సాక్షి,హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు రావుకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం శస్త్రచికిత్స జరిగింది. ఈ నెల 6వ తేదీన జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కిందపడటంతో హిమాన్షు ముక్కుకు గాయమైంది. అప్పట్లో వైద్యులు వైద్య సేవలు అందించి పంపినప్పటికీ, భవిష్యత్తులో శ్వాసపరంగా లేదా ఇతరత్రా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సర్జరీ అవసరమని నిపుణులు సూచించారు.
వైద్యుల సలహా మేరకు హిమాన్షు తాజాగా ఆసుపత్రిలో చేరగా, వైద్య బృందం నేడు ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. సర్జరీ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న తన మనవడు హిమాన్షును పరామర్శించారు. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని, సర్జరీ తర్వాతి రికవరీని అక్కడి సీనియర్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఆసుపత్రిలోనే ఉండి వైద్యులతో మాట్లాడారు. వైద్యుల పర్యవేక్షణలో హిమాన్షు మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని, తాను వేగంగా కోలుకుంటున్నానని సోషల్ మీడియాలో తెలిపారు.


