వరంగల్‌కు ప్రధాని మోదీ | pm modi visit to Warangal: telangana | Sakshi
Sakshi News home page

వరంగల్‌కు ప్రధాని మోదీ

Jul 29 2026 5:48 AM | Updated on Jul 29 2026 6:04 AM

pm modi visit to Warangal: telangana

విమానాశ్రయానికి భూమి పూజ... రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ జాతికి అంకితం 

నెల రోజుల్లో కార్యక్రమాలుండే అవకాశం   

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ విమానాశ్రయ నిర్మాణానికి భూమి పూజ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం.. ఈ రెండు కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ స్వయంగా వరంగల్‌కు వచ్చి ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సమాచారం. మరో నెల రోజుల్లో ఈ రెండు కీలక ప్రాజెక్టుల భూమి పూజ, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే సేవలందిస్తుండగా, దానికి అదనంగా కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. వరంగల్‌ ఎయిర్‌పోర్టులో అన్ని ప్రాథమిక పనులు పూర్తయిన నేపథ్యంలో ఇక నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది.

 విమానాశ్రయ స్థలానికి చేరువలోనే మడికొండ వద్ద కాజీపేట రైల్‌ కోచ్‌ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిన విషయం తెలిసిందే. దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఇది కూడా తెలంగాణకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. కాజీపేటకు 1980లలో మంజూరై ఆ తర్వాత పంజాబ్‌కు తరలిన కోచ్‌ఫ్యాక్టరీని తిరిగి సాధించుకోవాలని నాటి నుంచి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చివరకు కేంద్రం కోచ్‌ఫ్యాక్టరీని మంజూరు చేసి నిర్మాణాన్ని పూర్తి చేసింది. దాన్ని కూడా ప్రధాని ప్రారంభించేందుకు సమ్మతించారు. ఈ రెండు పక్కపక్కనే ఉన్నందున, రెంటి కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించాలని ప్రధాని కార్యాలయం సూచించినట్టు తెలిసింది. నెల రోజుల్లో దాన్ని సాకారం చేసేలా ఏర్పాట్లు ప్రారంభించారు.  

మరోసారి నగరానికి రైల్వే బోర్డు చైర్మన్‌  
ఇటీవలే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కొత్త భవనం, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలను సందర్శించి వెళ్లిన రైల్వే బోర్డు చైర్మన్‌ సతీశ్‌కుమార్‌ మరోసారి నగరానికి వస్తున్నట్టు తెలిసింది. ప్రధాని మోదీ పర్యటన ఉండనున్నందున, దానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్ల కోసమే ఆయన వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement