తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టకాలంలో తమకు అండగా నిలిచి, దేవుడిలా ఆదుకున్నది బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రమేనని నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులు తమను కేవలం వాడుకున్నారే తప్ప ఎలాంటి సాయం యలేదని మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్
గోపాల్ కుటుంబ సభ్యులు మాట్లాడూతూ... ‘మమ్మల్ని అందరూ రాజకీయంగా వాడుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మా వద్దకు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోయారే తప్ప సహాయం చేయలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మా పక్క ఊరికి (రెండు కిలోమీటర్ల దూరంలోకి) వచ్చినా కనీసం పరామర్శించలేదు. మీకు రూ. 20 కోట్లు ఇప్పిస్తా’ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ, రూపాయి సాయం చేయలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారి పీఏలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. బండి సంజయ్ విజయసంకల్ప యాత్ర చేసిన సమయంలో కూడా మమ్మల్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదని తెలిపారు.
కుటుంబ సభ్యుడిలా అండగానిలిచిన కేటీఆర్
ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కేటీఆర్ అన్న స్వయంగా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూశారు. ‘నేను మీ ఇంట్లో పెద్ద అన్నలాంటివాడిని, ఆస్పత్రి ఖర్చులు, ఆర్థికసాయం ఏది కావాలన్నా నేను చూసుకుంటా’ అని ధైర్యం చెప్పారని తెలిపారు. ‘చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పరామర్శించిన ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమే అని, కల్వకుంట్ల కవిత అక్క కూడా మాతో మాట్లాడి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ కుటుంబానికి కష్ట సమయంలో నిజమైన అండగా నిలిచింది కేటీఆర్ మాత్రమేనని, అందుకే తాము ఎప్పటికీ ఆయననే నమ్ముతామని స్పష్టం చేశారు. మాట్లాడిన వారిలో గోపాల్ భార్య గంధం లావణ్య, తల్లి బాలవ్వ, కూతుళ్లు అక్షిత, నిఖిత, కొడుకు అభినయ్, తమ్ముడు గొర్రె మహేశ్ ఉన్నారు.


