శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశం జరిగిన సమయంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. 2019 జనవరిలో భారీ పోలీస్ రక్షణ నడుమ ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించినప్పుడు, అప్పటి ట్రావెన్‌కోర్ దేవాస్వం బోర్డు ప్రెసిడెంట్ ఎ. పద్మకుమార్‌ను కావాలనే అక్కడకు రాకుండా అడ్డుకున్నారనే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆయన సన్నిహితులు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మొత్తం వ్యవహారం వెనుక అత్యున్నత స్థాయి శక్తుల వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి ఫోన్ కాల్.. సగం దారిలోనే వెనక్కి
2019 జనవరి 1వ తేదీన మకరవిళక్కు తీర్థయాత్ర సమయంలో పద్మకుమార్ స్వామి అయ్యప్పన్ రోడ్డు మార్గంలో సన్నిధానానికి వెళ్తుండగా, అధికార వర్గాల నుంచి ఆయనకు ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. ఆయనను వెంటనే తిరువనంతపురం చేరుకోవాలని, ప్రముఖ రాజకీయ నేతను కలవాలని ఆదేశించారు. దీంతో ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరువనంతపురం చేరుకున్నారు. అయితే సదరు నేత నివాసానికి వెళ్లిన పద్మకుమార్‌కు లోపలికి ప్రవేశం దక్కలేదు. తెల్లవారుజామున 5:30 గంటల మార్నింగ్ వాక్ సమయంలో మాత్రమే కలవడం సాధ్యమవుతుందని పోలీసులు తేల్చి చెప్పారు.
టీవీలో చూసి షాక్.. పెద్ద మోసం
తిరిగి ఇంటికి వెళ్లి, తెల్లవారుజామున 5 గంటలకు నాయకుడిని కలవడానికి సిద్ధమవుతున్న పద్మకుమార్ టీవీ ఆన్ చేసి చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బిందు అమ్మణి, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించి పూజలు చేసినట్లు బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఆ తర్వాత సదరు సీనియర్ నేతను కలిసిన పద్మకుమార్, ‘నాకు ఇంతటి ద్రోహం జరుగుతుందని ఊహించలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. తన కుటుంబం నుంచి యువతులెవరూ శబరిమలకు వెళ్లరని గతంలో పద్మకుమార్ ప్రకటించినందుకే, మహిళల ప్రవేశం వేళ ఆయన సన్నిధానంలో ఉండకుండా ఈ వ్యూహం పన్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదే రోజు భద్రతా బాధ్యతల్లో ఉన్న ఐజీ ఎస్. శ్రీజిత్‌ను కూడా అక్కడి నుంచి పోలీస్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడం గమనార్హం.
రాజీనామా యత్నం.. పార్టీలో ఒంటరి
ఈ అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మకుమార్, దేవస్వం బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా లేఖతో సొంత ఊరిలోని ఒక సన్నిహితుడిని కలిశారు. అయితే ఆ సమయంలో సదరు మిత్రుడు ఆయనను వారించి, రాజీనామా చేయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత కాలంలో అధికార పక్ష నాయకత్వంతో పద్మకుమార్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాల్లో పార్టీ కూడా ఆయనను క్రమంగా పక్కన పెట్టేసింది. ఏళ్ల క్రితం జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు కేరళలో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.


