నాలుగు రాస్తే.. ఇచ్చేది రెండే | Medicine Shortage in Government Hospitals: Telangana | Sakshi
Sakshi News home page

నాలుగు రాస్తే.. ఇచ్చేది రెండే

Jul 31 2026 12:01 AM | Updated on Jul 31 2026 12:01 AM

Medicine Shortage in Government Hospitals: Telangana

వరంగల్‌ ఎంజీఎంలో ఓపీ కోసం బారులు తీరిన జనం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత 

ఆగస్టులో పొంచి ఉన్న జ్వరాల ముప్పు

ఇంకా సన్నద్ధం కాని వైద్యారోగ్యశాఖ 

వారం రోజులుగా అకస్మాత్తుగా పెరిగిన ఓపీ

అపరిశుభ్రత.. పనిచేయని పరికరాలు, సిబ్బంది కొరత షరామామూలే  

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ప్రభుత్వాస్పత్రులను మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏడాది కాలంగా వైద్యారోగ్యశాఖ నుంచి అరకొర సరఫరానే జరుగుతోంది. వరంగల్‌ ఎంజీఎం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లోని అన్ని విభాగాలకు సంబంధించిన మందుల కొరత ఉంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. 

వారం రోజులుగా అన్ని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో 50 శాతం మేర ఓపీ కేసులు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరగనుంది. అయితే అపరిశుభ్రతతో ప్రబలే డెంగీ, మలేరియా లాంటి రోగాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే జనాలు అక్కడి అపరిశుభ్రతను చూసి బెంబేలెత్తే పరిస్థితులు తలెత్తుతున్నాయి.మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వైద్యారోగ్యశాఖ మెరుగైన చికిత్స అందించేందుకు సమాయత్తం కావాల్సిన అవసరముంది.  

వైద్యులు లేరు.. ఉన్నచోట సమయానికి రారు  
కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకున్నా, జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలలో వైద్యుల కొరత వేధిస్తోంది. వైద్యులు ఉన్న చోట సమయపాలన పాటించడం లేదు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జీజీహెచ్‌లలో, వరంగల్‌ ఎంజీఎం, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లోని అన్ని ఆస్పత్రుల్లో వైద్యుల సమయపాలనపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేటలో వైద్యుల కొరతతో రోగులకు వైద్యం అందడం లేదు. ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టు సంస్థలు పట్టింపులేకుండా వ్యవహరిస్తుండడం, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించకపోవడంతో, బాత్రూమ్‌లను శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. వార్డు ల్లో సైతం శుభ్రత లోపించి రోగులు ఇబ్బందులు పడుతున్నారు.  

పరికరాలు ఉన్నా... వినియోగం సున్నా  
రాష్ట్ర వ్యాప్తంగా పలు జనరల్‌ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొరత వేధిస్తుండగా, కొన్ని చోట్ల వినియోగం కరువై నిరుపయోగంగా పడి ఉన్నాయి. 
 పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన 2 ఫుల్లీ ఆటోమెటేడ్‌ బయో కెమిస్ట్రీ అనలైజర్లు వినియోగం లేక మూలనపడ్డాయి.  
వరంగల్‌ ఎంజీఎంలో ఈసీజీ ఎక్స్‌రే వంటిమెషీన్లు తరచూ మొరాయిస్తున్నాయి. అ్రల్టాసౌండ్‌ మానిటర్లు, వెంటిలేటర్ల కొరత ఉంది.  

టీ–హబ్‌లు ఉన్న జిల్లా కేంద్రాలలో మెషీన్లు మొరాయిస్తుండడం, ఇంజనీర్లు జాప్యం చేస్తుండడంతో మరమ్మతులు ఆలస్యమై రోజుల తరబడి రోగులు రక్త పరీక్షలకు దూరమవుతున్నారు.  ళీ మంచిర్యాలలో స్కానింగ్, ఎక్స్‌రే సేవలు నిలిచిపోయాయి.  
  ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ఎక్స్‌రే మెషీన్, టిఫా స్కాన్, కెమిస్ట్రీ అనలైజర్లు తరచూ మొరాయిస్తున్నాయి.  
 కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో సర్జికల్‌ మెటీరియల్‌ కొరత ఉంది. ఎక్స్‌రే మెషీన్లు తరచు పనిచేయడం లేదు.

మందులు లేవని చెప్పారు..  
నాకు చెస్ట్‌లో నొప్పిగా ఉంటే నిజామాబాద్‌ జనరల్‌ ఆస్పత్రికి వచ్చాను. అల్ట్రా సౌండ్‌ పరీక్ష చేసి లోపల గడ్డ అయిందని చెప్పారు. డాక్టర్‌ నాలుగు రకాల మందులు రాస్తే ఆస్పత్రిలో రెండు రకాలు ఇచ్చారు. మిగతా రెండు రకాల మందులు ఇక్కడ లేవు, బయట కొనుక్కోవాలని చెప్పారు. మేం కూలీ పనులు చేసుకుంటాం. ఆస్పత్రిలోనే మందులు ఉచితంగా ఇస్తే బాగుండేది.  – సుచిత్ర, కోటగల్లీ, నిజామాబాద్‌

మందులు బయట కొనుక్కోమని చెప్పారు  
ఈ ఫోటోలో ఉన్న బాలుడి పేరు మనోజ్‌. నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్‌కు చెందిన ఈయనకు చిన్నప్పటి నుండే మాటలు రావు. అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి సరిగ్గా నిద్ర పోవడం లేదని మనోజ్‌ను ఆయన తండ్రి హనుమంతు హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. డాక్టర్‌కు చూయించుకున్న తర్వాత ఫార్మసీ దగ్గరకు వెళ్తే ఒక టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చి ఇంకోటి బయట తీసుకోమన్నారని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.  

రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయి  
అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చి రెండు రోజులు అవుతుంది. వైద్యులు చికిత్స నిమిత్తం కొన్ని రకాల పరీక్షల కోసం టెస్టులు రాశారు అందుకోసం రక్తంతో పాటు మూత్రం శాంపిల్స్‌ ల్యాబ్‌లో ఇచ్చాను రిపోర్టులు వచ్చిన తర్వాతనే వాటి ఆధారంగానే చికిత్స చేస్తామని వైద్యులు చెబుతున్నారు. కానీ రిపోర్టులు రెండు రోజులు గడిచినా రాలేదు. – గణేశ్‌ నారాయణపురం, భువనగిరి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement