సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందజేస్తున్న చిన్నారెడ్డి. చిత్రంలో నిపుణుల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు
సెంట్రలైజ్డ్ కిచెన్ల చుట్టూ ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం
రైతులకు 75% సబ్సిడీతో విత్తనాలు
రైతులు పండించిన పంటలను
ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
ఎల్ నినోపై రూపొందించిన నివేదికను సీఎంకు అందజేసిన నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖతోపాటు ఇతర అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను భారీ సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయల ఆర్గానిక్ పద్దతిలో సాగును ప్రోత్సహించాలని, అక్క డ పండే తాజా కూరగాయలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి కిచెన్లకు సరఫరా చేసే వ్యవస్థను అభివృద్ధి చేయా లని సూచించారు. దీంతో రైతులకు గిట్టు బాటు ధర లభించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన, తాజా ఆహారం అందుబాటులోకి వస్తుందన్నారు.
గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రికి ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం, వ్యవసాయంపై దాని ప్రభావం, తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై డాక్టర్ చిన్నారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను సమరి్పంచింది. ఈ సందర్భంగా కమిటీ చేసిన సిఫార్సులపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల ఆదాయానికి భరోసా కలి్పంచడంతోపాటు ఆహార భద్రతను కాపాడే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక
ప్రతి గ్రామానికి ప్రత్యేక అత్యవసర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కమిటీ సూచించింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల్లో వరి, సాగు తగ్గిందని, అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహించాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఆయా ప్రాంతాల భూస్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని పేర్కొంది.
ఈ పంటలకు అవసరమైన విత్తనాలను 75% సబ్సిడీపై అందించడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రత్యేకంగా ప్రోత్సహించాల ని పేర్కొంది. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృత కూరగాయల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయాలని తెలిపింది.
పశుగ్రాసం, డెయిరీపై దృష్టి
వ్యవసాయంతోపాటు పశుసంవర్ధక రంగాన్ని కూడా బలోపేతం చేయాలని కమిటీ సూచించింది. పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై అందించి పశుగ్రాస సాగును పెంచాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని సిఫార్సు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందించాలని, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల నిర్వహణపై ప్రత్యేక సలహాలు ఇవ్వాలని సూచించింది. ఆయా బృందాలు పంటల పరిస్థితి, నీటి లభ్యత, రైతుల సమస్యలను నిరంతరం పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రూ.803 కోట్లతో కార్యాచరణ
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, సాగునీరు తదితర రంగాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమని కమిటీ అంచనా వేసింది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల నష్టాన్ని తగ్గించడం, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలకు నివేదికలో ప్రాధాన్యం ఇచి్చనట్లు తెలిపారు.
జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలమట్టం తగ్గడంతో నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజలు, కూరగాయలు, పశుగ్రాస పంటలను గ్రామాల వారీ కార్యాచరణతో ప్రోత్సహించాలన్నారు.


