సంజూ- ఇషాన్ (PC: BCCI X)
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతే.. తనకు తుదిజట్టులో చోటు ఉండదన్న సంగతి ముందే తెలుసన్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే యాజమాన్యం పెద్దపీట వేస్తుందని సంజూ పేర్కొన్నాడు.
సంజూ పూర్తిగా విఫలం
కాగా టీ20 ప్రపంచకప్-2026 కంటే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తోనే జార్ఖండ్ డైనమో ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. ఇక ఓపెనర్‌గా ఉన్న సంజూ కివీస్‌తో మ్యాచ్‌లలో 10, 6, 0, 24,6 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు.
దుమ్ములేపిన ఇషాన్
అదే సమయంలో ఇషాన్ 8, 76, 28, 103 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్ సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో సంజూకు తుదిజట్టులో చోటు దక్కలేదు.
అయితే, అనూహ్య రీతిలో నాకౌట్ దశలో తిరిగి ఓపెనర్‌గా వచ్చిన సంజూ 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాటి సంగతులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ గుర్తుచేసుకున్నాడు.
అతడు ముందుగా అసలు జట్టులోనే లేడు
జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. నిజానికి అతడు ముందుగా అసలు జట్టులోనే లేడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను ఒంటిచేత్తో గెలిచి.. తిరిగి టీమిండియాలో అడుగుపెట్టాడు.
అతడి బ్యాటింగ్ కూడా వేరే లెవల్‌లో ఉంది. అప్పుడే నాకంటే ఇషాన్‌కు ప్రాధాన్యం పెరుగుతుందని అనిపించింది. ఐదు మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఇచ్చినపుడు.. నేను 24, 6, 6, 10, 0 పరుగులు స్కోరు చేసి నిరాశపరిచాను. అదే సమయంలో.. మరొక ఆటగాడు ఏకంగా 70, 100 పరుగులు చేస్తూ శతక్కొట్టినప్పుడు.. నన్ను కాదని అతడిని నేరుగా ప్రపంచకప్ టోర్నీలో ఆడిస్తారని తెలుసు.
డగౌట్‌లో కూర్చుని చప్పట్లు కొట్టడమే నా పని
ఎవరైనా ఫామ్‌లో ఉన్న ఆటగాడే తుదిజట్టులో ఉండాలని కోరుకుంటారు. వారికే ప్రాధాన్యం ఇస్తారు. వరల్డ్‌కప్ సమయంలో నా విషయంలో ఇదే జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది.. నేనేమీ చేయలేను.. డగౌట్‌లో కూర్చుని చప్పట్లు కొట్టడమే నా పని అర్థమైంది.
భారత క్రికెటర్ల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక్కరోజులో అంతా తలకిందులు కావొచ్చు. నాకు ఏడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇస్తే.. నేను కనీసం మూడు సెంచరీలు అయినా కొడతానని అనిపించింది. కానీ అలా జరుగలేదు. టీ20 ఫార్మాట్ చాలా చిత్రమైనది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నేను పూర్తిగా విఫలమయ్యాను.
నా హయ్యస్ట్ స్కోరు 24 మాత్రమే
ఆ తర్వాత పిచ్చివాడిలా ప్రాక్టీస్ చేశాను. వరల్డ్‌కప్ తుదిజట్టులో చోటు దక్కాలంటే తీవ్రంగా కష్టపడాలని నిర్ణయించుకున్నా. అయితే, ఆ ఐదు మ్యాచ్‌లలో నా హయ్యస్ట్ స్కోరు 24 మాత్రమే. దీంతో నేను మరింతగా కుంగిపోయాను.
అయితే, అప్పుడు నా భార్య చెప్పిన మాటలు నాకు ఊరటనిచ్చాయి. గంటలు గంటలు ప్రాక్టీస్ చేసే బదులు సంతోషంగా, మానసికంగా దేనికైనా సన్నద్ధంగా ఉంటే.. ఇలాంటి తప్పిదాలు జరగవని చెప్పింది. న్యూజిలాండ్‌తో సిరీస్ నాకు చాలా విషయాలు నేర్పింది’’ అని సంజూ శాంసన్ చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
చదవండి: ఐపీఎల్ టు ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్!


