రాష్ట్రంలో రాయల్‌ గర్జన! | Today is International Tiger Day | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాయల్‌ గర్జన!

Jul 29 2026 4:58 AM | Updated on Jul 29 2026 4:58 AM

Today is International Tiger Day

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

తెలంగాణలో పెద్ద పులుల సందడి 

మొత్తంగా రాష్ట్రంలో 48 నుంచి 50 దాకా ఉండొచ్చునని అంచనా 

ఒక్క అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లోనే 42 స్థిరనివాసం ఏర్పాటు 

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ఏరియాలో శాశ్వత లేదా సంతానోత్పత్తి చేసే పులులు లేవు 

కవ్వాల్‌లో పులుల సంఖ్యను పెంచేందుకు ఎన్‌టీసీఏ.. 

ఇటీవల మొదటి దశ పులుల పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పెద్ద పులులు సందడి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వాటి కదలికలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌కు 60 కి.మీ దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 50 ఏళ్ల తర్వాత పెద్దపులి కనిపించి స్థానికులను ఆశ్చర్యంతో పాటు భయాందోళనలకు గురిచేసింది. రాష్ట్ర రాజధానికి దాదాపు వంద కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాల్లో.. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పులి ప్రవేశించింది. వీటితో పాటు.. కొన్నిరోజులుగా వివిధ జిల్లాల్లో పెద్దపులుల పాదముద్రలు, వాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. 

పులులు ఆహార అన్వేషణకు, తమ ఆవాస స్థిరీకరణ కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నాయనే వాదన దీనినే బలపరుస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో (టైగర్‌ రిజర్వ్‌ల వెలుపలి ప్రదేశాల్లో) దాదాపు ఆరేడు కొత్త పులుల (మొత్తం కలిపి) సంచారంపై తమకు సమాచారం ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ప్రస్తుతం 19 జిల్లాల్లో వాటి పాదముద్రలు, విసర్జనలు (పెంటికలు), ఆవులు, దూడలు, ఇతర జంతువులపై దాడుల వంటి ఘటనల ద్వారా గుర్తించినట్టు సాక్షికి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశించిన ఈ ఆరేడు పులుల కదలికలే ఆయా జిల్లాల్లోనూ కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. 

ఒక పులి మణుగూరులో స్థిర నివాసం ఏర్పరుచుకోగా, ఆంధ్రా–ఖమ్మం సరిహద్దులలో మరొకటి, లక్సెట్టిపేటలో ఇంకొకటి, తిర్యాణీ–ఆసిఫాబాద్‌లలో మరోటి సంచరిస్తోంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో పెద్దపులుల సంఖ్య 48 నుంచి 50 దాకా ఉండొచ్చునని అటవీ అదికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా ఫొటోలు, తదితర ఆధారంగా చూస్తే అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో 36 (అదనంగా పులి పిల్లలు 6 దాకా), కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ (కేటీఆర్‌) చుట్టుపక్కల అయిదు.. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఇంకా ఇతర జిల్లాల్లో మూడు, నాలుగు ఉంటాయని చెబుతున్నారు. 

అక్కడి నుంచే వలసలు..
ఆదిలాబాద్‌ జిల్లాలోకి పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని తాడోబ–అంధారీ టైగర్‌ రిజర్వ్, తిప్పేశ్వర్‌ వైల్డ్‌లైఫ్‌ సఫారీపార్క్‌ ఛత్తీస్‌గడ్‌ బీజాపూర్‌ జిల్లాలోని ఇంద్రావతి పులుల అభయారణ్యాల నుంచి పెద్దపులుల వలసల పెరుగుదల ప్రధాన కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి పులులు గోదావరి, ఇంద్రావతి, పెన్‌గంగా నదులు దాటి తెలంగాణ అడవుల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని టైగర్‌ రిజర్వ్‌లలో పులుల సంతతి బాగా పెరగడంతో, ఆహారం–ఆవాసం వెతుకులాటలో ఈ వలసలు పెరుగుతున్నాయి. 

ఈ విధంగా పొరుగు రాష్ట్రాల నుంచి.. టైగర్‌ కారిడార్‌గా ఉన్న రాష్ట్రంలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ మీదుగా పెద్దపులులు వివిధ జిల్లాల్లో సంచరించడం అధికమైంది. జగిత్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో పులుల కదలికలు పెరిగాయి. అయితే మహారాష్ట్ర నుంచి కవ్వాల్‌ రిజర్వ్‌కు పులులు వస్తున్నప్పటికీ.. అవి అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. తరచూ వలస పులులు వస్తూ పోతుండడంతో అనిశ్చితి ఏర్పడింది.

ఏటీఆర్‌లోనే 42.. కేటీఆర్‌లో పులుల పునరుద్ధరణ ప్రాజెక్టు
రాష్ట్రంలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)లో అటవీ రక్షణ చర్యలు విజయవంతం కావడంతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజా 2026 ముందస్తు అంచనాల ప్రకారం.. ఏటీఆర్‌లో గతంలో ఉన్న 36 నుంచి పెద్దపులుల సంఖ్య 42కి పెరిగింది. ఇక్కడ విజయవంతంగా సంతానోత్పత్తి జరుగుతోంది. అమ్రాబాద్‌ పులుల వర్గీకరణ ఇలా ఉంది.. ఆడ పులులు –18, మగ పులులు –14, అర్ధ–వయోజన పులులు–2, పులి పిల్లలు (కబ్స్‌)–8 ఉన్నాయి. తాజా ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ (ఏఐటీఈ 2026) నివేదికల ప్రకారం.. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ (ప్రధాన) ఏరియాలో ప్రస్తుతం ఎటువంటి శాశ్వత లేదా సంతానోత్పత్తి చేసే పులులు లేవు.

మహారాష్ట్రలోని తడోబా–అంధారి, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి రిజర్వ్‌ల నుండి సుమారు 5 పులులు అప్పుడప్పుడు కవ్వాల్‌ సరిహద్దులు, బఫర్‌ జోన్, కారిడార్ల (కాగజ్‌నగర్‌ డివిజన్‌) గుండా ఇక్కడికి వస్తూ వెళ్తుంటాయి. అయితే, అవి ఇక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదు. అడవుల నరికివేత, మానవ జోక్యం, శాశ్వత ఆడ పులులు లేకపోవడం, వేటాడే జంతువుల కొరత కారణంగా పులులు ఇక్కడ స్థిరపడలేక పోతున్నాయి. కవ్వాల్‌లో పులుల సంఖ్యను పెంచేందుకు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఇటీవల మొదటి దశ పులుల పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 

ఇందులో భాగంగా మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్‌ నుండి ఐదు పులులను (కనీసం ఒక ఆడపులితో కలిపి) కవ్వాల్‌కు తరలించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. పులుల అభయారణ్యం ప్రధాన ప్రాంతం (కోర్‌ ఏరియా) నుంచి గ్రామాల తరలింపు ఒకవైపు విజయవంతంగా సాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్థానిక గిరిజన తెగల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ను మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్‌తో కలిపే కారిడార్‌ను సురక్షితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,500 చ.కి.మీ పరిధిని ’కుమురం భీమ్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌’గా నోటిఫై చేయాలని భావించింది. అయితే తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, దీని ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని స్థానిక గిరిజనులు భారీ బంద్‌ నిర్వహించడంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement