IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే! | IND vs ENG 3rd ODI: Abhishek Nayar picks IND playing 11 Leaves Dube | Sakshi
Sakshi News home page

IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!

Jul 18 2026 4:13 PM | Updated on Jul 18 2026 5:54 PM

IND vs ENG 3rd ODI: Abhishek Nayar picks IND playing 11 Leaves Dube

PC: BCCI X

వన్డే సిరీస్‌లో ఇప్పటికి చెరో మ్యాచ్‌ గెలిచి టీమిండియా- ఇంగ్లండ్‌ 1-1తో సమంగా ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్‌లో గిల్‌ సేన గెలవగా..  కార్డిఫ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో బ్రూక్‌ బృందం జయభేరి మోగించింది. రెండో వన్డేలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి 44 ఓవర్లలోనే ఆలౌట్‌ అయింది.

99 పరుగులతో అజేయంగా
వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (65), వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (66) అర్ధ శతకాల కారణంగా.. 233 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (0), జేకబ్‌ బెతెల్‌ (4) వికెట్లు కోల్పోయినా.. జో రూట్‌ ఒంటిచేతో జట్టును గెలిపించాడు.

మూడో స్థానంలో ఆడిన రూట్‌.. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య ఆదివారం లార్డ్స్‌ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.

అతడిని తొందరగా అవుట్‌ చేయాలి
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ కీలక సూచనలు చేశాడు. రూట్‌ను ఎంత త్వరగా అవుట్‌ చేశామన్న అంశం మీదే భారత జట్టు విజయం ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ క్రమంలో భారత తుదిజట్టులో పలు మార్పులు సూచించాడు.

స్టార్‌ స్పోర్ట్స్‌ షో గేమ్‌ ప్లాన్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘జో రూట్‌ను వీలైనంత త్వరగా అవుట్‌ చేయాలి. అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరం. కాబట్టి కుల్దీప్‌ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు. లేదంటే.. శివం దూబే స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌ను ఆడించవచ్చు’’ అని అభిషేక్‌ నాయర్‌ పేర్కొన్నాడు.

అయ్యర్‌ నాలుగు.. రాహుల్‌ ఐదో స్థానంలో
ఇక తాను ఎంపిక చేసుకున్న తుదిజట్టులో అభిషేక్‌ నాయర్‌ ఇద్దరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌లకు చోటిచ్చాడు. అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ రెగ్యులర్‌గా వచ్చే నాలుగో స్థానంలోనే రావాలని.. రెండో వన్డేలో మాదిరి ఇషాన్‌ కోసం అతడిని డిమోట్‌ చేయవద్దన్నాడు.

అదే విధంగా కేఎల్‌ రాహుల్‌ను ఐదో స్థానంలో ఆడించి.. ఇషాన్‌ను ఆరో నంబర్‌ బ్యాటర్‌గా పంపాలని అభిషేక్‌ నాయర్‌ సూచించాడు. కాగా అనారోగ్యం కారణంగా కేఎల్‌ రాహుల్‌ రెండో వన్డేకు దూరంకాగా ఇషాన్‌ కిషన్‌ తుదిజట్టులోకి వచ్చాడు.

నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్‌.. ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ ఐదో స్థానంలో వచ్చి అర్ధ శతకం బాదాడు. ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లో తొలిసారి ఆడే అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు అభిషేక్‌ నాయర్‌ ఎంచుకున్న భారత తుదిజట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, గుర్నూర్‌ బ్రార్‌, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌/ప్రిన్స్‌ యాదవ్‌.

చదవండి: విశ్రాంతి వద్దన్న రోహిత్‌.. అతడి కోసం గిల్‌ అనూహ్య నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement