సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో డిప్రెషన్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని అంచనా వేస్తోంది. గురువారం రాత్రి వరకు ప్రభావం గరిష్ట స్థాయిలో ఉంటుందని, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతోంది.
అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రానున్న 12 నుంచి 18 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే పరిస్థితులు ఉండొచ్చని సూచించారు.
ఇక సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నిరంతరాయంగా కొనసాగుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

హైదరాబాద్‌లో కుండపోత?..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒక్కసారిగా భారీ వర్షం పడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షం సమయంలో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే ప్రయాణాలను కొంత సమయం వాయిదా వేసుకోవాలని సూచించారు.

ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజరీ
వర్షాల కారణంగా రోడ్లపై రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఐటీ కారిడార్ పరిధిలోని సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ముందస్తు సూచనలు జారీ చేస్తున్నారు. ఉద్యోగుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వంటి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉన్నవాళ్లకు ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని కంపెనీలకు తెలిపింది.
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం ప్రభావంతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

ప్రజలకు అధికారుల సూచనలు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెరువులు, వాగులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కోరుతున్నారు. మ్యాన్‌హోల్స్, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు, నీరు నిలిచిన రోడ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


