ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2.2 కోట్లు స్వాహా
నిందితుడిని అరెస్టు చేసిన నగర సీసీఎస్ అధికారులు
ఇతడిపై ఆరు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పంథాలో మరికొందరిని మోసం చేసినట్లు, గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తేలడంతో వ్యవస్థీకృత నేరగాడిగా పరిగణిస్తున్నట్లు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బు«ధవారం ప్రకటించారు.
సనత్‌నగర్‌కు చెందిన రాకేష్ బలరాం గౌడ్‌కు లక్ష్మీకాంత్ రెడ్డితో పరిచయం ఉంది. తనకు విదేశీ బంగారం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి తక్కువ ధరకు పసిడి ఖరీదు చేస్తుంటానని చెప్పాడు. 2024 జూన్ 14న రాకేష్ ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంత్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా ముంబైకి ఓడలో బంగారం దిగుమతి చేస్తున్నానని చెప్పాడు. మొబైల్‌లో బంగారు బిస్కెట్ల వీడియోలు చూపించి, అతి తక్కువ ధరకు 24 క్యారెట్ల బంగారం మూడు కిలోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.
20 రోజుల్లో బంగారం అందజేస్తానని నమ్మించి మొత్తం రూ.2 కోట్లను తీసుకున్నాడు. ఇందులో రూ.1.86 కోట్లు అప్పుగా తెచ్చిన రాకేష్ ఇతడికి చెల్లించాడు. నెల రోజుల తర్వాత సంప్రదించిన లక్ష్మీకాంత్ శ్రీలంకలో 10 కిలోల బంగారంతో పోలీసులకు చిక్కానని చెప్పి పసిడి ఇవ్వలేనన్నాడు. అనంతరం మరో 500 గ్రాముల బంగారం రూ.25 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి, 2024 డిసెంబర్ 15న రూ.5 లక్షలు, డిసెంబర్ 17న రూ.16 లక్షలు తీసుకున్నాడు. అనుమానం రావడంతో నగదు ఇస్తున్న సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు.
ఆ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ మల్లికార్జున చౌదరి ఎస్సై గోపికిరణ్ రెడ్డి దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని అతడి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా అయ్యవారిపల్లిలో గుర్తించారు. అక్కడే అతడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో మహంకాళి, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, మాదాపూర్‌లతో పాటు కోయిల్‌కొండ, ఏపీలోని పెందుర్తి ఠాణాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు.


