హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర క్రీడా సంఘాలతో వ్యూహాత్మక సమావేశాల శ్రేణిని ప్రారంభించింది.
స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎ. సోనిబాలా దేవి, ఐఎఫ్‌ఎస్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో అథ్లెటిక్స్, సైక్లింగ్, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, మల్లఖంబ్, గట్కా, కలరిపయట్టు తదితర రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పతకాల సాధనకు అవకాశమున్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి శాస్త్రీయ విధానంలో శిక్షణ అందించే కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా సెలెక్షన్ ట్రయల్స్, అనంతరం ఫస్ట్ లెవల్ క్యాంప్, చివరగా కోర్ క్యాంప్ నిర్వహించేలా ప్రణాళికను రూపొందించారు. ప్రతి దశకు సంబంధించిన కాలవ్యవధి, శిక్షణా ప్రణాళిక, అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సామగ్రి, కోచ్‌ల నియామకం తదితర అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా డా. ఎ. సోనిబాలా దేవి మాట్లాడుతూ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో స్వరాష్ట్రంలోనే తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి, వారికి వ్యవస్థీకృత శిక్షణ అందించేందుకు ఎస్‌ఏటీజీ కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రానికి పతకాల అవకాశాలు అధికంగా ఉన్న క్రీడలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రత్యేక శిక్షణా శిబిరాలు, కోచింగ్, అవసరమైన సహాయ సహకారాన్ని అందించే దిశగా క్రీడల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా మిగిలిన రాష్ట్ర క్రీడా సంఘాలతోనూ దశలవారీగా సమావేశాలు నిర్వహించి సన్నాహాలను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్, శ్రీనివాస్, అశోక్, పి ఆర్ ఓ సురేష్ కాలేరు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, ప్రతినిధి ప్రవీణ్‌తో పాటు వివిధ రాష్ట్ర క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


