మారనున్న సీన్‌.. మోదీ సర్కార్‌కు పెద్ద పరీక్షే! | Gen Z 2029 Verdict And Their Growing Impact On Indian Politics, Biggest Test For Modi Sarkar, Watch Video Inside | Sakshi
Sakshi News home page

మారనున్న సీన్‌.. మోదీ సర్కార్‌కు పెద్ద పరీక్షే!

Apr 27 2026 12:09 PM | Updated on Apr 27 2026 1:25 PM

Gen Z 2029 Verdict: Biggest Test For Modi Sarkar

పలు దేశాల్లో పోరాటాలతో ప్రభుత్వాలను గద్దె దించిన ఘనత జెన్‌ జీదే. అలాంటి తరం భారత్‌లో కొత్త రాజకీయ సమీకరణకు కారణం కాబోతోందా?. రాజకీయాన్ని కేవలం కంటెంట్‌గా చూసే ఈ జనరేషన్‌.. రాబోయే ఎన్నికల్లో నిజంగానే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందా?.. అవుననే అంటున్నాయి పలు విశ్లేషణలు.

భారత రాజకీయాల్లో 12 ఏళ్ల కిందట నాయకత్వ మార్పు జరిగింది. అప్పట్లో మిల్లెనియల్స్‌ అనే తరం (1981–1996లో పుట్టినవాళ్లు) పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నారు. వారు యూపీఏ పాలనతో విసిగిపోయో.. మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూసో.. ఎన్డీయేకు రెండుసార్లు పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో ఓటర్లలో మూడో వంతుగా, 2019లో దాదాపు 40 శాతంగా ఉండి మోదీ సర్కార్‌ను గెలిపించారు. కానీ, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ సీన్‌ మారబోతోంది.

2024 ఎన్నికల్లో జెన్‌జీ రూపంలో 9 కోట్ల మంది కొత్త ఓటర్లు సరికొత్త రాజకీయ సమీకరణకు సంకేతాలు ఇచ్చారు. ఫలితంగా.. ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చినా మెజారిటీపై ప్రభావం చూపెట్టింది. అయితే మరో మూడేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది ఈ తరమే. అప్పటికల్లా భారత జనాభా 151 కోట్లకు చేరవచ్చని ఓ అంచనా. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. మిల్లెనియల్స్‌ + జెన్‌జీ కలిపి 91 కోట్లకు చేరుకుంటుందని.. ఇందులో జెన్‌జీ తరంవాళ్లే అత్యంత పెద్ద వర్గం ఓటర్లుగా(43 నుంచి 47 శాతం) ఉండబోతున్నారు.

1997–2012 మధ్య పుట్టిన జెన్‌జీ తరం మోదీ పాలన చూస్తూ పెరిగారు. అంతకు ముందు కాంగ్రెస్‌ హయాం గురించి వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు(తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్లు లేకపోలేదు). కాబట్టి ఈ జనరేషన్‌ బీజేపీ ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఓ వ్యవస్థగానే చూస్తూ వస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ జనాభా సుమారు 2.5 బిలియన్లు, అంటే ప్రపంచ జనాభాలో 30% అన్నమాట. ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్క భారతదేశంలోనే 40 కోట్ల దాకా ఈ జనాభా ఉంది. ఇప్పటికే వారు దేశ కార్మిక శక్తిలో నాలుగో వంతుగా ఉన్నారు. 2030 నాటికి వీళ్ల ద్వారా ఎకనమీ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని ఓ అంచనా. సంప్రదాయ మీడియా కంటే డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాజకీయ అవగాహన పొందడం వీరికున్న మరో ప్రత్యేకత.

అయితే.. భారత్‌లో దేశీయంగా ఐటీ వృద్ధి మందగించడం, విద్యావకాశాలు తగ్గిపోతుండడం, నిరుద్యోగం రేటు గణనీయంగా పెరగడం, విదేశీ అవకాశాలు కఠినతరం కావడం, ఆర్థిక భద్రత కొరవడడం ఆందోళనను రేకెత్తిస్తోంది. గిగ్‌, తయారీ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ వాదనతో జెన్‌జీ ససేమీరా అంటోంది. ఇది కేవలం విధానపరమైన చర్చ మాత్రమే కాదు.. ఈ జనరేషన్‌కి నిత్యజీవిత సమస్య కూడా.

సోషల్ మీడియా ఒకప్పుడు అధికార మార్పుకు కీలకమైన సాధనం. అయితే ఇప్పుడు అదొక విభిన్న వేదికగా మారింది. ఒక కథనాన్ని ఒకే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కాకుండా పలు కోణాల్లో చర్చించేందుకు అక్కడ అవకాశం ఉంటోంది. ఇందులో అత్యధికంగా పాల్గొంటోంది కూడా జెన్‌జీనే.

కాబట్టి వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు కచ్చితంగా భిన్నంగా ఉండబోతున్నాయి. అంటే గత ఎన్నికల్లా బీజేపీ-కాంగ్రెస్‌ల పోలిక కంటే.. ‘‘మాకు మంచి చేసింది ఎవరు?’’ అనే ప్రశ్నే 2029లో వారి ఓటును డిసైడ్‌ చేయబోతోంది. వీళ్ల తీర్పు గతం ఆధారంగా కాకుండా, ప్రస్తుత ఫలితాలు (ఉద్యోగాలు, విద్య, అవకాశాలు) ఆధారంగా ఉండబోతోంది. ఈ లెక్కన 2029 ఎన్నికలు మోదీ సర్కార్‌కు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

పైన చెప్పుకున్నది రాజకీయ అభిప్రాయం ఎంత మాత్రం కాదు. ఇది డేటా ఆధారిత విశ్లేషణ. పీఎల్‌ఎఫ్‌ఎస్‌ (Periodic Labour Force Survey)భారతదేశంలో ఉద్యోగాలు, నిరుద్యోగం, కార్మికశక్తి పాల్గొనడం వంటి అంశాలపై డేటా ఇస్తుంది. కేంద్ర బ్యాంక్‌ RBI ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై నివేదికలు విడుదల చేస్తుంది. నాస్కామ్‌(NASSCOM) .. ఐటీ రంగంలో ఉద్యోగాలు, వృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాలపై నివేదికలు ఇస్తుంది. ఈ మూడింటి డేటా ఆధారంగా..  Gen Z Is Not Impressed With Modi | The 2029 Election Warning అనే యూట్యూబ్‌ వీడియోలో Gen Z ఓటర్ల ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అవకాశాల లోటు గురించి వివరించారు.

అలాగే.. ది పయనీర్‌ పత్రిక రాసిన ఓ వ్యాసంలో(Why Urban Gen Z Voters Prefer Narendra Modi’s Performance-Driven Politics) పట్టణ జెన్‌జీ ఓటర్లు ఫలితాలు, పనితీరు ఆధారంగా రాజకీయాలను అంచనా వేస్తున్నారని విశ్లేషించారు. అలాగే అజంతా అనే ఓ జర్నలిస్టు కమ్‌ రచయిత్రి ‘Youth and Politics: How Gen Z Is Reshaping India’s Democracy’ అనే వ్యాసంలో జెన్‌జీ రాజకీయ అవగాహన, 2024 ఎన్నికల్లో వారి పాత్ర గురించి, ఆపై సోషల్ మీడియా ప్రభావం, 2029 ఎన్నికల్లో వాళ్ల ప్రభావం ఎలా ఉండబోతోంది అని విశ్లేషించారు.

 

VIDEO Credits: What Does This Data Say

Advertisement
 
Advertisement
Advertisement