రాజోళి: ‘నారు పోసినవాడు నీరు పోయకపోతాడా’ అనే నానుడితో జిల్లాలోని తుంగభద్ర నది తీర గ్రామాల రైతన్నలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తుంగభద్రలో వరద పారకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పుడో.. ఇప్పుడో నదికి నీరు వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నప్పటికీ.. రోజులు గడుస్తుండటంతో మదనపడుతున్నారు. ఏటా ఈ సమయానికే నదికి వరద రావడం.. వరినాట్లు వేయడంలో బిజీగా ఉండే అన్నదాతలు.. రైతు కూలీలు.. ఇదెక్కడి పరిస్థితిరా దేవుడా అంటూ నిరుత్సాహపడుతున్నారు.
నదీతీర గ్రామాలే కీలకం..
జిల్లాలోని అయిజ మండలం కుట్కనూరు శివారు దగ్గర తుంగభద్ర నది ప్రవేశిస్తుంది. దీంతో ఈ నది నీటిపై ఆధారపడి అయిజ, రాజోళి, వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట సాగు చేస్తారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలు సమయంలో కూడా ఈ నదీ తీర గ్రామాల నుం,ఊ ఎక్కువగా ధాన్యం అమ్మకానికి వస్తుంది. ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో సింహభాగం వరి పంట మాత్రమే సాగు చేస్తారు. మరికొన్ని చోట్ల కేవలం వరి పంటకు మాత్రమే ఉపకరించే భూములు ఉండటంతో వరి పంటనే వారి జీవనాధారం. అయిజ మండలంలో దాదాపు 15 వేల ఎకరాలు, రాజోళి మండలంలో 8 వేలు, వడ్డేపల్లి మండలంలో 6 వేలు, మానవపాడు మండలంలో 2 వేలు, ఉండవెళ్లి మండలంలో 1,500లు, అలంపూర్ మండలంలో 1,200 ఎకరాలకు పైగా వరినాట్లు వేసి సాగు చేస్తారు. నీటి లభ్యతను బట్టి, పంటల మార్పిడిలో భాగంగా ఈ సాగు పెరిగిన దాఖలాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది ఇంత వరకు వందల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడినట్లు తెలుస్తుంది.
మూసుకుపోయిన దారులు
గతంలో కర్ణాటక పరిధిలో దిగువకు నీరు వదులుతున్నామని చెప్పగానే.. అప్పటికే సిద్ధం చేసుకున్న నారును తీసుకుని, తీర గ్రామాల రైతులు జోరుగా నాట్లు వేసేవారు. ఈ ఏడాది మాత్రం నారు పోసుకున్నప్పటికీ నీరు రాకపోవడంతో సిద్ధం చేసుకున్న నారు, కరిగెట, ఇతర సేద్యం పనులకు పెట్టుబడి పెట్టి ఎదురుచూస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా నదిలో నీరు లేకపోవడం, ఇటు ఆర్డీఎస్ కెనాల్ ఎండిపోవడం, బోర్లలో నీరు ఇంకిపోవడం, కొన్నిచోట్ల రైతులు ఏర్పాటు చేసుకున్న నీటి వనరులు కూడా ఎండిపోవడంతో నీరందించే దారులన్నీ మూసుకుపోయినట్లయిందని, ఫలితంగా ఈసారి సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నేటికీ రాళ్లు, రప్పలతో
కనిపిస్తున్న తుంగభద్ర నది
పరివాహక గ్రామాల్లో కనిపించని
రైతు కూలీల సందడి
ఇప్పటికే ముదిరిపోతున్న వరినారు మడి
గతేడాది ఈపాటికే జోరుగా వరి నాట్లు


