పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం | Political Leaders Pay Tributes to BRS Leader Peddi Sudharshan Reddy | Sakshi
Sakshi News home page

పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

Jul 31 2026 6:55 AM | Updated on Jul 31 2026 8:33 AM

Political Leaders Pay Tributes to BRS Leader Peddi Sudharshan Reddy

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆప్త మిత్రుడు, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు.

పార్టీ పట్ల ఆయన అంకితభావం, ప్రజల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్న కేసీఆర్, ఆయన మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటని అన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్లు జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ గారు కొనియాడారు.

హరీష్‌ సంతాపం..
అలాగే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృత్యువును జయించి తిరిగి వస్తారని ఆశించామని, కానీ ఆయన లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. వ్యక్తిగతంగా ఆత్మీయ సోదరుడిని కోల్పోయానని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ "పెద్దన్నకు జోహార్లు" అని నివాళులర్పించారు.

సీఎం సంతాపం.. 
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.
సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

కేటీఆర్‌ సంతాపం.. 
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారని ఆశించామని, కానీ ఆయన ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్న కేటీఆర్.. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement