సమీకరణకు సై! | Government plans land consolidation instead of land acquisition | Sakshi
Sakshi News home page

సమీకరణకు సై!

Jul 29 2026 4:50 AM | Updated on Jul 29 2026 4:50 AM

Government plans land consolidation instead of land acquisition

భూ సేకరణకు బదులు భూ సమీకరణకు సర్కారు యోచన 

భూ సేకరణ తలకు మించిన భారంగా పరిణమిస్తోందనే అభిప్రాయం 

ప్రజల ఆందోళనలు, కోర్టు వివాదాలతో ముందుకు కదలని ప్రాజెక్టులు 

భూసేకరణ పరిహారంపైనా నిర్వాసితుల్లో అసంతృప్తి! 

భూమి తీసుకుని అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి 

ల్యాండ్‌ పూలింగ్‌ విధానం, ఇతర రాష్ట్రాల్లో అమలు తీరుపై అధ్యయనానికి ఆదేశం 

శాసనసభలో చట్టం చేసే అవకాశం కూడా పరిశీలిస్తున్న సర్కారు

సాక్షి, హైదరాబాద్‌: భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా తయారైందా? అంటే అవుననే సమాధానమే లభిస్తోంది. భూ సేకరణకు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేయడం కంటే.. భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) ద్వారా ప్రజల నుంచి భూములు తీసుకోవడం ఉత్తమం అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. భూ సేకరణ అనేక ఉద్రిక్తతలు, న్యాయ వివాదాలకు దారి తీస్తుండటంతో నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టులు పూర్తికావడం లేదనే అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వం.. ల్యాండ్‌ పూలింగ్‌కు మొగ్గు చూపుతున్నట్టు, భూ సమీకరణకు సంబంధించి శాసనసభలో చట్టం చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

ప్రాజెక్టులు కదలక..వ్యయం పెరిగి.. 
ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలోని వనరుల సమీకరణ కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులు ఎక్కువగా ల్యాండ్‌ పూలింగ్‌పై దృష్టి పెట్టాలని, దీని ద్వారా అభివృద్ధి కార్యకమాలు చేపట్టిన రాష్ట్రాల్లో అధ్య యనం చేయాలని ఆదేశించింది. ఒకరి భూమి మరొకరికి లబ్ధి చేకూరుస్తోందన్న అభిప్రాయం భూములు కోల్పోతున్న వారిలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భూ సేకరణ సంక్లిష్టంగా మారిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భూ సేకరణ ప్రారంభం కాకముందే ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం, టెండర్లు అవార్డు చేసిన తరువాత ఎక్కడో ఒకచోట భూ సేకరణకు ఆటంకం ఏర్పడితే.. ఆ ప్రాజెక్టు ముందుకు కదలకపోవడం వల్ల వ్యయం విపరీతంగా పెరిగిపోతున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.  

కేవలం 700 మీటర్ల భూమి సమస్యతో..: దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక ప్యాకేజీలో కేవలం 700 మీటర్ల భూ సేకరణ సమస్య న్యాయ వివాదంలో చిక్కుకోవడం వల్ల కాల్వలు తవ్వడం ఆగిపోయిన వైనాన్ని ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో వివరించినట్లు సమాచారం. 2013 భూ సేకరణ చట్టం ప్రకా రం రిజిస్ట్రేషన్‌ విలువ కంటే మూడు రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లిస్తున్నా.. వాస్తవ మార్కెట్‌ విలువతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడంతో రైతులు తమ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. పరిశ్రమల కోసం భూసేకరణ మరీ జఠిలంగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. 

ఈ నేపథ్యంలో భూ సమీకరణ కింద అభివృద్ధి చేసిన స్థలాలను ఇవ్వడం ద్వారా భూమిని కోల్పోతున్న రైతులకు అంతకంటే అధిక ధర లభించేలా చేయొచ్చన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భూ సమీకరణకు సంబంధించి ఎలాంటి విధానం అవలంబించాలి? ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి విధానం అమల్లో ఉందో పరిశీలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే భూ సమీకరణ విధానాన్ని అనుసరిస్తున్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో పర్యటించాలని, అక్కడి విధానా న్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. 

ఉప్పల్‌ భగాయత్‌ తరహాలోనూ.. 
రీజినల్‌ రింగ్‌ రోడ్డు (దక్షిణ భాగం), హైస్పీడ్‌ రైలు కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లు, సాగునీటి ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌లకు కోసం అవసరమైన భూములను సమీకరించడం, సమీకరించిన భూమిని అభివృద్ధి చేశాక, కొంత విభాగాన్ని తిరిగి భూయజమానులకు (లే అవుట్‌ ప్లాట్ల రూపంలో) కేటాయించే విధానం (ల్యాండ్‌ పూలింగ్‌) వల్ల ఎవరికీ నష్టం ఉండదన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన ఉప్పల్‌ భగాయత్‌ మోడల్‌ తరహా పద్ధతిని అమలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వంద అడుగుల రహదారి నిర్మిస్తే.. రహదారికి రెండువైపులా మరో వంద అడుగుల లెక్కన భూమి సమీకరించి.. అందులో అందరికీ అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించడం ద్వారా ఎవరికీ నష్టం ఉండదని, ఆ రహదారి మొత్తం అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. 

భూ సేకరణ అంటే...
ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం (రోడ్లు, ప్రాజెక్టులు మొదలైనవి) రైతు లేదా భూమి యజమాని నుంచి వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా/చట్టబద్ధంగా భూమి ని స్వా«దీనం చేసుకుంటుంది. ఇందుకు ప్రతిఫలంగా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం నగదు రూపంలో నష్టపరిహారం చెల్లిస్తుంది. దీంతో ఆ భూములపై రైతులకు ఉన్న అన్ని హక్కులూ పోతాయి. 

భూ సమీకరణ అంటే... 
ఇది రైతుల భాగస్వామ్యంతో జరిగే ప్రక్రియ. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు అప్పగించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం రైతుల నుంచి భూమిని తీసుకుని, అందులో మౌలిక వసతులు (రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటివి) కల్పించడం ద్వారా అభివృద్ధి చేస్తుంది. ఆ విధంగా అభివృద్ధి చేసిన భూమిలో కొంత భాగాన్ని (ప్లాట్ల రూపంలో) తిరిగి రైతులకు కేటాయిస్తుంది. (అభివృద్ధి చేసిన భూమి కాబట్టి విలువ పెరిగి రై తుకు లేదా భూ యజమానికి ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది). మిగిలిన భూమిని ప్రజావసరాలకు ఉపయోగిస్తుంది. ఇందులో ముఖ్యమై న అంశం ఏమిటంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం అనేది ఉండదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement