Photo Credit: BCCI Twitter
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ, శ్రీలంకతో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఊహించిన విధంగానే, దక్షిణాఫ్రికా టెస్ట్ పర్యటనలో నిరాశాజనక ప్రదర్శన, ఆఫ్ఘనిస్తాన్‌పై సాధారణ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ , ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
అయితే మరోవైపు ధ్రువ్ జురెల్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. పంత్‌కు బ్యాకప్‌గా ప్రతీ సిరీస్‌కు ఎంపికవుతూ వస్తున్న ధ్రువ్ జురేల్ సిరీస్ సిరీస్‌కు రాటుదేలుతూ పంత్‌కు పక్కలో బల్లెంలా తయారయ్యాడనిపిస్తోంది. టెస్టు క్రికెట్‌లో ఇప్పటికైతే టీమిండియా వికెట్ కీపర్‌గా మొదటి ప్రాధాన్యత పంతకే ఉన్నప్పటికీ, జురేల్ రాకతో పోటీ తీవ్రమయింది. జురెల్ తనకు అవకాశాలు వచ్చినప్పుడల్లా బ్యాటింగ్‌తో పాటు వికెట్ల వెనుక కూడా నిలకడ ప్రదర్శిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకునే పనిలో పడ్డాడు.

Photo Credit: BCCI Twitter
ఈ నేపథ్యంలోనే పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి జురెల్ నిజంగా అర్హుడేనా అని చూస్తే మాత్రం తొలి 10 టెస్టుల్లో పంత్ 727 పరుగులు చేస్తే, ధ్రువ్ జురెల్ 478 పరుగులు సాధించాడు. అయితే పంత్ టెస్టుల్లో ప్రధానంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ జురెల్ జట్టులో ఉంటే అతడి బ్యాటింగ్ స్థానం ఆరు లేదా ఏడు.
దీనివల్ల జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లంతా ఔటైన తర్వాత కానీ ధ్రువ్ జురెల్‌కు అవకాశం రావడం లేదు. దీంతో అతడు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడేందుకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే ఒత్తిడి పరిస్థితులు ఉన్నప్పుడు సంయమనం పాటించడంలో పంత్‌తో పోలిస్తే జురెల్ ఒక మెట్టుపైనే ఉంటాడు.
ఇక జురెల్‌తో పోలిస్తే పంత్ ప్రతీ 100 బంతులకు 18 పరుగులు వేగంగా సాధించడంలో దిట్ట. ఇంగ్లండ్‌లో జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియాలో నాథన్ లయన్ ఇలా విదేశీ గడ్డపై ఎలాంటి బౌలర్లనైనా తన దూకుడైన బ్యాటింగ్‌తో పరుగులు సాధించడంలో ముందుంటాడు. అయితే పంత్‌తో పోలిస్తే ధ్రువ్ జురెల్‌ది పూర్తిగా భిన్నమైన బ్యాటింగ్. టెక్నికల్‌గా బ్యాటింగ్ ఆడడంలో నేర్పరి అయిన ధ్రువ్ జురెల్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. తర్వాత ఓపికతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌లు నిర్మించడంలోనూ జురెల్ ముందు వరుసలో ఉంటాడు.
బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే, వికెట్‌కీపింగ్ నైపుణ్యంలో మాత్రం పంత్, జురెల్ సమానంగానే కనిపిస్తున్నారు. పది టెస్టుల తర్వాత పంత్ వికెట్ల వెనుక 47 డిస్మిసల్స్ చేస్తే, జురెల్ 15 నమోదు చేశాడు. ఇది పంత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, పంత్ కీపర్‌గా లేని 10 ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే కీపింగ్ చేశాడు.
అదీగాక జురెల్ తుదిజట్టులో ఉన్నప్పటికీ, అనేక మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ లేదా పంత్‌లో ఒకరు గ్లోవ్స్ చేపట్టేవారు. అయితే 2026లో దేశీయంగా జురెల్ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ, విదేశీ పర్యటనలన్నింటిలోనూ పంత్‌కు ప్రత్యామ్నాయంగా జురెల్‌ను ఎంపిక చేస్తూ ఉండడం, అతడి వికెట్‌కీపింగ్ సామర్థ్యాలపై యాజమాన్యానికి నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది.
Read: ‘కంగ్రాట్స్ జింక్స్.. నువ్వు నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్’


