PC: BCB/X
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఇంకా ఆమోదం రాలేదని తెలిపాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు భారత్- బంగ్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
నాటి ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా..
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను బీసీసీఐ తొలగించింది. దీంతో వరల్డ్‌కప్ ఆడేందుకు తాము భారత్‌కు రాబోమని బీసీబీ భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి డెడ్‌లైన్ విధించగా.. బీసీబీ మాత్రం భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపించింది. ఈ క్రమంలో టోర్నీ నుంచే నిష్క్రమించింది.
అయితే, నాటి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం చర్యల కారణంగా ఈ మేరకు బీసీబీ- బీసీసీఐ మధ్య విభేదాలు తలెత్తగా.. బంగ్లా టూర్‌ను బీసీసీఐ రద్దు చేసుకుంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం రాగానే బీసీబీ అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పదవి చేపట్టాడు.
నాటి నుంచి బీసీబీ- బీసీసీఐ మధ్య సంబంధాల పునరుద్ధరణ కోసం తమీమ్ ఇక్బాల్ కృషి చేస్తోంది. ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ.. ‘‘దురదృష్టవశాత్తూ భారత్- బంగ్లాదేశ్ సిరీస్ గురించి ఇంతవరకు నా వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బీసీసీఐతో మేము చర్చలు కొనసాగిస్తున్నాము. ఇరు బోర్డు అధికారుల మధ్య ఇ-మెయిళ్ల మార్పిడి జరుగుతోంది.
అత్యంత భద్రమైన దేశం
టీమిండియా- బంగ్లాదేశ్ సిరీస్ అంటే.. అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉంటుంది. బంగ్లాదేశ్ అత్యంత భద్రమైన దేశం. టీమిండియా మా దేశ పర్యటనకు వస్తుందని నమ్ముతున్నా. అందుకోసం మా వైపు నుంచి ఏం చేయాలో అన్నీ చేస్తాం.
అయితే, బీసీబీ అధ్యక్షుడిగా నాకంటూ కొన్ని పరిధులు ఉంటాయి. నేను వాటిని దాటకూడదు. త్వరలోనే టీమిండియాతో సిరీస్ ఉంటుందని ఆశిస్తున్నా’’ అని తమీమ్ ఇక్బాల్ చెప్పుకొచ్చాడు.
చదవండి: గిల్ సంచలన నిర్ణయం!


