ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
కన్నతండ్రి చివరి ప్రయాణానికి కూడా ఆస్తి లెక్కలు అడ్డుగా నిలిచాయి. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన ఓ తండ్రి మృతదేహం.. వారసుల మధ్య వివాదానికి సాక్షిగా మారింది. ఆస్తి పంపకాలపై పేచీ తేలేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ కొడుకులు పట్టుబట్టడంతో.. సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజంలో బంధాల విలువపై తీవ్ర చర్చకు దారితీసింది.
సాక్షి, సూర్యాపేట: అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడిగ భద్రయ్య మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదం అడ్డుగా మారింది. ఆస్తి పంపకాల విషయంలో స్పష్టత వచ్చే వరకు తండ్రి అంత్యక్రియలు జరగనివ్వబోమని కన్నబిడ్డలు పట్టుబట్టారు.
చివరి వీడ్కోలుకూ వారసత్వ వివాదం అడ్డం
సాధారణంగా తల్లిదండ్రుల చివరి చూపు కోసం కుటుంబం మొత్తం ఒక్కటవుతుంది. కన్నీళ్లతో వీడ్కోలు పలకాల్సిన సమయంలో.. ఇక్కడ మాత్రం ఆస్తి తగాదా తెరపైకి వచ్చింది. తండ్రి మృతదేహం ముందు కూడా వివాదం పరిష్కారం కాకపోవడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.
పురుగుల మందు డబ్బాలతో..
వివాదం తీవ్రరూపం దాల్చడంతో కొందరు వారసులు పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడతామని బెదిరించారు. దీంతో ఆ విషాద వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. పంచాయితీ పెద్దలు, బంధువులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
బంధాల కంటే ఆస్తే ముఖ్యమా?
జీవితమంతా పిల్లల భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులకు చివరి దశలో కూడా ప్రశాంతత దక్కకపోవడం విషాదకరం. ఆస్తులు, ఆస్తి పంపకాల కోసం బంధాలు బలహీనపడుతున్నాయా? అనే ప్రశ్నను ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది. తండ్రి అంతిమ సంస్కారాలు సైతం వివాదానికి వేదికగా మారడం స్థానికుల్లో ఆవేదన కలిగించింది.


