అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వివాదాస్పద వైఖరిపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలిసింది. అక్రమ వ్యవహారాలపై నివేదికలు సేకరించినట్లు టీడీపీ నాయకుల్లోనే చర్చ సాగుతోంది.
అధికారంలోకి వచ్చాక వివాదాల పర్వంలో మచ్చుకు...
నెల క్రితం శింగనమల మండలంలోని సి. బండమీద పల్లి సమీపంలో వైఎస్సార్‌సీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనాన్ని రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన ఎస్‌ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్‌దిగా గుర్తించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిని కప్పిపుచ్చేందుకు కుట్రలకు తెరలేపడం చర్చనీయాంశమైంది.
ఐదు నెలల క్రితం అన్నమయ్య జిల్లాలోని గండ బోయిన పల్లి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు హల్‌చల్ చేశారు. వాహనాన్ని ఆపారంటూ మహిళా సిబ్బందిపై ఏకంగా దాడికి దిగారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే టోల్ రుసుము కూడా కట్టలేని స్థితిలో ఉన్నారా అంటూ ప్రతిపక్షాలు అప్పట్లో దుమ్మెత్తిపోశాయి. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
గత ఏడాది అక్టోబర్‌లో అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఎలైట్ అపార్ట్‌మెంట్ వద్ద ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు, ఆయన అల్లుడు నానా యాగీ చేశారు. అకారణంగా తమపై దాడి చేశారంటూ అక్కడి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్ భార్య సుజాత ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
గత ఏడాది జూన్‌లో ఎస్‌ఆర్‌సీకి సంబంధించి వెలుగుచూసిన ఈ స్టాంప్ డ్యూటీ గోల్‌మాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి యూనియన్ బ్యాంకు నుంచి రూ.900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి మరో రూ.20 కోట్లు రుణం తీసుకున్నారు. స్టాంప్ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కన్నం పడింది. తప్పుడు డాక్యుమెంట్లతో మోసం చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ కుంభకోణంపై మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, సీఐడీ, ఈడీతో విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం.
చంద్రబాబు దృష్టికి వ్యవహారం
అమిలినేని వివాదాస్పద వ్యవహారాలపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు నివేదికలు వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మద్యం షాపులను బలవంతంగా లాక్కోవడం, ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో బెల్టుషాపులు నిర్వహించడం, ఇసుకను భారీ ఎత్తున అక్రమంగా తరలించడం వంటి వాటిపై కూడా నివేదికలు సేకరించినట్లు సమాచారం.
అక్రమ కేసులతో భయపెడుతూ..
అమిలినేని తీరును, నియోజకవర్గంలో ఆయన మేనల్లుళ్లు సాగిస్తున్న అక్రమాలను ప్రశి్నస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అన్యాయాలపై ప్రశ్నించే వారిని పోలీసు యంత్రాంగం ద్వారా భయపెడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ నేతలను కూడా భయపెడుతున్నారనే ఆరోపణలున్నాయి.


