హర్యానా: ఓ తండ్రి తన జీవితాన్ని అంకితం చేసి ముగ్గురు కుమార్తెలను పెంచి, ఉన్నత విద్య అందించి, వివాహాలు చేశారు. అయితే ఆయన మరణించినప్పుడు కడసారి చూసేందుకు కుమార్తెలు రాకపోవడం, అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా వీక్షించడం హర్యానాలోని సోనిపట్‌లో చర్చనీయాంశమైంది.
వృద్ధాశ్రమ నిర్వాహకుల కథనం ప్రకారం, కుమార్తెలు రూ.5,100 పంపించి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘోరం చూసిన నెటిజన్లు.. ‘కంటే కూతుళ్లను కనమని అంటారా’ అంటూ సదరు కుమార్తెలపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దహన సంస్కారాలు జరుగుతుండగా, వీడియో కాల్‌లో ముగ్గురు కుమార్తెలు వీక్షిస్తున్న దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి.
వీడియో కాల్‌లోనే చివరి వీడ్కోలు
దహన సంస్కారాలు జరుగుతుండగా ముగ్గురు కుమార్తెలు వీడియో కాల్ ద్వారా వీక్షిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైకి చెందిన వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ రతన్ గుప్తాకు భార్య మీనా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వివాహాల అనంతరం వారు నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైల్లో స్థిరపడ్డారు. వారిలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
రెండేళ్ల క్రితం రతన్ గుప్తా దంపతులు హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో చేరారు. కొంతకాలం క్రితం ఆయన భార్య మీనా మృతి చెందారు. అనంతరం దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ గుప్తా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణించిన విషయం వృద్ధాశ్రమ నిర్వాహకులు ముగ్గురు కుమార్తెలకు తెలియజేశారు.
అంత్యక్రియలకు రాలేమన్న కుమార్తెలు
సోనిపట్‌కు రావడం సాధ్యం కాదని కుమార్తెలు ఆశ్రమ నిర్వాహకులకు చెప్పారు. దీంతో వృద్ధాశ్రమ సిబ్బంది, స్థానికులు కలిసి రతన్ గుప్తా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కుమార్తెలు వీడియో కాల్ ద్వారా వీక్షించారు. ఆశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్ ప్రకారం, రతన్ గుప్తా అక్కడ చేరినప్పటి నుంచి ప్రతిరోజూ తన కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడేవారు. అయితే ఆరోగ్యం క్షీణించిన తర్వాత వారి నుంచి ఫోన్ కాల్స్ తగ్గిపోయాయని చెప్పారు. మరణానికి సుమారు 20 రోజుల ముందే ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుమార్తెలకు సమాచారం ఇచ్చినా, వారు వచ్చి చూడలేదని ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.
రూ.5,100 పంపిన పెద్ద కుమార్తె
రతన్ గుప్తా మృతి తర్వాత మరోసారి సమాచారం అందించి, ఆశ్రమానికి వస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సిబ్బంది సూచించారు. అయితే తాము రావడం కుదరదని కుమార్తెలు చెప్పినట్లు ఆనంద్ కుమార్ వివరించారు. నేపాల్‌లో నివసిస్తున్న పెద్ద కుమార్తె అనిత యూపీఐ ద్వారా రూ.5,100 పంపించి, తండ్రి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమం పూర్తయ్యాక వీడియోలను పంపించాలని కూడా అభ్యర్థించారు. వైరల్ అవుతున్న వీడియోల్లో ఒక కుమార్తె “ఇంకెంత సమయం పడుతుంది? మేము స్నానం చేసి భోజనం చేయాలి” అని మాట్లాడినట్లు వినిపిస్తుండటంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కుమార్తెల భవిష్యత్తు కోసం శ్రమించిన తండ్రి
రతన్ గుప్తా తన ముగ్గురు కుమార్తెల చదువు, భవిష్యత్తు కోసం జీవితమంతా శ్రమించారని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. వారికి ఉన్నత విద్య అందించి, మంచి స్థాయికి చేరుకోవడం పట్ల ఎంతో గర్వపడేవారని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, ముగ్గురూ వివాహం చేసుకుని తమ తమ కుటుంబాలతో జీవిస్తున్నారు. మరణానంతరం తొలుత అస్థికలను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే అనంతరం సోనిపట్‌కు వచ్చే అవకాశం లేదని చెబుతూ, వాటిని గంగానదిలో నిమజ్జనం చేయాలని ఆశ్రమ నిర్వాహకులను కోరినట్లు సమాచారం.
మరణానంతరం కూడా ఇద్దరికి చూపు
రతన్ గుప్తా మరణానికి ముందు తన కళ్లను దానం చేయాలని ఆకాంక్షించినట్లు ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు. ఆయన కోరిక మేరకు కంటి దానం చేయడంతో మరణానంతరం కూడా ఇద్దరికి చూపు అందే అవకాశం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై రతన్ గుప్తా కుమార్తెల స్పందన ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు ఆశ్రమ నిర్వాహకుల కథనం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగానే ఉన్నాయి.


