PC: SAI Media X
భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా కామన్‌వెల్త్ గేమ్స్-2026 జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా కామన్‌వెల్త్ క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. నీరజ్ చోప్రాతో పాటు భారత్‌కే చెందిన రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు.
12 మందికి అర్హత
ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు.
రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్‌వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో వీరిద్దరు తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు.
అగ్రస్థానం అతడిదే
ఇక శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగే 82.84 మీటర్ల దూరం ఈటెను విసిరి తొలి స్థానం దక్కించుకున్నాడు. మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 78.63 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం ఆగష్టు 1న ఉదయం 12.45 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.


