ప్రాణం తీసిన అవమానం! | Junior Inter district second ranker commits dead | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అవమానం!

Jul 29 2026 4:34 AM | Updated on Jul 29 2026 4:34 AM

Junior Inter district second ranker commits dead

జూనియర్‌ ఇంటర్‌ జిల్లా సెకండ్‌ ర్యాంకర్‌ ఆత్మహత్య 

ఫస్ట్‌ ర్యాంకర్‌తో పోలుస్తూ లెక్చరర్‌ హేళన చేయడంపై ఆవేదన 

వాగ్వాదం నేపథ్యంలో లెక్చరర్‌ చేయి చేసుకోవడంతో మానసిక వ్యథ 

అధ్యాపకురాలిని శిక్షించాలంటూ సూసైడ్‌ నోట్‌ 

గద్వాల జిల్లా కొత్తపల్లిలో ఘటన  

గద్వాల క్రైం: అతనో నిరుపేద విద్యార్థి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతూనే ఫస్టియర్‌లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో ర్యాంకర్‌గా నిలిచాడు. అయితే ఓ లెక్చరర్‌ మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ హేళన చేయడం.. చెంపపై కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో కుంగుబాటుకు లోనై బలవన్మరణానికి పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం, సూసైడ్‌ నోట్‌ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ 
కొత్తపల్లికి చెందిన నేతి»ొట్టు తెలుగు బుచ్చన్న, రేణమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరి రెండో కుమారుడు తరుణ్‌ (17) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత శనివారం కళాశాలలో ఓ మహిళా లెక్చరర్‌ ఫస్టియర్‌లో మరో విద్యార్థికి వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ తరుణ్‌ను హేళన చేసింది. దీంతో అతను ఇలా నిరుత్సాహపర్చడం సబబు కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. 

విచక్షణ కోల్పోయిన సదరు లెక్చరర్‌.. ‘నీవేమైనా మంత్రి కుమారుడివా.. అంతకన్నా గొప్పవాడివా’అంటూ అతన్ని చెంపపై కొట్టింది. దీంతో తరుణ్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రెండురోజుల పాటు కలత చెందాడు. చివరకు తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఎంతగానో కుంగిపోయా.. 
వాస్తవానికి తరుణ్‌ సోమవారం ఉదయం విషయం కళాశాల ప్రిన్సిపల్‌ వీరన్న దృష్టికి తీసుకెళ్లగా ఆయన సర్ది చెప్పారు. అయినప్పటికీ తరుణ్‌ తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఒక విద్యార్థిని అతిగా పొగిడి.. మరో విద్యార్థిని నిరుత్సాహపర్చడం నా దృష్టిలో సరైంది కాదు.. లెక్చరర్‌ చర్యల వల్ల నేను ఎంతగానో కుంగిపోయా. నేను బాధపడిన విషయం ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ లెటర్‌ రాస్తున్నాను. ఓ లెక్చరర్‌గా విద్యార్థులను ‘ప్రోత్సహించకపోయినా పర్వాలేదు.. నిరుత్సాహ పర్చకండి. 

నా చావుకు కారణమైన ఆ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకుని, అలాంటి ప్రవర్తనకు ఆమెను బాధ్యురాలిని చేసినప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది..’అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. చదువులో చురుకైన విద్యార్థి మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ విషయమై రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను సంప్రదించగా.. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.  

కౌన్సెలింగ్‌ ఇచ్చి నచ్చజెప్పా.. 
‘తరగతి గదిలో శనివారం జరిగిన సంఘటనపై వాకబు చేశాం. తరుణ్‌ కంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థిని ఎంఎల్‌టీ లెక్చరర్‌తో తనకు వచ్చిన మార్కులు గురించి వివరించింది. ఈ క్రమంలో ఆ మహిళా లెక్చరర్‌ తరగతి గదికి వెళ్లి అందరి ముందు ఉత్సాహపరించింది. దీంతో స్పందించిన తరుణ్‌..‘ప్రోత్సహించడంలో వ్యత్యాసం చూపకండి.. అయినా మీరు మా క్లాస్‌కు సంబంధించిన లెక్చరర్‌ కాదు కదా’అని అనడంతో వివాదం చోటుచేసుకుంది. ఆ విద్యార్థికి సోమవారం కౌన్సెలింగ్‌ ఇచ్చి నచ్చజెప్పా. లెక్చరర్‌ను కూడా మందలించాం. ఇంతలోనే అతను బలవన్మరణానికి పాల్పడటం తీవ్రంగా కలచివేసింది..’అని ప్రిన్సిపల్‌ వీరన్న చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement