అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు | Kakinada Gyaneshwari Father Ganesh Key Comments Over Missing Case | Sakshi
Sakshi News home page

అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు

Jun 14 2026 10:43 AM | Updated on Jun 14 2026 12:26 PM

Kakinada Gyaneshwari Father Ganesh Key Comments Over Missing Case

సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. బాలిక అదృశ్యమై తొమ్మిది రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క మృతి చెందడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి గణేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌ రంగంలోకి దిగింది. జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న పామాయిల్ తోట, నల్లకొండ మీద గాలింపు చర్యలు చేపట్టారు. 

తాజాగా జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ మాట్లాడుతూ.. తమ కుమార్తె ఇంటికి చాలా దగ్గరలోనే ఆడుకునేదని, ఇంటి నుంచి 20 మీటర్ల దూరం కూడా ఒంటరిగా వెళ్లే అలవాటు లేదని తెలిపారు. మా పాప అంత దూరం వెళ్లే పిల్ల కాదు. ఆమెను ఎవరో అపహరించి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్లినా ఆమె పెంపుడు కుక్క ఎప్పుడూ వెంటే ఉంటుంది. ఇంటి సమీపంలోని తోటలో, పరిసర ప్రాంతాల్లో ఆ కుక్కతో కలిసి ఆడుకోవడం ఆమెకు అలవాటని తెలిపారు. అందుకే బాలిక అదృశ్యమైన తర్వాత ఆ కుక్క కదలికలు కేసులో కీలక ఆధారంగా మారుతాయని భావించారు.

ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్వరి ఇంటి నుండి పోస్టుమార్టం కోసం పెంపుడు కుక్క మృతదేహాన్ని తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఎన్.సూరవరం పశువుల ఆసుపత్రిలో కుక్కకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే, కుక్క మృతదేహన్ని తరలిస్తుండగా పాప తల్లి భవాని కన్నీరుపెట్టుకుంది. గత ఆరు నెలలుగా కుక్కను పెంచుకుంటున్నామని.. జ్ఞానేశ్వరి ఆ కుక్కతోనే ఆడుకునేదని రోదించింది. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉన్న ఒక్క ఆధారం పోయిందని కంటతడి పెట్టుకుంది. 

అయితే ఇటీవల ఆ పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. కుక్క మృతిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన సహజమా? లేక బాలిక అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. కుక్క మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కుక్క ఎలా చనిపోయిందనే విషయంపై స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు.

అదంతా అబద్దం..
ఇదిలా ఉండగా.. "పాపను తోట బయట చూశాను" అని పాపారావు అనే వ్యక్తి చెప్పిన వాదనను జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. తమ కుమార్తె ఒంటరిగా తోట దాటి బయటకు వెళ్లే అవకాశం లేదని, ఆ వాదనను తాము నమ్మడం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బాలిక అదృశ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అపహరణ కోణంతో పాటు ఇతర అన్ని అవకాశాలపైనా దర్యాప్తు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడం, కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క కూడా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement