అభిప్రాయం
భారత వ్యవసాయం వందల ఏళ్లుగా కరవులను, వరదలను, ధరల పతనా లను, విధాన మార్పులను తట్టుకుని నిల బడింది. అభిరుచులు, మార్కెట్లు, సాంకే తికతలు మారుతున్న కొద్దీ పంటలు వచ్చాయి, పోయాయి. కొన్ని పంటలు రైతులకు తాత్కాలిక ఊరటనిస్తే, కొన్ని వారిని అప్పుల్లో పడేశాయి. చరిత్ర చెప్పే నిజం ఏమిటంటే– సరైన విధానం, ముందుచూపు తోడైతే ఒక్క పంట కూడా ఊరు, దేశం ఆర్థిక పరిస్థితినే మార్చగలదు. ప్రపంచంలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, ఆ మార్పు తెచ్చే పంట ఆయిల్ పామ్. తెలంగాణకు ఆయిల్ పామ్ కేవలం ఒక కొత్త పంట కాదు– ఇది దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం. ఒక గేమ్ ఛేంజర్ కాగల పంట.
ప్రధాన ఆర్థిక వనరు
తెలంగాణ ఏర్పడిన మొదటి పదేళ్లలో మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా సాగునీటిని వసతులని పునరుద్ధరించడం సబబే. కానీ కేవలం వరి, పత్తి పంటల పైనే ఆధారపడిన వ్యవసాయం వాంఛనీయం కాదు. రాష్ట్రం రెండో పదేళ్లలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, మన వ్యవసాయ భవిష్యత్తుకు ఒక కొత్త ఆధారం కని పిస్తోంది. ఆయిల్ పామ్‌ను ఒక చిన్న పంటగా చూడటం మానేసి, నర్సరీ నుంచి రిఫైనరీ దాకా పూర్తి వ్యవస్థను నిర్మించే కొత్త గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీన్ని పునాదిగా చూడాల్సిన సమయం వచ్చింది.
ఆయిల్ పామ్ ఎందుకింత ముఖ్యమో అర్థం కావాలంటే మనం మన దేశ సరిహద్దులు దాటి చూడాలి. జనాభాలో మన కంటే చాలా తక్కువగా ఉన్న ఇండోనేషియా, మలేషియా దేశాలు ఈ ఒక్క పంటతో తమ గ్రామాల రూపురేఖలనే మార్చేశాయి. సుమారు 28.3 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియా, దాదాపు 4.2 కోట్ల ఎక రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 4.6 కోట్ల టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశ జీడీపీలో ఆయిల్ పామ్ వాటా సుమారు 4.5 శాతం, ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షలకు పైగా కుటుంబాలకు ఇది జీవనోపాధి.
మలేషియా కథ కూడా ఇలాంటిదే. కేవలం 3.56 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం దాదాపు 1.4 కోట్ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. 1970లు, 1980లలో రబ్బరు ధరలు పెరగకుండా, గ్రామాల్లో ఆదాయం తగ్గి నప్పుడు, మలేషియా వ్యూహాత్మకంగా ఆయిల్ పామ్ వైపు మళ్లింది.
భద్రత–స్థిరత్వం
147 కోట్ల జనాభా ఉన్న మన భారత ప్రజానీక ఆశలు, తినే అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మన దేశంలో పండించే వంట నూనె మన అవసరంలో సగం మాత్రమే తీరుస్తోంది. ప్రతి ఏటా సుమారు 130 లక్షల టన్నుల వంట నూనెలను బయటి నుంచి తెచ్చుకుంటున్నాం. కేవలం పామ్ ఆయిల్ కోసమే ఏటా సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. సూటిగా చెప్పాలంటే, మనం మన విలువైన విదేశీ మారకాన్ని బయటికి పంపి, దానికి బదులు అనిశ్చితిని తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరఫరాలో ఏ చిన్న ఆటంకమైనా, ఏ దేశాల మధ్య ఉద్రిక్తతైనా, అంతర్జాతీయ ధరలు పెరిగినా, దాని ప్రభావం నేరుగా మన వంట గదులపైనా, మన రైతులపైనా పడుతుంది.
ఇలా బయటి నుంచి తెచ్చుకోవాల్సి రావడానికి కారణం మన రైతులకు సామర్థ్యం లేకపోవడం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును బాగా పెంచగల వాతావరణం, నేలలు ఉన్నాయి. అయినా, దేశం మొత్తం మీద కేవలం 10 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ మొత్తంతో మొద లైనా తెలంగాణ ఇప్పటికే రెండో స్థానానికి చేరుకుంది. భద్రత, స్థిరత్వం ఇచ్చే ఈ పంటను చేపట్టడానికి తెలంగాణ రైతుల్లో ఉన్న ఆసక్తిని, సంసిద్ధతను ఇది చూపిస్తుంది.
ఈ రోజు తెలంగాణలో సుమారు 2.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది, అందులో అవిభక్త ఖమ్మం జిల్లా ఒక్కటే దాదాపు 1.35 లక్షల ఎకరాలు కలిగి ఉంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాబోయే సంవత్సరాల్లో ఈ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్రం ఒక పెద్ద, కానీ సాధించగల లక్ష్యాన్ని పెట్టుకుంది.
ఆయిల్ పామ్ తోట దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది. ఒకే పంటకోతపై, ఒకే మార్కెట్ ధరపై ఆధారపడే కాలానుగుణ పంటల్లా కాకుండా, ఏడాది పొడవునా తాజా పండ్ల గెలలు ఇస్తుంది. అంటే ఏడాదికోసారి వచ్చే పెద్ద మొత్తం కాదు, ప్రతి నెలా చేతికి డబ్బు అందుతుంది. తోటలు పూర్తి దిగుబడికి వచ్చాక, దిగుబడి, నిర్వహణను బట్టి, ఇప్పటి ధరల ప్రకారమే రైతులు ఎకరాకు ఏటా రూ.2 లక్షల వరకు సంపాదించ గలుగుతున్నారు. తాజా పండ్ల గెలల ధర టన్నుకు రూ. 22,000 నుంచి రూ.24,500 వరకు ఉంటూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ ఎంఈఓ–ఓపీ) లాంటి పథ కాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి తోడ్పాటునందిస్తుండటంతో, చాలా గ్రామీణ కుటుంబాలకు ఆయిల్ పామ్ నెలనెలా జీతం లాంటిదిగా మారింది. దీనికి తోడు, మొక్కలు, ఇన్ పుట్‌లు, మొదట్లో అయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.50,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. దీనితో పూర్తి దిగుబడి రాకముందు మొదటి మూడు, నాలుగేళ్లలో రైతులపై పడే భారం తగ్గుతుంది.
విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా...
ఆయిల్ పామ్‌లో ఏదీ వృథా పోదు. పండు నుంచి ముడి పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. పీచు, పెంకులను కరెంటు తయారీకి వాడొచ్చు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా, పశుగ్రాసంగా మార్చొచ్చు. కోకో, జాజికాయ, మిరియాలు, పూలు లాంటి నీడలో పెరిగే పంటలను కలిపి వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు ఒకే పంట తోటలుగా కాక, రకరకాల ఆదాయాలు ఇచ్చే తోటలుగా మారతాయి.
పొలం గట్టు దాటి కూడా, ఆయిల్ పామ్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు పుడతాయి. నర్సరీలు, ఇన్ పుట్‌లు అమ్మేవారు, కోత సేవలు, రవాణా చేసేవారు, ఫ్రూట్ కలెక్షన్ కేంద్రాలు, క్రషింగ్ యూనిట్లు, రిఫైనరీలు, ప్యాకింగ్ యూనిట్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, వీళ్లందరూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉపాధిని పెంచుతారు.
అశ్వారావుపేట, దమ్మపేట లాంటి ప్రాంతాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే వ్యాపార కేంద్రాలుగా మారడం చూశాం. సిద్దిపేటలో కొత్త ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్ సంస్థ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ‘విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా‘ ఒకే గొలుసుగా చేయడమే తెలంగాణ వ్యూహం.
ఆయిల్ పామ్ పర్యావరణానికి హానికరం అని కొందరు అంటున్నారు. ఈ అభిప్రాయం ఎక్కువగా వేరే దేశాల్లో సున్నితమైన అడవులు, తడి నేలల్లో పెద్ద ఎత్తున అడవులను కొట్టేసిన అనుభవాల నుంచి వచ్చింది. తెలంగాణ పరిస్థితి పూర్తి భిన్నం. మనం అడవు లను కొట్టేయడం గురించి మాట్లాడటం లేదు; తక్కువ దిగుబడి ఉన్న, వర్షాధార లేదా ఒకే పంట పండే భూములను సరైన నీటి వాడకంతో మంచి విలువ ఇచ్చే చెట్ల తోటలుగా మార్చడం గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు పచ్చదనాన్ని పెంచుతాయి, గాలిలో కార్బన్‌ను ఎక్కువగా పీల్చుకుంటాయి, కొండ ప్రాంతాల్లో నేల కొట్టుకుపోకుండా చూస్తాయి, తేమను నిలుపుతాయి. సహజ అడవులను కొట్టేయ
కుండా కఠినంగా ఉంటూ, అంతర పంటలు, జీవవైవిధ్యానికి మేలు చేసే పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటే, ఆయిల్ పామ్ తెలంగాణలో పర్యావరణానికి శత్రువు కాదు, స్నేహితుడు కాగలదు.
- తుమ్మల నాగేశ్వర రావు, వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి


