మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోర్టులో ఇకనైనా వేగంగా సాగుతుందా? ఈ కేసు ఈ ఏడేళ్లలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిందితులుగా ఉన్న వివేకా రక్త సంబంధికులు ఈ కేసు సత్వరమే విచారణకు రావాలని కోరుతుంటే, స్వయంగా వివేకా కుమార్తె సునీత ఈ విచారణ జాప్యం అవడానికి కారణం అవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
సీబీఐ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆమె తరచు వేస్తున్న పిటిషన్‌లు ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఆమె ఏకంగా కొత్తగా ప్రైవేట్ కేసును సీబీఐ కోర్ట్‌లో వేసి మళ్లీ మొదటినుండి సీబీఐ విచారణ కోరడం చూసి కోర్ట్ వారు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ చట్టపరంగా మెయిన్‌టెయినబుల్ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె లేవనెత్తిన అంశాలకు కోర్టువారు 70 పేజీలలో ఉత్తర్వులు ఇచ్చారు.. ఆమెకు ఎవరిమీద కోపం ఉంటే వారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్న విమర్శ వచ్చింది.
సీబీఐ తమను అక్రమంగా కేసులో చేర్చిందని కొంతమంది నిందితులు వాపోతుంటే, తానే వివేకాను చంపాను అన్న నిందితుడు ఆప్రోవర్‌గా మారడం విశేషంగా కనిపిస్తుంది. సునీత ఏ లాయర్‌నైతే నియమించుకున్నారో, ఆయనే ఇతనికి లాయర్‌గా ఉండడం, సుప్రీంకోర్టులో కేసులు వేయడం చిత్రంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
వివేకా హత్య జరిగిన తర్వాత కొంతకాలం పాటు ఆమె చేసిన ఆరోపణలకు, ఆ తర్వాత కాలంలో చేసిన అభియోగాలకు ఎందుకు తేడా వస్తోందంటే ఏమి చెబుదాం. వర్తమాన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్న భావన కలుగుతుంది. ఇందులో బంధాలు, అనుబందాల కన్నా, ఇతరత్రా లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తుండవచ్చు. తన తండ్రిని హత్య చేశానని బహిరంగంగా ప్రకటించిన దస్తగిరి అనే నిందితుడికి బెయిల్ రావడానికి సునీత సహకరించారన్న ప్రచారం ఆమె ప్రతిష్ట మసకబారేలా చేసిందనిపిస్తుంది. అలాగే అన్నిటిని మించి వరుసకు తన సోదరుడయ్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తగాదాపడి, తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న చదరంగంలో ఆమె ఒక పావుగా మారిందన్న ఆరోపణను వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తుంటారు.
ఈ కేసులో టీడీపీ చేసే విమర్శలు, ఈమె చేసే ఆరోపణలు గమనిస్తే అది నిజమేనేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్‌ను, ఆయన సతీమణిని ఎలాగైనా ఈ కేసులోకి తీసుకురావాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్లారు. ఆ సందర్భంగా కోర్టు సూచన మేరకు సీబీఐ మళ్లీ, మళ్లీ విచారణ చేసినా, ఎక్కడా ఎలాంటి కొత్త ఆధారాలు కనిపించలేదు. దాంతో ఎవరెవరిమీదో తోచిన ఆరోపణల్లా చేయడం, ఆ కోణంలో సీబీఐ విచారణ జరపడం నిత్యకృత్యంగా మారింది.
ఈ కేసులో సీబీఐ కూడా ఒక కీలకమైన కోణాన్ని వదలిపెట్టిందన్నది నిందితుల తరపు న్యాయవాదుల వాదన. వివేకా రెండో పెళ్లి చేసుకున్నారా? లేదా? ఆమెకు ఈయన ద్వారా సంతానం కలిగిందా? లేదా? ఆమె వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారా?లేదా? దస్తగిరి తరపున వాదించిన లాయర్ కాని, సునీత పక్షాన వాదన చేసిన లాయర్ కాని టీడీపీ తరపున పనిచేసేవారే కావడంలోని ఆంతర్యం ఏమిటి? వారికి ఢిల్లీలో లక్షల రూపాయల చొప్పున ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. అవన్ని ఎవరు సమకూర్చారు?వివేకా హత్య కేసులో ఆయన సమీప బంధువుల ప్రమేయం ఉందా? లేక వ్యక్తిగత స్నేహితుల హస్తం ఉందా? రియల్ ఎస్టేట్ లావాదేవీలు, సంబంధిత డబ్బు కారణంగా ఈ హత్య జరిగిందా? లేక ఎంపీ సీటుకు పోటీ వస్తాడన్న కారణంగా హత్య జరిగిందా?
ఇక్కడ ఒక లాజిక్ సీబీఐ కూడా మిస్ అవుతోందన్న అభిప్రాయం ఉంది. అవినాశ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో 2019 ఎన్నికలలో కూడా ఆయనే అభ్యర్ధి అని అందరికి తెలుసు. నిజంగా వివేకా ఎంపీ సీటు ఆశించి ఉంటే, అవినాశ్ తరపున ప్రచారానికి ఎందుకు వెళతారు? ఇలాంటి మిస్సింగ్ లింకులన్నీ విచారణ సందర్భంగా ఒక కొలిక్కి వస్తాయోమో తెలియదు. హత్య జరిగిన రోజు వివేకా రాసిన లేఖ, ఆయన పీఏ. కృష్ణారెడ్డి వాదన, సీబీఐ అధికారులను మార్చిన వైనం మొదలైనవి ఎన్నో శేషప్రశ్నలుగా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరుతెన్నులపై పరిశోధన జరిగితే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయేమో చెప్పలేం.
అంతేకాదు... వివేకా హత్య కేసులో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు స్పష్టమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు పదేపదే ఆయనపై ఎందుకు ఆరోపణలు చేశారు? ఇప్పటికీ ఎందుకు చేస్తూనే ఉన్నారు. అంతేకాక వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీగా ముద్రవేసి లబ్ది పొందాలని ఎందుకు యత్నిస్తున్నారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద కూడా మాయం చేసిన నేపథ్యంలో టీడీపీకి బూడిద పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని పేరు పెట్టి కౌంటర్ ఇచ్చి ఉండవచ్చు. అది వేరే విషయం.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు సునీతకు, బహుశా టీడీపీకి, ఎల్లో మీడియాకు ఆశాభంగం కలిగించి ఉండాలి. మరోసారి విచారణ చేయండని సీబీఐ కోర్టు ఆదేశించి ఉంటే ఆ పేరుతో మరికొంతకాలం గడిచేదేమో! కాని చట్టం ప్రకారం అది కరెక్టు కాదని గౌరవ న్యాయస్థానం అభిప్రాయపడి సునీత పిటిషన్‌ను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ సరిపోలేదని సునీత అంటున్నా, కొత్త ఆధారాలు ఏమీ వెలుగులోకి రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఎలా చేయాలో తాము నిర్దేశించజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది.
రోజువారీ విచారణ జరగాలని ఒకవైపు కోర్టును కోరుతూ, సీబీఐ దర్యాప్తు మరింత లోతుగా జరపాలని మరో వైపు కోర్టులలో ఆమె పిటిషన్లు వేస్తున్నారని నిందితుల తరపున న్యాయవాదులు పేర్కొంటున్నారు. క్రిమినల్ కేసుల్లో నిరంతర దర్యాప్తు జరగదని, సుప్రీంకోర్టు కూడా వేగవంతంగా ఈ కేసును విచారించాలని ఆదేశించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కుమార్తె అన్న సానుభూతి పొందడానికి ఆమె ప్రయత్నిస్తున్నారా? లేక చిత్తశుద్దితో తన తండ్రి హత్య కేసు విచారణ సత్వరమే జరగాలని కోరుకుటున్నారా? అన్న ప్రశ్నలను ప్రతివాదులు వేస్తున్నారు.
విశేషం ఏమిటంటే ఏ కేసులో అయినా నిందితులు విచారణ జాప్యం కావాలని ప్రయత్నిస్తుంటారు. కాని ఈ కేసులో మాత్రం స్వయంగా వివేకా కుమార్తె పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యానికి కారణం అవుతున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఆ విషయాన్ని ఆమె గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా దురుద్దేశాలతోనో, కక్ష కట్టి ఎవరిపైనో కేసును బనాయించాలని ప్రయత్నించడం సమంజసం కాదని పలువురి వ్యాఖ్యగా ఉంది. పైగా ఇందులో రాజకీయంగా తన తండ్రి ప్రత్యర్థుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారన్న విమర్శలు రావడం కూడా ఆమెకు మంచిది కాదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


