సాక్షి, నెల్లూరు జిల్లా: ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో అన్నీ కోతలే.. ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. రైతుల మీద కేసులు బనాయించిన ఏకైక ప్రభుత్వం టీడీపీ’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.
‘‘విద్యా వ్యవస్థను భష్టు పట్టించేందుకే లోకేష్‌కి ఆ శాఖ ఇచ్చారు. సీబీఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి..? అక్రమాలు జరిగాయి కాబట్టే.. దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. లోకేష్‌తో చర్చించేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని పంపిస్తాం.. లోకేష్ రాగలడా..?. మేము అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పాలి. అబద్ధానికి చొక్కా, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబే. ఎమ్మెల్యే సోమిరెడ్డి జీవితం గురించి ఒక పుస్తకం రాయొచ్చు’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు.
‘‘టీడీపీ నేతల విమర్శలకు భయపడే రోజులు పోయాయి. ధర్మేంద్ర ప్రధాన్‌కి నైతిక విలువ ఉన్నాయి కాబట్టే రాజీనామా చేశారు. నారా కుటుంబానికి నైతిక విలువలు ఉండవని లోకేశ్ నిరూపించారు. కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చి.. రిలే నిరహార దీక్షలకు సిద్ధమవుతున్నాం’’ అని కాకాణి పేర్కొన్నారు.


