జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన.. ఈ సాంకేతికను అలవర్చుకున్న.. చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్‌నే జెన్‌జడ్ అని.. అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా.. కొత్త ఆలోచనలు.. దానికి మించి.. ఆన్‌లైన్ సాంకేతికత.. అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్.
ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్క్షానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.
జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్.., "ఐ జనరేషన్".., "డిజిటల్ స్థానికులు"... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్‌జడ్‌లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు.
దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్‌లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.. లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే.. దీంతో వారి మనస్సులు.. వారి సామాజిక స్పృహ.. ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు.
జన్‌జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం.. కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా.. ఎక్కువగా ఆలోచిస్తారు.. చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం.. దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Zలో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం.. సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం.. ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్‌లు, స్టార్టప్‌లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు.
జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.. భయం లేకుండా ప్రవర్తించడం.. కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని.. లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికితీయడానికి ప్రయత్నిస్తారు. జెన్‌జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు.. భావోద్వేగాలకు తావు లేకుండా.. బాధను వ్యక్తీకరించడం.. ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.. సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా.. వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
ఆన్‌లైన్‌లో చర్చల ద్వారా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు.. ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన.. చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు.. వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.
వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్‌పోజర్.. అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం.. ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు.. కలిగి ఉంటారు.
కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ.. బలహీనత కాదు.. అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.. గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి.. కానీ జెన్‌జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.. తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్‌జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.


