కువైట్, బహ్రెయిన్‌లలో అమెరికా రాడార్లు ధ్వంసం.. | Iran Releases Satellite Images Showing Destruction of US Systems In Bahrain Kuwait | Sakshi
Sakshi News home page

కువైట్, బహ్రెయిన్‌లలో అమెరికా రాడార్లు ధ్వంసం..

Jun 14 2026 10:06 AM | Updated on Jun 14 2026 10:16 AM

Iran Releases Satellite Images Showing Destruction of US Systems In Bahrain Kuwait

టెహ్రాన్‌: మిడిల్ ఈస్ట్‌లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, రాబోయే 24 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. అయితే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే.. కువైట్, బహ్రెయిన్‌లలోని కీలక అమెరికా క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థలను తాము ధ్వంసం చేశామంటూ ఇరాన్ కొన్ని ఉపగ్రహ చిత్రాలను విడుదల చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అమెరికా వ్యవస్థల ధ్వంసం.. ఇరాన్ ఆధారాలు!
యుద్ధ రంగంలో ఇరాన్ పైచేయి సాధించినట్లు ప్రకటించుకుంది. అమెరికాకు చెందిన క్షిపణి గుర్తింపు రాడార్ వ్యవస్థలపై తాము జరిపిన దాడుల తాలూకు ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ అధికారికంగా విడుదల చేసింది. కువైట్, బహ్రెయిన్‌లలో మోహరించిన రెండు అత్యంత కీలకమైన అమెరికా రాడార్ వ్యవస్థలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు ఇరాన్ పేర్కొంది. ఈ పరిణామాల మధ్యనే జోర్డాన్‌లో ఆకస్మికంగా సైరన్లు మోగడం, లెబనాన్ సరిహద్దులోని హులా ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హెజ్బుల్లా డ్రోన్ దాడికి పాల్పడటం లాంటి ఘటనలతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం క్షణక్షణం మారుతోంది.
 

ట్రంప్ కీలక ప్రకటన.. ఒప్పందానికి రంగం సిద్ధం
మరోవైపు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని, శాంతి ఒప్పందం తుది దశకు చేరుకుందని ప్రకటించారు. ఇరాన్ అణు సంపత్తిని నియంత్రించడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఒప్పందాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు యూరప్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ట్రంప్ తెలిపారు. ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి దేశాల నేతలతో తాము చర్చలు జరిపినట్లు ఆయన స్పష్టం చేశారు.

సంతకం ఎప్పుడు? 
ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ ముసాయిదాపై ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాది.. రష్యా, చైనా రాయబారులతో కీలక చర్చలు జరిపారు. అయితే ఈ ఒప్పందంపై సంతకాల ప్రక్రియ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై కొంత గందరగోళం నెలకొంది. ఇరు దేశాల ప్రతినిధులు నేరుగా హాజరయ్యే కార్యక్రమం రద్దయిందని, వర్చువల్ విధానంలో సంతకాలు జరుగుతాయని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నప్పటికీ, ఆదివారం నాటి ప్రెసిడెంట్ ట్రంప్ అధికారిక షెడ్యూల్‌లో దీనికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేదని అంతర్జాతీయ మీడియా నివేదించింది. కాగా, ఈ ఒప్పందం కుదిరితే అది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యూహాత్మక ఎదురుదెబ్బ అవుతుందని అక్కడి ప్రతిపక్ష నేత యాయీర్ లాపిడ్ విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement