ఇది ప్రభుత్వ స్థలం అని తహసీల్దార్ నిర్ధారించిన పత్రం.. మోకిలలో ప్రభుత్వ స్థలం అంటూ పెట్టిన బోర్డు
మోకిలలో 2.20 ఎకరాలు ఆక్రమణకు కబ్జాదారుల యత్నం
భూమిని చదును చేసే పనిని అడ్డుకున్న గ్రామస్తులు
ప్రజా అవసరాలకు కేటాయించాలన్న పంచాయతీ పాలకవర్గం
పట్టించుకోని అధికారులపై విమర్శలు
ఆ భూమి ప్రభుత్వ ఆదీనంలోనే ఉందన్న తహసీల్దార్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంతమంది అక్రమార్కులు ఖాళీ భూమి కన్పిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. రాత్రికి రాత్రే చదును చేసి, చుట్టూ ప్రీకాస్ట్ గోడలు నిర్మిస్తున్నారు. అదే క్రమంలో రూ.50 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కళ్లముందే కబ్జా చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. శంకర్‌పల్లి మండలం మోకిల రెవెన్యూ సర్వే నంబర్ 31/24లో 64.02 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ప్రభుత్వం 60 ఎకరాలకుపైగా భూమిని పేదలకు అసైన్ చేసింది. పేద రైతులకు సైతం కొంత అసైన్ చేయగా మరో 2.20 ఎకరాల భూమి మిగిలి ఉంది. ఈ మిగులు భూమిని సర్వే నంబర్ 31/24 కింద నమోదు చేశారు.
అయితే ఖరీదైన ఈ భూమిపై స్థానికంగా ఉన్న కబ్జాదారులైన రియల్టర్ల కన్నుపడింది. ఎలాగైనా కాజేయాలని పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారు. ఆ మేరకు ఇటీవల భూమిలోని చెట్లను తొలగించి, చదును చేసే పనిలో నిగ్నమయ్యారు. ఇప్పటికే అసైన్డ్ భూముల్లో సైతం అనధికారిక వెంచర్లు చేసి, ప్లాట్లు చేసి అమ్మిన రియల్టర్లు.. ఖాళీ ప్రభుత్వ భూమిని ఎలాగైనా ఆక్రమించాలని యత్నించారు. అయితే విషయం తెలిసిన గ్రామస్తులు వారి ప్రయత్నాలను అడ్డుకోవడంతో కబ్జా కుట్ర వెలుగులోకి వచ్చింది. అయితే తమ వద్ద భూమి తాలూకు దస్త్రాలు ఉన్నాయని రియల్టర్లు చెబుతుండటం విశేషం.
అధికారుల తీరుపై విమర్శలు..
ఖరీదైన ఈ భూమిని ప్రజా అవసరాలకు కేటాయించాల్సిందిగా కోరుతూ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి, తహశీల్దార్, మండల రెవెన్యూ అధికారి ద్వారా కలెక్టర్‌కు పంపింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇదే మండలం పరిధిలోని దొంతన్‌పల్లి రెవెన్యూ సర్వే నంబర్ 197లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. హైదరాబాద్–శంకర్‌పల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ స్థలం గజం విలువ బహిరంగ మార్కెట్లో రూ.లక్షకు పైగా ఉన్నట్లు అంచనా.
ప్రభుత్వ భూమిని కాపాడాలి
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుండటంతో అడ్డుకుని తహశీల్దార్, ఆర్‌డీఓలకు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. ఖాళీగా ఉన్న ఈ భూమిని ప్రజా అవసరాలకు కేటాయించాలి. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కబ్జాకు యత్నించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. – అనిల్, గ్రామస్తుడు, మోకిల
అది సర్కారు భూమే
మోకిల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 31/24లో ఉన్న భూమి ప్రభుత్వానిదే. అది ప్రభుత్వ ఆ«దీనంలోనే ఉంది. ఇది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఓ బోర్డు నాటాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించా. ఎవరైనా కబ్జాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సురేందర్, తహసీల్దార్, శంకర్‌పల్లి


