సాక్షి, విశాఖపట్నం: జగన్ పర్యటనలో జనం లేరు అని చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నం మరోసారి ఘోరంగా విఫలమైంది. గురువారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్పందన లభించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇది మొదలైంది. పలుచోట్ల కాన్వాయ్ ఆగడంతో జగన్ వాహనం దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఆప్యాయంగా వాళ్లను పలకరించి.. సమస్యలను విన్నారు. ఈ క్రమంలో ఆయన వాహనం నెమ్మదిగా ముందుకు కదలింది.
జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీసు వ్యవస్థను ప్రయోగించింది. గత రెండేళ్లలో ఏనాడూ లేని రీతిలో.. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అటువైపు రావొద్దని జనాలను హెచ్చరించారు. కేవలం 8 వాహనాల కాన్వాయ్‌తో.. సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదరించారు. అయినప్పటికీ జనం తగ్గలేదు.

ఈ క్రమంలో గురువారం ఉదయం అటు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి కాపలా కాశారు. కానీ, జనం మాత్రం ‘జగన్ వెంటే మేం’ అని కదిలారు. ఆంక్షలను దాటుకుని జగన్ దగ్గరకు చేరుకున్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో మొదలైన జన వాహిని.. శ్రీకాకుళం దారి పొడవునా కనిపించింది. మహిళలు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్‌కు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ తన పర్యటనను కొనసాగించారు. భారీగా తరలివచ్చిన జనసందోహంతో ‘కూటమి సర్కార్ మైండ్ బ్లాక్’ అయ్యిందనే కామెంట్లు ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రహదారుల వెంట కనిపించిన ప్రజల తాకిడి.. జగన్‌పై ఉన్న అభిమానానికి నిదర్శనంగా కనిపించింది. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. జగన్‌కి ఉన్న ప్రజాదరణను అడ్డుకోలేరని మరోసారి రుజువు చేసింది.


