జెన్‌జీ అనగానే చాలామందికి రకరకాల అపోహలు. సక్రమంగా పనిచేయరని, ఏ విషయానికీ శ్రద్ధ చూపరని, బాధ్యతగా ఉండరని… ఇలా ఇంటా బయటా వారిమీద ఓ అవవాదు ఉంది. కానీ తాజాగా వెలువడిన ఒక నివేదిక మాత్రం ఈ అపోహలను చెరిపేసింది. ‘జెన్‌జీలు ఇంత మంచోళ్ళు ఏంట్రా!’ అని అనిపించేలా ఆ నివేదికలో వివరాలు బయటపడ్డాయి. ఏంటా నివేదిక? ఆ నివేదికలో ఏముంది?
బార్, రెస్టారెంట్, హౌస్ పార్టీ – ఏ సందర్భమైనా మద్యం తప్పనిసరి అన్న భావన ఉండేది. కానీ తాజాగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జెన్‌జీలు మద్యం వినియోగానికి దూరంగా ఉంటున్నారని తేలింది. బీర్, వైన్, స్పిరిట్స్ వంటి పానీయాలను వీరు పెద్దగా పట్టించుకోవడం లేదు. యువతలో మద్యం వినియోగం తగ్గుతుండగా, ఆరోగ్యంపై శ్రద్ధ, మితంగా జీవించడం, జీరో-అల్కహాల్ పానీయాలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగ ధోరణులు మారుతున్నాయి.
అమెరికాలో గ్యాలప్ సర్వే ప్రకారం 18-34 ఏళ్ల వయసు గల యువతలో మద్యం తాగే వారి శాతం గత రెండు దశాబ్దాల్లో తగ్గింది. 2000ల ప్రారంభంలో 72 శాతం మంది తాగుతుండగా, ఇటీవల అది 62 శాతానికి పడిపోయింది. మిల్లెనియల్స్‌తో పోలిస్తే జెన్‌జీ తరం సుమారు 20 శాతం తక్కువగా మద్యం సేవిస్తోంది. మరో సర్వే ప్రకారం 21.5 శాతం మంది జెన్‌జీలు అసలు మద్యం తాగరని, 39 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే తాగుతారని తేలింది.
ఎందుకు తగ్గిస్తున్నారు?
మద్యం వల్ల నిద్రలేమి, ఆందోళన, హ్యాంగోవర్ వంటి సమస్యలు వస్తాయని యువత స్పష్టంగా గుర్తిస్తోంది. ఫిట్‌నెస్, మైండ్‌ఫుల్‌నెస్, మానసిక స్థైర్యం కోసం మద్యం దూరం చేస్తున్నారు.

సామాజిక ప్రభావం: సోషల్ మీడియా యుగంలో ప్రతి నిర్ణయం బహిరంగంగా కనిపిస్తోంది. అందుకే మద్యం తాగకపోవడం కూడా ఒక సామాజిక సందేశంగా మారింది. ‘సోబర్ క్యూయిరియస్’ ఉద్యమాలు, మద్యం లేని సమావేశాలు, వెల్‌నెస్ ఈవెంట్లు యువత సంస్కృతిలో భాగమయ్యాయి.

ఆర్థిక కారణాలు: పెరుగుతున్న జీవన ఖర్చులు, విద్యా రుణాలు, గృహ వ్యయాలు. ఇవన్నీ మద్యం వినియోగాన్ని తగ్గించేలా ప్రభావం చూపుతున్నాయి. ఖరీదైన నైట్‌లైఫ్ కన్నా ఇంట్లో సమావేశాలు, నాన్-అల్కహాలిక్ పానీయాలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
తాగుతున్నవారు కూడా..
జెన్‌జీ తరం పూర్తిగా మద్యం మానేసిందని కాదు. తాగుతున్నవారు కూడా పూర్వతరాలతో పోలిస్తే భిన్నంగా తాగుతున్నారు. తక్కువ సార్లు, తక్కువ పరిమాణంలో, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాగుతున్నారు. అలాగే లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్, ఫ్లేవర్డ్ పానీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆహార, అతిథ్య రంగంపై ప్రభావం
ఈ మార్పు రెస్టారెంట్లు, బార్లు, బ్రాండ్లను కొత్త దారిలో నడిపిస్తోంది. మాక్‌టెయిల్స్, లో-అల్కహాల్ డ్రింక్స్, ప్రీమియం నాన్-అల్కహాలిక్ పానీయాలు ఇప్పుడు మెనూలో ప్రధాన స్థానాన్ని పొందుతున్నాయి. పానీయాల కంపెనీలు కొత్తగా లో-అల్కహాల్, నాన్-అల్కహాలిక్ విభాగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.
జెన్‌జీ తరం మద్యం వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడం కాదు, దాని పాత్రను తిరిగి నిర్వచిస్తోంది. ఆరోగ్య ప్రాధాన్యత, ఆర్థిక వాస్తవాలు, సామాజిక మార్పులు – ఇవన్నీ కలిపి ఈ తరాన్ని కొత్త దారిలో నడిపిస్తున్నాయి. సంప్రదాయాలను ప్రశ్నించే, అలవాట్లకన్నా ఉద్దేశ్యాన్ని విలువ చేసే తరం ఇది.


