన వైఖరిని అవలంబించారు. మంత్రుల స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న అధికారులతో సమావేశాలకు దూరంగా ఉంటానని చెప్పిన ఆయన.. తర్వాత తన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. భారత, చైనా రాయబారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఇదే సమయంలో ఆర్ఎస్పీ అధినేత రవి లామిచ్చానేకు భారత్‌లో లభించిన ప్రాధాన్యం కూడా చర్చకు దారితీసింది. లామిచ్చానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశం కావడం నేపాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.సొంత పార్టీతోనూ దూరం?బాలెన్ పాలనా శైలిపై మరో ప్రధాన విమర్శ.. ఆయన పార్లమెంట్‌కు, సొంత పార్టీ కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు. ప్రధాని అయిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు పరిమితంగా హాజరయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించాయి. ఆర్ఎస్పీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడం తగ్గిందనే చర్చ మొదలైంది. దీంతో బాలెన్ షా–పార్టీ నాయకత్వం మధ్య దూరం పెరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యువతే తిరగబడిన వేళ..బాలెన్ ఇమేజ్‌కు అతిపెద్ద దెబ్బ జూలైలో తగిలింది. ఖాట్మండులో మున్సిపల్ పోలీసుల చర్యలపై అసంతృప్తితో రైడ్ షేర్ డ్రైవర్ గణేష్ నేపాలి ఆత్మాహుతికి పాల్పడిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. అనధికార నివాసాల తొలగింపు, పేదలకు పునరావాసం కల్పించకపోవడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఒకప్పుడు బాలెన్‌కు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన యువతే.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ప్రారంభించింది.మత ఘర్షణలతో మరింత ఒత్తిడిజూలై చివర్లో నేపాల్ దక్షిణ ప్రాంతాల్లో హిందూ–ముస్లిం వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు ప్రభుత్వానికి మరో పరీక్షగా మారాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు బాలెన్ తొలిసారి ప్రధానిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది.ప్రజా ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన బాలెన్‌కు.. పాలన మాత్రం అంత సులభం కాదని ఈ 150 రోజులు నిరూపించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన విధానం అధికారంలో కొనసాగించడం కష్టం. ప్రజల అంచనాలు, వ్యవస్థల నిర్వహణ, రాజకీయ సమన్వయం వంటి అంశాలు ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాళ్లు.జెన్‌జీ ఆశల నాయకుడిగా ఎదిగిన బాలెన్ షా.. ఇప్పుడు అదే తరం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన దశకు చేరుకున్నారు. ఐదు నెలల్లో మారిన ఈ రాజకీయ పరిణామాలు.. ప్రజాదరణ ఎంత వేగంగా పెరుగుతుందో, అంతే వేగంగా తగ్గిపోవచ్చని మరోసారి చాటిచెబుతున్నాయి. -
జెన్‌జీపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్‌కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని.. కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా, రీల్స్ యుగంగా మారిందని ప్రధాని అన్నారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సరైన మార్గం కాదని చెప్పారు.“ఇది రీల్స్ కాలం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. కానీ ఈ షార్ట్‌కట్ యుగంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. రైల్వే స్టేషన్లలో రాసి ఉంటుంది.. ‘షార్ట్‌కట్స్ విల్ కట్ యూ షార్ట్’” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవాలని సూచించారు. వారి ప్రయాణం, కష్టాలు, విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు.ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది తెలిసిందే. జంతర్ మంతర్ నీట్ నిరసనల తర్వాత.. తొలిసారి సెల్ఫీ వీడియో సందేశం ఇచ్చారు ఆయన. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశాలపై వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతను ఆకట్టుకోవాలని మంత్రులకు, ఎంపీలకు సైతం ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జెన్జీపైనా వివిధ కార్యక్రమాల్లో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కోవింద్ జీవితం యువతకు స్ఫూర్తిఇవాళ్టి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల కథ కాదని.. అది భారత ప్రజాస్వామ్యం, సమాజం అందించిన అవకాశాలకు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారని గుర్తు చేశారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పదవి నుంచి దిగినా దేశ సేవ కొనసాగింపురాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’(వన్‌నేషన్.. వన్ ఎలక్షన్) అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మోదీ అన్నారు.కోవింద్ వినయం.. భారత విలువలకు ప్రతీకమాజీ రాష్ట్రపతి వినయం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలోనూ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి తనను కారు వరకు వచ్చి సాగనంపేవారని చెప్పారు. అలాగే తన గ్రామం పర్యటనలో కోవింద్ తన గురువుల పాదాలకు నమస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ.. అది భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటిందని అన్నారు.“విజయాలు వ్యక్తిగతం కాదు.. సమాజం భాగస్వామ్యం”ఒక వ్యక్తి విజయాలను తన సొంత ఘనతగా భావించడం సాధారణమని.. కానీ సమాజం అందించిన సహకారాన్ని గుర్తించే వ్యక్తులే గొప్పవారని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథలో ఇదే భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు వ్యక్తిగతమైనప్పటికీ.. వాటి నుంచి వచ్చిన విజయాలు భారత ప్రజాస్వామ్య విజయాలని అభివర్ణించారు.రీల్స్ వేగంలో జీవిత ప్రయాణాన్ని చిన్నదారిలో ముగించాలని చూస్తున్న యువతకు, మరీ ముఖ్యంగా జెన్‌జీకి.. అనుభవాల నుంచి నేర్చుకోవాలనే ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
జెన్‌జీ సైతం వైఎస్ జగన్ వెంటే..
సాక్షి, తూర్పు గోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం పర్యటన సాగిన మార్గమంతా అభిమానులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది.వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు, ప్లకార్డులతో తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్ వాహనం కనిపించగానే నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.జగన్ పర్యటనకు గ్రామాలు, పట్టణాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో దేవరపల్లిలో భారీ జనసందోహం కనిపించింది. యువత ఉత్సాహం, కార్యకర్తల నినాదాలతో పర్యటనకు ప్రత్యేక వాతావరణం ఏర్పడింది. సాధారణంగా.. జగన్ పర్యటనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత మద్దతు కీలకంగా మారుతున్న నేపథ్యంలో జెన్‌జీ యువత భారీగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.కొత్త తరం ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న వేళ.. జగన్ పర్యటనలో యువత భాగస్వామ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తన పర్యటనకు వచ్చిన ప్రజలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. దేవరపల్లి పర్యటన వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
లంచ్ బ్రేక్‌లో జెన్‌జీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా?
ఉద్యోగ ఒత్తిడి యువతపై ఎంత ప్రభావం చూపుతోందో తెలియజేసే ఓ కొత్త ట్రెండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) ఉద్యోగులు ఆఫీస్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సాధారణ బ్రేక్‌లకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. లంచ్ బ్రేక్ సమయంలో బయటకు వెళ్లి కొంతసేపు ఒంటరిగా గడపడం, నిద్రపోవడం, భావోద్వేగాలను బయటకు వదిలేయడం వంటి పద్ధతులు కొందరు యువ ఉద్యోగుల్లో కనిపిస్తున్నాయి.అమెరికాలోని కొందరు జెన్‌జీ ఉద్యోగులు ఆఫీస్ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు లంచ్ సమయంలో బయటకు వెళ్లి ఏకాంత ప్రదేశాల్లో సమయం గడుపుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. సినిమా థియేటర్లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లోని ఫిట్టింగ్ రూమ్‌లు వంటి ప్రదేశాలను కొందరు తమ ‘సేఫ్ స్పాట్స్’గా మార్చుకున్నారని పేర్కొంది.న్యూయార్క్‌కు చెందిన బెన్ శాండర్సన్ ఉదంతం దీనికి ఉదాహరణగా మారింది. ఆయన ఓ సినిమా థియేటర్లో సుమారు రూ.1,200 (15 డాలర్లు) చెల్లించి టికెట్ తీసుకున్నప్పటికీ సినిమా చూడకుండా రిక్లైనర్ సీటులో 90 నిమిషాలు నిద్రపోయాడు. ఆ నిద్ర తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో పలువురు యువ ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లి ఏడ్చిన సందర్భాలు, ఒంటరిగా కూర్చుని మనసు ప్రశాంతం చేసుకున్న సందర్భాలను వెల్లడించారు.భారత్‌లోనూ పెరుగుతున్న పని ఒత్తిడిభారత్లోనూ జెన్‌జీ ఉద్యోగుల పరిస్థితి కొంత భిన్నంగా లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని ఐటీ కంపెనీలు, బీపీఓలు, స్టార్టప్‌లు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న యువతలో పని ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆన్లైన్లో ఉండాల్సిన పరిస్థితి, నిరంతరం వచ్చే మెయిల్స్, టార్గెట్లు, పనితీరు సమీక్షలు యువ ఉద్యోగుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. కొందరు ఉద్యోగులు లంచ్ బ్రేక్‌లో నిద్రపోవడం, వాకింగ్‌కు వెళ్లడం, ఫోన్ ఆఫ్ చేసి కొంతసేపు ఒంటరిగా ఉండటం వంటి మార్గాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వర్క్ కల్చర్‌లో వచ్చిన మార్పులు కూడా యువతపై ప్రభావం చూపాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి హైబ్రిడ్, ఆఫీస్ మోడల్‌కు మారిన తర్వాత పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కష్టంగా మారిందని పలువురు చెబుతున్నారు.ఉద్యోగం మారాలన్న ఆలోచన పెరుగుతోందియువ ఉద్యోగుల్లో సంప్రదాయ ఆఫీస్ సంస్కృతిపై అసంతృప్తి పెరుగుతోందని పలు సర్వేలు సూచిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు, గుర్తింపు లేకపోవడం, మానసిక ఒత్తిడి, సరైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వంటి కారణాలతో కొందరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి జెన్‌జీ తరం కేవలం జీతానికే కాకుండా.. పని చేసే వాతావరణం, మానసిక ప్రశాంతత, వ్యక్తిగత జీవితానికి సమయం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.AI భయం కూడా మరో కారణంమరోవైపు కృత్రిమ మేధస్సు (AI) పెరుగుతున్న వినియోగం కూడా యువ ఉద్యోగుల్లో కొత్త ఆందోళనలకు కారణమవుతోంది. కొన్ని ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల తగ్గిపోతాయనే భయం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన ఒత్తిడి యువతపై ప్రభావం చూపుతోంది. ఏఐ టూల్స్ వేగంగా మారుతున్న నేపథ్యంలో తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న యువ ఉద్యోగులు కూడా ఉన్నారు. అందుకే కొందరు కొత్త టెక్నాలజీలను నేర్చుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.‘బ్రేక్ కల్చర్’కు పెరుగుతున్న ఆదరణపని ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొద్దిసేపు విరామం తీసుకోవడం ఇప్పుడు జెన్‌జీ ఉద్యోగుల్లో సాధారణంగా మారుతోంది. ఇది కేవలం పని నుంచి తప్పించుకోవడం కాదని.. మానసికంగా తిరిగి శక్తిని పొందేందుకు ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై భయం, మానసిక అలసట.. ఇవన్నీ కలిసి జెన్‌జీ ఉద్యోగుల్లో కొత్త రకమైన ‘బ్రేక్ కల్చర్’కు దారితీస్తున్నాయి. ఆఫీస్ బయట కొన్ని నిమిషాల ప్రశాంతత కోసం వెతుకుతున్న ఈ తరం.. పని ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. -
ఈ జెన్‌జీ భాష కనిపెట్టింది ఎవరో తెలుసా?
నిన్నటి వరకు సోషల్ మీడియా మీమ్స్, చాటింగ్‌ల్లో మాత్రమే కనిపించిన జెన్ జీ భాష.. ఇప్పుడు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలోనూ వినిపించింది. రాజకీయ విమర్శలకు యువత వాడే స్లాంగ్ పదాలను ఎంపీలు ఉపయోగించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఆన్లైన్ సంభాషణల్లో కనిపించే పదాలు.. తాజాగా లోక్‌సభ చర్చలోనూ చోటు దక్కించుకున్నాయి.నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన చర్చలో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే తొలుత Gen Z పదజాలాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలను విమర్శిస్తూ.. ‘MIA’ (Missing In Action), ‘FOMO’ (Fear Of Missing Out), ‘Delulu’ (Delusional) వంటి పదాలను ఉపయోగించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ కూడా ‘Clock it’ అనే పదాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తేజస్వి సూర్య సైతం ‘Delulu’, ‘source code’ వంటి పదాలను ఉపయోగిస్తూ తన వాదనను వినిపించారు.It's raining Gen Z lingo in Loksabha.BJP MP Bansuri Swaraj said that PM Modi clocked by bringing a bill against the Paper leak. https://t.co/ovC4uz8QKs pic.twitter.com/o2cNJtUT4k— Political Kida (@PoliticalKida) July 28, 2026 "Congress was having FOMO and staying in DELULU".Dr. Shrikant Shinde of Shivsena just bodied Congress in Loksabha in GenZ style! 😂 pic.twitter.com/LMN5IRUQmt— Political Kida (@PoliticalKida) July 28, 2026 అయితే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈ కొత్త భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది విద్యా వ్యవస్థలోని సమస్యలపై అని.. కేవలం కొత్త పదాల ప్రదర్శన కోసం కాదని సూచించారు. అయితే ఆ తర్వాత ఆమె కూడా ‘Delulu’ పదాన్ని ఉపయోగిస్తూ.. యువత మొత్తం తమవైపే ఉందని భావించొద్దని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.'Delulu' takes over #LokSabha: #TejasviSurya, #SupriyaSule clash over who has Gen Z's support🌍 Catch the day's latest news here ➠ https://t.co/40gdOz6FIS 🗞️ pic.twitter.com/B9cr59wJTm— Economic Times (@EconomicTimes) July 28, 2026అసలు ఈ Gen Z భాష పుట్టింది ఎక్కడ?Gen Z స్లాంగ్ అనేది ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టిన భాష కాదు. ఇది ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీమ్ సంస్కృతి, డిజిటల్ జీవనశైలి కలిసి సృష్టించిన కొత్త భాషా రూపం. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగింది. అందుకే వీరి సంభాషణల్లో వేగం, సంక్షిప్తతకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది.ఎక్కువ భావాన్ని తక్కువ పదాల్లో చెప్పడం, సరదాగా స్పందించడం, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం కోసం కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదట చిన్న ఆన్లైన్ గ్రూపులు, గేమింగ్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా చర్చల్లో మొదలైన ఈ పదాలు.. TikTok, Instagram, YouTube వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.మీమ్స్‌తో మొదలై..జెన్‌జీ భాష వ్యాప్తిలో మీమ్ కల్చర్ కీలక పాత్ర పోషించింది. ఒక సంఘటనను లేదంటే ఒక భావాన్ని సీరియస్‌గా కాకుండా సరదాగా చెప్పేందుకు యువత కొత్త పదాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కొత్త పదాలు సినిమాలు, టెలివిజన్, సంగీతం ద్వారా ప్రజల్లోకి వెళ్లేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని తీసుకుంది. ఒక వైరల్ వీడియో, ఒక మీమ్ లేదంటే ఒక ట్రెండ్ ద్వారా పుట్టిన పదం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇలా డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పదజాలం ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం, ప్రకటనలు వంటి రంగాల్లోకి కూడా ప్రవేశించింది.యువత ఎందుకు ఇష్టపడుతోంది?ఈ భాషలో కొన్ని పదాలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ‘Delulu’ అంటే వాస్తవానికి దూరమైన ఊహల్లో ఉండటం, ‘FOMO’ అంటే ఏదైనా అవకాశం కోల్పోతామేమో అన్న భయం, ‘MIA’ అంటే కనిపించకుండా పోవడం, ‘Clock it’ అంటే ఒక విషయాన్ని గుర్తించడం లేదా నిజాన్ని బయటపెట్టడం. ‘Rizz’ అంటే ఆకర్షించే వ్యక్తిత్వం, ‘Slay’ అంటే అద్భుతంగా చేయడం, ‘No cap’ అంటే నిజం చెబుతున్నాను అనే అర్థం. సోషల్ మీడియా, మీమ్ కల్చర్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ పదాలు ఇప్పుడు యువత సంభాషణల్లో భాగమయ్యాయి.జెన్‌జీ భాషకు ప్రధాన ఆకర్షణ దాని సరళత, వేగం. సుదీర్ఘమైన భావాలను ఒకే పదంతో వ్యక్తం చేసే అవకాశం ఈ స్లాంగ్ ఇస్తోంది. అంతేకాదు.. ఒకే తరానికి చెందిన వారు ఒకే రకమైన పదాలను ఉపయోగించడం ద్వారా తమ మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఇది కేవలం మాట్లాడే విధానంలో మార్పు కాదు.. డిజిటల్ యుగంలో ఒక తరం తన గుర్తింపును వ్యక్తం చేసుకునే మార్గంగా మారింది.వ్యాపారాలకు కూడా ఉపయోగమే..ఇప్పుడు కేవలం యువత సంభాషణలకే ఈ భాష పరిమితం కాలేదు. యువ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకునే కంపెనీలు, బ్రాండ్లు కూడా ఈ పదజాలాన్ని గమనిస్తున్నాయి. ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాల్లో యువతకు దగ్గరగా ఉండే భాషను ఉపయోగించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఒక తరం ఎలా ఆలోచిస్తోంది, ఎలా స్పందిస్తోంది అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ స్లాంగ్ ఒక సాధనంగా మారింది.విమర్శలు కూడా..అయితే Gen Z భాషపై విమర్శలు కూడా ఉన్నాయి. అధికారిక వేదికల్లో ఇలాంటి స్లాంగ్ పదాలను ఉపయోగించడం సరైనదేనా అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా విద్య, విధానాలు వంటి తీవ్రమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో భాష మరింత గంభీరంగా ఉండాలని కొందరి అభిప్రాయం.భాష ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఎన్నో పదాలు ఇప్పుడు సాధారణ వాడుకలోకి వచ్చాయి. టెక్నాలజీ, సినిమాలు, వీధి సంస్కృతి నుంచి గతంలో పదాలు వచ్చినట్లే.. ఇప్పుడు సోషల్ మీడియా కొత్త పదాలకు వేదికగా మారింది. Gen Z భాష వెనుక అసలు కథ కొన్ని విచిత్రమైన పదాల కథ కాదు. ఇంటర్నెట్ యుగంలో పెరిగిన ఒక తరం తన భావాలను, ఆలోచనలను, గుర్తింపును వ్యక్తం చేసుకునేందుకు సృష్టించుకున్న కొత్త శైలి. అందుకే మీమ్స్, చాటింగ్‌ల నుంచి మొదలైన ఈ భాష.. ఇప్పుడు పార్లమెంట్ చర్చల వరకూ చేరింది.:::వెబ్ ప్రత్యేకం -
జెన్‌జీ కొత్త ఫార్ములా.. ఇదే ఇప్పుడు వైరల్!
టెక్నాలజీ జీవితాన్ని సులభతరం చేస్తుంటే.. అనవసరంగా ఎందుకు కష్టపడాలి?. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పోస్ట్.. దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) యువత జీవితం, పని, విజయం, కష్టం గురించి ఎలా ఆలోచిస్తోందనే అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.ఈ చర్చకు కారణమైనది ఎక్స్ (X) వేదికపై ప్రేమ్ సోని అనే యూజర్ చేసిన ఓ పోస్ట్. పాతతరం కష్టాన్నే విజయానికి కొలమానంగా భావిస్తుంటే.. జెన్‌జీ మాత్రం సమయం, సామర్థ్యం, సౌకర్యానికే ఎక్కువ విలువ ఇస్తోందని ఆ యూజర్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ ఒక పనిని సులభంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంటే.. అదే పనిని అనవసరంగా కష్టపడి చేయడంలో అర్థం లేదనేదే జెన్‌జీ ఆలోచనగా వివరించారు.దీనికి ఉదాహరణగా.. కూరగాయలు కొనడానికి ట్రాఫిక్, దుమ్ము, బేరసారాలతో గంటసేపు గడపడం కంటే.. మొబైల్ యాప్‌లో కొన్ని నిమిషాల్లో ఆర్డర్ చేయడాన్నే జెన్‌జీ తెలివైన నిర్ణయంగా భావిస్తోందని చెప్పారు. అలాగే రద్దీ బస్సుల్లో ప్రయాణించడం కంటే క్యాబ్ లేదంటే రైడ్-హైలింగ్ యాప్‌ను ఉపయోగించడం సమయాన్ని ఆదా చేసే మార్గమని యువత చూస్తోందని పేర్కొన్నారు.అంతేకాదు, పిల్లలు మంచి ఉద్యోగాలు చేసి సౌకర్యవంతమైన జీవితం గడపాలని కోరుకునే తల్లిదండ్రులే.. అదే పిల్లలు టెక్నాలజీ సాయంతో సమయం ఆదా చేసుకుంటే వారిని బద్ధకస్తులుగా చూడడం ఒక వైరుధ్యమని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కష్టాన్ని, పొదుపును గొప్పగా చెప్పిన పెద్దలే.. ఇప్పుడు తమ స్మార్ట్ఫోన్లలో క్విక్ కామర్స్ యాప్‌ల ద్వారా వచ్చే డెలివరీలను ట్రాక్ చేయడం కూడా ప్రస్తావించారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.Indian parents are facing a massive existential crisis because Gen Z refuses to suffer for no logical reason.It is deeply offensive to our culture that a 24 year old will order groceries on Blinkit instead of spending 45 minutes inhaling road dust and fighting a vendor to save…— Prem Soni (@ValueWithPrem) June 28, 2026సమయానికి విలువ ఇవ్వడం, అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడం బద్ధకం కాదని, అదే ఆధునిక జీవనశైలి అని చాలామంది జెన్‌జీకి మద్దతు తెలిపారు. మరోవైపు, జీవితంలో కొంత కష్టాన్ని అనుభవించడం వల్లే సహనం, క్రమశిక్షణ, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని మరికొందరు వాదించారు.మొత్తానికి.. ఈ చర్చ కేవలం ఆన్లైన్లో కూరగాయలు కొనడం, క్యాబ్‌లో ప్రయాణించడం గురించి మాత్రమే కాదు. కాలం మారుతున్న కొద్దీ 'కష్టం' అనే పదానికి అర్థం కూడా మారుతోందా? సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవడం తెలివా? లేదంటే కష్టపడటమే జీవిత విలువను నేర్పుతుందా?అనే ప్రశ్నలను మరోసారి సమాజం ముందుకు తీసుకొచ్చింది. అందుకే.. జెన్‌జీ కొత్త ఫార్ములాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మరి మీరేమంటారు?.. ఈ వాదనతో ఏకీభవిస్తారా??. -
మారనున్న సీన్.. మోదీ సర్కార్‌కు పెద్ద పరీక్షే!
పలు దేశాల్లో పోరాటాలతో ప్రభుత్వాలను గద్దె దించిన ఘనత జెన్ జీదే. అలాంటి తరం భారత్‌లో కొత్త రాజకీయ సమీకరణకు కారణం కాబోతోందా?. రాజకీయాన్ని కేవలం కంటెంట్‌గా చూసే ఈ జనరేషన్.. రాబోయే ఎన్నికల్లో నిజంగానే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందా?.. అవుననే అంటున్నాయి పలు విశ్లేషణలు.భారత రాజకీయాల్లో 12 ఏళ్ల కిందట నాయకత్వ మార్పు జరిగింది. అప్పట్లో మిల్లెనియల్స్ అనే తరం (1981–1996లో పుట్టినవాళ్లు) పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నారు. వారు యూపీఏ పాలనతో విసిగిపోయో.. మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూసో.. ఎన్డీయేకు రెండుసార్లు పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో ఓటర్లలో మూడో వంతుగా, 2019లో దాదాపు 40 శాతంగా ఉండి మోదీ సర్కార్‌ను గెలిపించారు. కానీ, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ సీన్ మారబోతోంది.2024 ఎన్నికల్లో జెన్‌జీ రూపంలో 9 కోట్ల మంది కొత్త ఓటర్లు సరికొత్త రాజకీయ సమీకరణకు సంకేతాలు ఇచ్చారు. ఫలితంగా.. ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చినా మెజారిటీపై ప్రభావం చూపెట్టింది. అయితే మరో మూడేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది ఈ తరమే. అప్పటికల్లా భారత జనాభా 151 కోట్లకు చేరవచ్చని ఓ అంచనా. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. మిల్లెనియల్స్ + జెన్‌జీ కలిపి 91 కోట్లకు చేరుకుంటుందని.. ఇందులో జెన్‌జీ తరంవాళ్లే అత్యంత పెద్ద వర్గం ఓటర్లుగా(43 నుంచి 47 శాతం) ఉండబోతున్నారు.1997–2012 మధ్య పుట్టిన జెన్‌జీ తరం మోదీ పాలన చూస్తూ పెరిగారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాం గురించి వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు(తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్లు లేకపోలేదు). కాబట్టి ఈ జనరేషన్ బీజేపీ ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఓ వ్యవస్థగానే చూస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ జనాభా సుమారు 2.5 బిలియన్లు, అంటే ప్రపంచ జనాభాలో 30% అన్నమాట. ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్క భారతదేశంలోనే 40 కోట్ల దాకా ఈ జనాభా ఉంది. ఇప్పటికే వారు దేశ కార్మిక శక్తిలో నాలుగో వంతుగా ఉన్నారు. 2030 నాటికి వీళ్ల ద్వారా ఎకనమీ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని ఓ అంచనా. సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాజకీయ అవగాహన పొందడం వీరికున్న మరో ప్రత్యేకత.అయితే.. భారత్‌లో దేశీయంగా ఐటీ వృద్ధి మందగించడం, విద్యావకాశాలు తగ్గిపోతుండడం, నిరుద్యోగం రేటు గణనీయంగా పెరగడం, విదేశీ అవకాశాలు కఠినతరం కావడం, ఆర్థిక భద్రత కొరవడడం ఆందోళనను రేకెత్తిస్తోంది. గిగ్, తయారీ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ వాదనతో జెన్‌జీ ససేమీరా అంటోంది. ఇది కేవలం విధానపరమైన చర్చ మాత్రమే కాదు.. ఈ జనరేషన్‌కి నిత్యజీవిత సమస్య కూడా.సోషల్ మీడియా ఒకప్పుడు అధికార మార్పుకు కీలకమైన సాధనం. అయితే ఇప్పుడు అదొక విభిన్న వేదికగా మారింది. ఒక కథనాన్ని ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా పలు కోణాల్లో చర్చించేందుకు అక్కడ అవకాశం ఉంటోంది. ఇందులో అత్యధికంగా పాల్గొంటోంది కూడా జెన్‌జీనే.కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కచ్చితంగా భిన్నంగా ఉండబోతున్నాయి. అంటే గత ఎన్నికల్లా బీజేపీ-కాంగ్రెస్‌ల పోలిక కంటే.. ‘‘మాకు మంచి చేసింది ఎవరు?’’ అనే ప్రశ్నే 2029లో వారి ఓటును డిసైడ్ చేయబోతోంది. వీళ్ల తీర్పు గతం ఆధారంగా కాకుండా, ప్రస్తుత ఫలితాలు (ఉద్యోగాలు, విద్య, అవకాశాలు) ఆధారంగా ఉండబోతోంది. ఈ లెక్కన 2029 ఎన్నికలు మోదీ సర్కార్‌కు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.పైన చెప్పుకున్నది రాజకీయ అభిప్రాయం ఎంత మాత్రం కాదు. ఇది డేటా ఆధారిత విశ్లేషణ. పీఎల్ఎఫ్ఎస్ (Periodic Labour Force Survey)భారతదేశంలో ఉద్యోగాలు, నిరుద్యోగం, కార్మికశక్తి పాల్గొనడం వంటి అంశాలపై డేటా ఇస్తుంది. కేంద్ర బ్యాంక్ RBI ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై నివేదికలు విడుదల చేస్తుంది. నాస్కామ్(NASSCOM) .. ఐటీ రంగంలో ఉద్యోగాలు, వృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై నివేదికలు ఇస్తుంది. ఈ మూడింటి డేటా ఆధారంగా.. Gen Z Is Not Impressed With Modi | The 2029 Election Warning అనే యూట్యూబ్ వీడియోలో Gen Z ఓటర్ల ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అవకాశాల లోటు గురించి వివరించారు.అలాగే.. ది పయనీర్ పత్రిక రాసిన ఓ వ్యాసంలో(Why Urban Gen Z Voters Prefer Narendra Modi’s Performance-Driven Politics) పట్టణ జెన్‌జీ ఓటర్లు ఫలితాలు, పనితీరు ఆధారంగా రాజకీయాలను అంచనా వేస్తున్నారని విశ్లేషించారు. అలాగే అజంతా అనే ఓ జర్నలిస్టు కమ్ రచయిత్రి ‘Youth and Politics: How Gen Z Is Reshaping India’s Democracy’ అనే వ్యాసంలో జెన్‌జీ రాజకీయ అవగాహన, 2024 ఎన్నికల్లో వారి పాత్ర గురించి, ఆపై సోషల్ మీడియా ప్రభావం, 2029 ఎన్నికల్లో వాళ్ల ప్రభావం ఎలా ఉండబోతోంది అని విశ్లేషించారు. VIDEO Credits: What Does This Data Say -
స్క్రీన్ టైమ్: సరికొత్త నిర్వచనంలో ‘జెన్ జీ’
నేటి తరం తల్లిదండ్రులుగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ‘జెన్ జీ’లు తమ పిల్లల పెంపకంలో పాతకాలపు పద్ధతులను పక్కన పెడుతూ, సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా మధ్య పెరిగిన ఈ తరానికి డిజిటల్ ప్రపంచంపై పూర్తి అవగాహన ఉంది. అందుకే వీరు స్క్రీన్ టైమ్‌ను ఒక అడ్డంకిగా భావించకుండా, దానిని ఉపయుక్తమైన పనిగా చెబుతున్నారు.పిల్లల ప్రారంభ దశ అభివృద్ధిలో డిజిటల్ ఎక్స్పోజర్,స్వీయ అనుభవాలు పరస్పర విరుద్ధమైనవి కావని, అవి ఒకదానికొకటి తోడ్పడతాయని ‘జెన్ జీ’ పేరెంట్స్ చెబుతున్నారు. ఆధునిక పేరెంటింగ్‌ను తమదైన శైలిలో తిరగరాస్తున్నారు. గత తరాల వారు స్క్రీన్ టైమ్ అంటే ఆందోళన చెందుతారు. అయితే సాంకేతికతను, సృజనాత్మకతను స్క్రీన్‌పై చూసిన జెన్ జీ తల్లిదండ్రులు ఇప్పుడు ఈ చర్చను ‘ఎంత సమయం?’ అనేలా కాకుండా ‘ఏం చూస్తున్నారు’ అనే దిశగా మళ్లించారు. గంటల లెక్క కాకుండా, పిల్లలు చూసే కంటెంట్ నాణ్యత, వారి ఉద్దేశ్యం ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నారు.‘జెన్ జీ’ పేరెంట్స్‌కు డిజిటల్ అలసట (Digital Fatigue)పై అవగాహన ఉండటంతో స్క్రీన్ వినియోగాన్ని మరింత విజ్ఞతతో కూడిన పద్ధతిలో పిల్లలు ఉపయోగించేలా పర్యవేక్షిస్తున్నారు. డిజిటల్ ప్రపంచంతో అనుసంధానమై ఉండటం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని గుర్తించిన జెన్ జీ తల్లిదండ్రులు, ఆఫ్‌లైన్ కార్యకలాపాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బొమ్మలు గీయడం, నిర్మాణ నమూనాలు రూపొందించడం (Building Blocks), ఆరుబయట ఆడుకోవడం మొదలైనవాటి ద్వారా పిల్లల్లో భావోద్వేగ వికాసం మెరుగుపడుతుందని ‘జెన్ జీ’ పేరెంట్స్ నమ్ముతున్నారు.అటు డిజిటల్ పరిజ్ఞానం, ఇటు శారీరక శ్రమ.. ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటించడం ద్వారా పిల్లల ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని పెంపొందించవచ్చని ఈ తరం భావిస్తోంది. కాగా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారుతున్న నేపథ్యంలో పాఠశాలలు కూడా తమ విద్యాబోధనలో మార్పులు చేస్తున్నాయి. తరగతి గదుల్లో కేవలం డిజిటల్ పరికరాలకే పరిమితం కాకుండా, విద్యార్థులు ప్రశ్నించేలా, సహచరులతో కలిసి మెలిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఈ నయాగరాకు ఏమైంది? -
జెన్జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!?
జెన్‌జీ అనగానే చాలామందికి రకరకాల అపోహలు. సక్రమంగా పనిచేయరని, ఏ విషయానికీ శ్రద్ధ చూపరని, బాధ్యతగా ఉండరని… ఇలా ఇంటా బయటా వారిమీద ఓ అవవాదు ఉంది. కానీ తాజాగా వెలువడిన ఒక నివేదిక మాత్రం ఈ అపోహలను చెరిపేసింది. ‘జెన్జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!’ అని అనిపించేలా ఆ నివేదికలో వివరాలు బయటపడ్డాయి. ఏంటా నివేదిక? ఆ నివేదికలో ఏముంది?బార్, రెస్టారెంట్, హౌస్ పార్టీ – ఏ సందర్భమైనా మద్యం తప్పనిసరి అన్న భావన ఉండేది. కానీ తాజాగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జెన్జీలు మద్యం వినియోగానికి దూరంగా ఉంటున్నారని తేలింది. బీర్, వైన్, స్పిరిట్స్ వంటి పానీయాలను వీరు పెద్దగా పట్టించుకోవడం లేదు. యువతలో మద్యం వినియోగం తగ్గుతుండగా, ఆరోగ్యంపై శ్రద్ధ, మితంగా జీవించడం, జీరో-అల్కహాల్ పానీయాలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగ ధోరణులు మారుతున్నాయి.అమెరికాలో గ్యాలప్ సర్వే ప్రకారం 18-34 ఏళ్ల వయసు గల యువతలో మద్యం తాగే వారి శాతం గత రెండు దశాబ్దాల్లో తగ్గింది. 2000ల ప్రారంభంలో 72 శాతం మంది తాగుతుండగా, ఇటీవల అది 62 శాతానికి పడిపోయింది. మిల్లెనియల్స్తో పోలిస్తే జెన్‌జీ తరం సుమారు 20 శాతం తక్కువగా మద్యం సేవిస్తోంది. మరో సర్వే ప్రకారం 21.5 శాతం మంది జెన్జీలు అసలు మద్యం తాగరని, 39 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే తాగుతారని తేలింది. ఎందుకు తగ్గిస్తున్నారు?మద్యం వల్ల నిద్రలేమి, ఆందోళన, హ్యాంగోవర్ వంటి సమస్యలు వస్తాయని యువత స్పష్టంగా గుర్తిస్తోంది. ఫిట్నెస్, మైండ్‌ఫుల్‌నెస్, మానసిక స్థైర్యం కోసం మద్యం దూరం చేస్తున్నారు.సామాజిక ప్రభావం: సోషల్ మీడియా యుగంలో ప్రతి నిర్ణయం బహిరంగంగా కనిపిస్తోంది. అందుకే మద్యం తాగకపోవడం కూడా ఒక సామాజిక సందేశంగా మారింది. ‘సోబర్ క్యూయిరియస్’ ఉద్యమాలు, మద్యం లేని సమావేశాలు, వెల్నెస్ ఈవెంట్లు యువత సంస్కృతిలో భాగమయ్యాయి.ఆర్థిక కారణాలు: పెరుగుతున్న జీవన ఖర్చులు, విద్యా రుణాలు, గృహ వ్యయాలు. ఇవన్నీ మద్యం వినియోగాన్ని తగ్గించేలా ప్రభావం చూపుతున్నాయి. ఖరీదైన నైట్‌లైఫ్ కన్నా ఇంట్లో సమావేశాలు, నాన్-అల్కహాలిక్ పానీయాలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.తాగుతున్నవారు కూడా..జెన్‌జీ తరం పూర్తిగా మద్యం మానేసిందని కాదు. తాగుతున్నవారు కూడా పూర్వతరాలతో పోలిస్తే భిన్నంగా తాగుతున్నారు. తక్కువ సార్లు, తక్కువ పరిమాణంలో, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాగుతున్నారు. అలాగే లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్, ఫ్లేవర్డ్ పానీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆహార, అతిథ్య రంగంపై ప్రభావంఈ మార్పు రెస్టారెంట్లు, బార్లు, బ్రాండ్లను కొత్త దారిలో నడిపిస్తోంది. మాక్టెయిల్స్, లో-అల్కహాల్ డ్రింక్స్, ప్రీమియం నాన్-అల్కహాలిక్ పానీయాలు ఇప్పుడు మెనూలో ప్రధాన స్థానాన్ని పొందుతున్నాయి. పానీయాల కంపెనీలు కొత్తగా లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్ విభాగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.జెన్‌జీ తరం మద్యం వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడం కాదు, దాని పాత్రను తిరిగి నిర్వచిస్తోంది. ఆరోగ్య ప్రాధాన్యత, ఆర్థిక వాస్తవాలు, సామాజిక మార్పులు – ఇవన్నీ కలిపి ఈ తరాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. సంప్రదాయాలను ప్రశ్నించే, అలవాట్లకన్నా ఉద్దేశ్యాన్ని విలువ చేసే తరం ఇది. -
జెన్ జడ్.. పదం కాదు.. ఓ తరం.. ఆసక్తికర విషయాలివే..!
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన.. ఈ సాంకేతికను అలవర్చుకున్న.. చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్‌నే జెన్‌జడ్ అని.. అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా.. కొత్త ఆలోచనలు.. దానికి మించి.. ఆన్లైన్ సాంకేతికత.. అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్.ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్క్షానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్.., "ఐ జనరేషన్".., "డిజిటల్ స్థానికులు"... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్‌జడ్‌లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు.దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.. లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే.. దీంతో వారి మనస్సులు.. వారి సామాజిక స్పృహ.. ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు.జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం.. కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా.. ఎక్కువగా ఆలోచిస్తారు.. చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం.. దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Zలో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం.. సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం.. ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్‌లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు.జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.. భయం లేకుండా ప్రవర్తించడం.. కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని.. లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికితీయడానికి ప్రయత్నిస్తారు. జెన్‌జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు.. భావోద్వేగాలకు తావు లేకుండా.. బాధను వ్యక్తీకరించడం.. ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.. సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా.. వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్లైన్లో చర్చల ద్వారా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు.. ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన.. చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు.. వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్.. అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం.. ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు.. కలిగి ఉంటారు.కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ.. బలహీనత కాదు.. అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.. గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి.. కానీ జెన్‌జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.. తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్‌జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.


