మేడ్చల్ జిల్లా: పెళ్లి పేరిట ఓ యువతిని నమ్మించి మోసగించి, మరొకరితో నిశ్చితార్థం చేసుకున్న యువకుడిపై కేసు నమోదైంది. మేడిపల్లి పోలీసుల వివరాలు... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలు(34) బోడుప్పల్ మల్లికార్జున నగర్‌లో నివాసముంటూ ప్రైవేట్ జాబ్ చేస్తోంది. 8 నెలల క్రితం మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ నమోదు చేసుకోగా, ప్రవీణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
తనకంటే వయసులో చిన్నవాడైనా పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో ఆమె రెండుసార్లు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఇటీవల బాధితురాలు పెళ్లి గురించి నిలదీయగా ప్రవీణ్ స్పందించడం మానేశాడు. అతడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తులో ఉంది.


