అరుదైన మొక్కను పరిశీలిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని ఉబ్బలమడుగు పర్యాటక ప్రాంతంలో అరుదైన కొత్త వృక్షజాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ అని పేరు పెట్టారు. దీన్ని అటవీశాఖ అధికారులు బుధవారం పవన్ కళ్యాణ్‌కు చూపించారు.
కాంబాకం అటవీ ప్రాంతంలో ఈ మొక్క సహజంగా పెరుగుతుండటంతో ఆ ప్రాంతం పేరునే జాతి పేరుగా ఖరారు చేశారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి పి.వి.చలపతిరావు బృందం నిర్వహించిన పరిశోధనల్లో ఈ కొత్త జాతి వెలుగులోకి వచ్చింది. సుగంధ పరిమళం వెదజల్లే ఆకులు, ప్రత్యేక నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలు ఈ మొక్క ప్రత్యేకతలు.
క్రోటన్ అరోమాటికస్ జాతికి ఇది దగ్గరి బంధువు అయినా పూర్తిగా భిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అత్యంత పరిమిత ప్రాంతంలోనే లభిస్తుండటం, ఆవాసాలకు ముప్పు ఉండటంతో ఈ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల జీవవైవిధ్య సంపదను మరోసారి చాటిందని, దీని పరిరక్షణకు మరింత కృషి అవసరమని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.


