వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు | Telangana govt clears Rs 6,000 crore employee arrears in 100 days | Sakshi
Sakshi News home page

వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు

Jul 31 2026 5:48 AM | Updated on Jul 31 2026 5:48 AM

Telangana govt clears Rs 6,000 crore employee arrears in 100 days

ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు విడుదల చేశాం 

ప్రభుత్వం  ప్రకటన.. ఉద్యోగ సంఘాల హర్షం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలు విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు గురువారం రూ.2 వేల కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన మొత్తంతో కలిపి మూడు విడతల్లో రూ.6 వేల కోట్ల బకాయిల చెల్లింపు పూర్తయింది. ఈ ఏడాది మే 29న తొలి విడతగా రూ.2,000 కోట్లు, జూన్‌ 30న రెండో విడతగా మరో రూ.2 వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మూడో విడతలో రూ.2 వేల కోట్లు విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ అమలైనట్టు తెలిపింది.

ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్‌ బకాయిలను పూర్తిగా చెల్లించినట్టు ఆర్థికశాఖ పేర్కొంది. మిగిలిన ఇతర బకాయిలను కూడా దశల వారీగా క్లియర్‌ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బకాయిల చెల్లింపులను కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం     తెలిపింది.

 మరోవైపు, బకాయిల విడుదలను ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు స్వాగతించారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, టీజీఓ ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ ప్రభుత్వ నిర్ణయం పట్ల గురువారం వేర్వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులో హామీని అమలు చేయడం సానుకూల పరిణామమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇతర బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement