కాంగ్రెస్‌ ‘గో’ రాజకీయం! | Congress party plan for Hindutva votes in Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ‘గో’ రాజకీయం!

Jul 31 2026 3:00 AM | Updated on Jul 31 2026 3:00 AM

Congress party plan for Hindutva votes in Telangana

రాష్ట్రంలో హిందుత్వ ఓట్లకు గాలం వేసే యోచనలో అధికార పార్టీ

రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో త్వరలోనే గోరక్షణ కమిషన్‌ ఏర్పాటు 

గోవుల పరిరక్షణ, విరాళాల సేకరణ, గోశాలల పర్యవేక్షణ, ఫిర్యాదులపై కమిషన్‌దే తుది నిర్ణయం? 

ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్‌ 

బతుకమ్మ మాదిరిగా ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా గోపూజ.. ఏటా గోమాత దినోత్సవం!... రాష్ట్రంలోని 258 గోశాలలూ స్వయం మనుగడ సాగించేలా ప్రణాళిక 

సంఘ్‌తో సంబంధం లేని హిందుత్వ ఓట్లను ఆకర్షించడమే ప్రధాన ఎజెండా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ గోవుల చుట్టూ రాజకీయం దిశగా పావులు కదుపుతోంది. హిందుత్వ ఓట్లు గంపగుత్తగా బీజేపీ ఖాతాలో పడకుండా సంఘ్‌తో సంబంధం లేని ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలను అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచే మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే గోవులను కేంద్రంగా చేసుకొని కీలక నిర్ణయం ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో గోరక్షణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని.. త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.

కమిషన్‌ ఏర్పాటుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో గోమాత పూజ చేయాలని, ఈ కార్యక్రమానికి బతుకమ్మ తరహా ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే గోమాత దినోత్సవం నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలియవచి్చంది. తద్వారా గోజాతి సంరక్షణతోపాటు హిందుత్వ ప్రభావం ఉన్న ఓటర్లను ఆకర్షించే వ్యూహాన్ని అమలు చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది.  

బోర్డు కావాలని అడిగితే.. 
వాస్తవానికి గత నెలలో రాష్ట్రంలోని గోశాలల నిర్వాహకులతో పశుసంవర్థక శాఖ సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని 200కుపైగా గోశాలల నిర్వాహకులు తమ సాదకబాధలను ప్రభుత్వం ముందు పెట్టారు. గోసరంక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పశుసంవర్థక శాఖ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఏకంగా కమిషన్‌ ఏర్పాటు చేద్దామని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే బాలల సంక్షేమ కమిషన్‌ తరహాలోనే గోరక్షణ కమిషన్‌కు అధికారాలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. గోవుల సంరక్షణతోపాటు అన్ని గోశాలలపై పర్యవేక్షణ, గోశాలలకు విరాళాల విషయంలో పారదర్శకత, గోవధ, ఇతర అంశాల్లో ఫిర్యాదులపై కమిషన్‌ తుది నిర్ణయం తీసుకొనేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ కమిషన్‌లో పశుగణాభివృద్ధి, విజయా డెయిరీ, వెటర్నరీ యూనివర్సిటీ, గోశాలల నిర్వాహకులు, పశుసంవర్ధక శాఖ అధికారులను సభ్యులుగా నియమించనున్నట్లు సమాచారం. 

గోశాలలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. 
ఇప్పటికే రాష్ట్రంలోని మొయినాబాద్, యాదాద్రి, వేములవాడల్లో భారీ గోశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మొయినాబాద్‌ గోశాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక రాష్ట్రంలోని 258 గోశాలలకు రిజి్రస్టేషన్‌ తప్పనిసరి చేయడమే కాకుండా ఆయా గోశాలలు సొంతంగా మనుగడ సాగించేలా ఆర్థిక పరపతి కల్పించే దిశలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇక బతుకమ్మ పూజ తరహాలోనే గోమాత పూజను కూడా ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున గిన్నిస్‌ రికార్డు సాధించేందుకు పశుగణాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సంస్థ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,500 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో ఏకకాలంలో గోవులను సమీకరించి వాటికి పూజ చేయబోతున్నామని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సింగం చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఏటా సెపె్టంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట బీజేపీ చేసే హడావుడికి కూడా గోవుతోనే చెక్‌ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజును గోమాత దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఫలితమిస్తున్న విరుగుడు 
బీజేపీని కౌంటర్‌ చేసేందుకు కొన్ని రాజకీయ వ్యూహాలు ఫలితాన్ని ఇస్తున్నాయని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ నేత కేజ్రీవాల్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో హనుమాన్‌ చాలీసా పఠించారు. ఆ తర్వాత కన్నాట్‌ప్లేస్‌లోని ఓ హనుమాన్‌ దేవాలయాన్ని దర్శించుకున్నారు. బీజేపీకి పడాల్సిన హిందుత్వ ఓట్లకు గండి కొట్టేందుకు ఈ పరిణామం ఓ కారణమనే విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.

అలాగే 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే కొన్ని వారాల ముందు తన ఫాంహౌస్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయుత చండీ మహాయాగం నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఈ యాగాన్ని నిర్వహించడం ద్వారా ఆయన తనలోని హిందుత్వవాదాన్ని బహిరంగంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాము హిందూ వ్యతిరేకులం కాదని బహిరంగ పర్చడం ద్వారా బీజేపీకి అనుబంధంగా లేని హిందుత్వ ఓట్లను ఆకర్షించవచ్చని కాంగ్రెస్‌ కూడా అంచనా వేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement